High Court: బ్యాంకుల ప్రతాపం సామాన్యుడిపైనే
ABN, Publish Date - Jun 21 , 2025 | 04:15 AM
రూ.వేల కోట్ల రుణం తీసుకొని, ఎగవేసిన వారిని బ్యాంకులు ఏమీ చేయలేవని, సామాన్యులపై మాత్రం ప్రతాపం ప్రదర్శిస్తాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కోట్లు ఎగ్గొట్టేవారిని ఏమీ చేయలేవు.. హైకోర్టు వ్యాఖ్యలు
రుణం ముందుగా చెల్లించినందుకు రూ.1.16 కోట్ల చార్జీ వసూలు చేశారంటూ బాధితుడి పిటిషన్
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రూ.వేల కోట్ల రుణం తీసుకొని, ఎగవేసిన వారిని బ్యాంకులు ఏమీ చేయలేవని, సామాన్యులపై మాత్రం ప్రతాపం ప్రదర్శిస్తాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక లోపాలున్నాయని అభిప్రాయపడింది. ‘‘తప్పుడు డాక్యుమెంట్లు చూపించిన వారికి కనీస పరిశీలన లేకుండా రూ.కోట్లు మంజూరు చేస్తారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు తీసుకునే చిన్న రుణాలకు ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిదాల చెల్లింపుల్లో కాస్త ఆలస్యం జరిగితే మోయలేని విధంగా జరిమానాలు విధిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లించినందుకు కూడా స్టేట్ బ్యాంకు రూ.1.16 కోట్ల మేర చార్జీలు విధించడాన్ని సవాల్ చేస్తూ సనత్‌నగర్‌కు చెందిన ఉత్తమ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రుణాన్ని ముందుగా చెల్లించినందుకు చార్జీలు వసూలు చేయడం.. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్థమని పేర్కొన్నారు. వసూలు చేసిన ఛార్జీలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్టేట్ బ్యాంక్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని రిజర్వు బ్యాంకు, స్టేట్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
Updated Date - Jun 21 , 2025 | 04:15 AM