iPhone Overheating: మీ ఐఫోన్ వేడెక్కుతోందా..కారణాలు, చిట్కాలు ఇవే
ABN, Publish Date - Sep 25 , 2025 | 01:52 PM
ఐఫోన్‌లు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. కానీ కొన్నిసార్లు పలువురికి ఐఫోన్ వేడెక్కే సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ ఐఫోన్‌లు తమ శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్, 5జీ సామర్థ్యంతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఐఫోన్ వేడెక్కే (iPhone Overheating) సమస్య వినిపిస్తోంది. సాధారణంగా ఫోన్ల నుంచి కొంత వేడి రావడం సహజమే. కానీ నిరంతరం వేడెక్కడం వల్ల ఫోన్ పనితీరు, బ్యాటరీ జీవితకాలంపై ప్రభావం ఉంటుంది. అలా వేడెక్కే సమస్యను ఎదుర్కొంటున్న వారు ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు
ఐఫోన్ వేడెక్కడానికి ఓ కారణం బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు ఎక్కువగా ఉండటం. ఈ యాప్‌లు CPU, బ్యాటరీ, నెట్‌వర్క్ వనరులను వినియోగిస్తూ వేడిని ఉత్పత్తి చేస్తాయి. అనవసరమైన యాప్‌లను తొలగించండి. అప్పుడప్పుడు ఐఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా వేడి తగ్గుతుంది.
2. గేమింగ్ లేదా స్ట్రీమింగ్
హై ఎండ్ గ్రాఫిక్స్ గేమ్‌లు, AR యాప్‌లు లేదా ఎక్కువ సమయం స్ట్రీమింగ్ చేయడం వల్ల GPU, ప్రాసెసర్‌పై ఒత్తిడి పడి వేడి ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ సమయం గేమింగ్ లేదా స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో విరామం తీసుకోండి. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి. లో పవర్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని తగ్గించవచ్చు.
3. ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడటం
ఛార్జింగ్ సమయంలో గేమింగ్, కాల్స్ లేదా వీడియో స్ట్రీమింగ్ వంటి భారీ టాస్క్‌లు చేస్తే అదనపు వేడి ఉత్పత్తి అవుతుంది. ఛార్జింగ్ సమయంలో ఐఫోన్‌ను భారీ టాస్క్‌లకు ఉపయోగించకండి. ఆపిల్ సర్టిఫైడ్ ఛార్జర్‌లు, కేబుల్స్ మాత్రమే వాడండి. ఇవి వేడెక్కడాన్ని తగ్గిస్తాయి.
4. నెట్‌వర్క్ సిగ్నల్, 5జీ వాడకం
ఐఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ కోసం ఇబ్బంది పడినప్పుడు, అది ఎక్కువ శక్తిని వినియోగించి వేడిని ఉత్పత్తి చేస్తుంది. నిరంతర 5జీ వాడకం కూడా బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంది. వీలైతే Wi-Fiకి మారండి లేదా 5G అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేయండి.
5. బగ్‌లు లేదా సాఫ్ట్‌వేర్
కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ బగ్‌లు లేదా పాత iOS వర్షన్‌ల వల్ల వేడెక్కుతుంది. పెద్ద అప్‌డేట్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఇండెక్సింగ్ వేడిని పెంచవచ్చు. ఐఫోన్‌ను ఎప్పటికప్పుడు తాజా iOS వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. సెట్టింగ్‌లను రీసెట్ చేయండి లేదా iTunes/Finder ద్వారా క్లీన్ రీఇన్‌స్టాల్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 25 , 2025 | 01:52 PM