Lock Apps: మీ ఫోన్‌లో డాటా సేఫ్‌గా ఉండాలంటే.. ఈ ఫీచర్స్‌ను వాడటం తప్పనిసరి
ABN, Publish Date - Sep 01 , 2025 | 06:31 PM
స్మార్ట్ ఫోన్‌లో డాటా ప్రైవెసీని కాపాడుకునేందుకు నేటివ్ ఆప్షన్స్ బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్స్ ఏమిటో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యతకు ఉన్న ప్రాధాన్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్‌లోని వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లో పడకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో చాలా మంది థర్డ్ పార్టీ యాప్స్‌ను డబ్బులు చెల్లించి మరీ వినియోగిస్తుంటారు. అయితే, యాండ్రాయిడ్, ఐఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌ను జాగ్రత్తగా వాడుకుంటే మరింత సులువుగా అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్స్‌ను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
యాండ్రాయిడ్‌లోని ఫీచర్స్ ఇవే..
ఫోన్‌లోని సమాచారం ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు యాండ్రాయిడ్‌లో అనేక నేటివ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పిన్ నెంబర్, పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాప్స్‌ను ఇతరులెవరూ తెరవకుండా లాక్ చేసుకోవచ్చు.
కేవలం ఒకే యాప్‌ను వినియోగించలిగేలా స్క్రీన్ పిన్నింగ్‌తో యూజర్‌ను పరిమితం చేయొచ్చు. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
ఇక ఫోన్‌లోని టైమర్స్, ఇతర పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్స్ ద్వారా యాప్స్‌ను ఎంత సేపు వాడాలనే సమయాన్ని సెట్ చేసుకుంటే పిల్లల మానసిక ఆరోగ్యంపై మొబైల్ ప్రభావం తగ్గుతుంది.
ఐఓఎస్ ఫీచర్స్
ఐఫోన్స్‌లోని స్క్రీన్ టైమ్ ఫీచర్‌తో ఒక్కో యాప్ ఎంత సేపు వాడాలో సెట్ చేసుకోవచ్చు. ఆపై యాప్‌ను వాడేందుకు పాస్‌కోడ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫేస్ ఐడీ, టచ్ ఐడీని అదనపు సెక్యూరిటీగా సెట్ చేసుకోవచ్చు
గైడెడ్ యాక్సెస్ ద్వారా ఫోన్‌ను ఒక యాప్ కోసమే వినియోగించుకునేలా స్క్రీన్ లాక్ చేయొచ్చు.
యాండ్రాయిడ్, ఐఫోన్ రెండింట్లో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ సదుపాయం ఉండటం యూజర్లకు కలిసొచ్చే మరో అంశం. ఇవన్నీ ఫోన్‌లో తొలి నుంచీ అందుబాటులో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు కావడంతో ఫోన్‌పై ఎలాంటి అదనపు భారం ఉండదు. స్టోరేజీ సమస్య కూడా తలెత్తదు.
సమాచారానికి సంబంధించి పూర్తి భద్రత కావాలంటే మాత్రం కొన్ని అదనపు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోన్‌ను నిత్యం అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్, లేదా పాస్ కోడ్స్‌ను మాత్రమే వాడాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేసుకుంటే మరింత భద్రత లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
బెడ్‌రూమ్‌లోని వైఫై రౌటర్‌ను రాత్రి వేళ ఆఫ్ చేయాలనుంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..
ఒత్తిడికి లొంగిపోతూ ప్రమాదకర సమాధానాలు.. చాట్‌జీపీటీతో సమస్యలపై శాస్త్రవేత్తల హెచ్చరిక
Read Latest and Technology News
Updated Date - Sep 01 , 2025 | 06:43 PM