Bandi Sanjay: రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే.. మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయాలి
ABN, Publish Date - May 06 , 2025 | 05:01 AM
మావోయిస్టుల మెప్పు పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
అనేక మందిని నక్సల్స్ అన్యాయంగా చంపేశారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
గోదావరిఖని, మే 5(ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల మెప్పు పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే మావోయిస్టులను నిషేధించిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. మావోయిస్టులపై నిషేధం ఎత్తివేసి చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు.
మావోయిస్టు పార్టీతో చర్చలు లేవని, వారు బేషరతుగా తుపాకులు వీడి లొంగిపోవాలన్నారు. రాష్ట్రంలో పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్టులు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎంతో మంది ప్రజాప్రతినిధులు, నాయకులను పొట్టన పెట్టుకున్నారని పేర్కొన్నారు. ధర్మం కోసం పాటుపడిన ఎంతో మంది జాతీయ వాదులను దుర్మార్గంగా కడతేర్చారని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్న హరగోపాల్, వరవరరావులు అంత్యక్రియల్లో మృతదేహాలను మోయడం తప్ప ఏం సాధించారో చెప్పాలన్నారు.
Updated Date - May 06 , 2025 | 05:01 AM