Karregutta : 24 వేల మంది మోహరింపు
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:00 AM
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 24 వేల బలగాలు మోహరించాయి. మరోవైపు 24 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో పరిస్థితులు మలుపుతిరుగుతున్నాయి
కర్రెగుట్టల్లోకి చొచ్చుకువెళ్తున్న జవాన్లు
నేడో రేపో భారీ ఎన్‌కౌంటర్‌కు చాన్స్
ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు
అంతా పీఎల్‌జీఏ బెటాలియన్ మహిళలే
బీజాపూర్‌లో బీర్‌బాటిల్ బాంబు సీజ్
24 మంది మావోయిస్టుల లొంగుబాటు
శాంతి చర్చలపై నక్సల్స్ మరో లేఖ
చర్ల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా సహా.. మొత్తం 24 వేల బలగాలు మోహరించాయి. అటు కర్రెగుట్టల్లో హిడ్మా నేతృత్వంలోని పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌తోపాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎ్‌సజడ్‌సీ), తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్‌సీ), సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్, కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాతోపాటు, బర్సే దేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని
ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని వెల్లడించారు. దీంతో.. ఒకట్రెండ్రోజుల్లో భారీ ఎన్‌కౌంటర్‌కు అవకాశాలున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ‘ఆపరేషన్ కర్రె గుట్టలు’ ఎనిమిదో రోజైన సోమవారం కూడా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా, ఈనెల 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు మహిళా నక్సల్స్ మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు హంగి, సింటు, శాంతిగా గుర్తించారు. ఈ ముగ్గురిపైన రూ.8లక్షల చొప్పున 24లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గుట్టలపై గ్రామాలు.. భయంభయం
కర్రెగుట్టలపై మూడు గ్రామాలున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో డోలి అనే గ్రామంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదివాసీలుంటారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బలగాలు.. థర్మల్ ఇమేజింగ్‌తో మనుషుల ఉనికిని గుర్తిస్తున్నా.. కాల్పుల విషయంలో వెనకాముందూ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బీరుబాటిల్ బాంబులను డీఆర్జీ బలగాలు నిర్వీర్యం చేశాయి. బలగాలు నడిచే మార్గాల్లో ఆ బాంబులను పాతిపెట్టినట్లు మీడియాకు తెలిపాయి. మరోవైపు... బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 24 మంది నక్సల్స్ సోమవారం లొంగిపోయారు.
శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోమారు లేఖ విడుదల చేశారు. గడిచిన వారం రోజుల్లో ఇది మూడో లేఖ కావడం గమనార్హం. ‘ఆపరేషన్ కగార్’ ఆపేసి, వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ ఆ లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్
Updated Date - Apr 29 , 2025 | 03:00 AM