Anganwadi: అంగన్‌వాడీ కోడి గుడ్ల టెండర్ రద్దు
ABN, Publish Date - Jul 02 , 2025 | 04:14 AM
అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టు జోనల్ టెండర్ రద్దు చేశారు. నిబంధనల సడలింపు పేరుతో పలుమార్లు గడువు పెంచిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చివరకు టెండర్‌ను ఆపేశారు.
పరిపాలనా పరమైన కారణాల వల్లేనని ప్రకటన
విద్యా సంస్థలతో కలిపి టెండర్లకు వెళ్లే అవకాశం
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టు జోనల్ టెండర్ రద్దు చేశారు. నిబంధనల సడలింపు పేరుతో పలుమార్లు గడువు పెంచిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చివరకు టెండర్‌ను ఆపేశారు. పరిపాలనా కారణాల వల్లే టెండర్ రద్దు చేశామని ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, రెసిడెన్షియల్, వసతి గృహాలతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే గుడ్ల సరఫరాకు కలిపి డీసెంట్రలైజ్డ్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. రాష్ట్రంలోని 35,781 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 19.60 లక్షల మంది మహిళలు, చిన్నారులు లబ్ధిపొందుతున్నారు. వీరికి ఏడాదికి 36.96 కోట్ల గుడ్ల సరఫరాకు ఈ ఏడాది మార్చిలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 10లోపు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొని.. నిబంధనల సడలింపు పేరుతో ఏప్రిల్ 15, ఆ తర్వాత మే 15, జూన్ 16వరకు గడువు పెంచి.. చివరకు జూన్ 30వరకు పొడిగించారు.
సోమవారంతో బిడ్లు సమర్పించే గడువు ముగిసి.. మంగళవారం టెండర్ తెరవాల్సి ఉండగా.. ఈసారి ఏకంగా టెండర్ రద్దు చేశారు. కాగా, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు గురుకుల, రెసిడెన్షియల్, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కోడి గుడ్లను అందించడానికి ఈసారి డీసెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నింటికి ఏడాదికి దాదాపు 70-80 కోట్ల వరకు గుడ్లు అవసరమవుతాయి. అయితే, ఉమ్మడి జిల్లాల వారీగా గుడ్లు సరఫరా అయ్యేలా టెండర్లు నిర్వహించాలా..? లేక కొత్త జిల్లాల వారీగా టెండర్లు పిలవాలా..? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. డీసెంట్రలైజ్డ్ టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న వారు ఆ జిల్లాకు అంగన్‌వాడీ, గురుకులాలు, రెసిడెన్షియల్, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే గుడ్లను అందించనున్నారు. ఇప్పటికే పాఠశాలలు పునః ప్రారంభమై 20 రోజులు గడిచినా.. గుడ్ల సరఫరా టెండర్ల విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత కాంట్రాక్టర్ల ద్వారానే సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.
Updated Date - Jul 02 , 2025 | 04:14 AM