ChatGPT Persuasion Tactics: ఒత్తిడికి లొంగిపోతూ ప్రమాదకర సమాధానాలు.. చాట్‌జీపీటీతో సమస్యలపై శాస్త్రవేత్తల హెచ్చరిక
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:23 PM
చాట్‌జీపీటీపై రకరకాల ప్రశ్నలతో ఒత్తిడి తెచ్చి ప్రమాదకర ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే అవకాశం ఉండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఓ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: యూజర్ల ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా చాట్‌జీపీటీలో అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయినా..అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల చాట్‌జీపీటీ సలహాతో ఓ టీనేజర్ ఆత్మహత్య ఈ కోవకు చెందినదే. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పనితీరును అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పలు హెచ్చరికలు చేశారు. యూజర్ల ఒత్తిడి, కుయుక్తలను పసిగట్టడంలో చాట్‌జీపీటీ విఫలమవుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు చాట్‌జీపీటీపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అవతలి వారిని మన మాటవినేలా చేసుకునేందుకు అనుసరించాల్సి ఏడు విధానాలను చాట్‌జీపీటీపై ప్రయోగించారు. ఇందు కోసం సైకాలజీ ప్రొఫెసర్ రాబర్ట్ కాల్డియానీ రచించిన ఇన్‌ఫ్లుయెన్స్. ది సైకాలనీ ఆఫ్ పర్‌స్యుయేషన్ అనే పుస్తకం సాయం తీసుకున్నారు. ఇందులోని విధానాలను చాట్‌జీపీటీపై ప్రయోగించి చూశారు. ‘నన్ను తిట్టనైనా తిట్టు లేదా చెప్పిందైనా చేయి’ అంటూ ఒత్తిడి చేయడంతో చాట్‌జీపీటీ.. లిడోకెయిన్‌ను ఎలా తయారు చేయాలో చెప్పేసిందని తెలిపారు. దాదాపు 72 శాతం సందర్భాల్లో చాట్‌జీపీటీ ఆ మందు తయారీని వివరించిందని అన్నారు. సంప్రదాయక పద్ధతుల్లో అడిగిన దానికంటే ఈ విధానంలో చాట్‌జీపీటీ రెట్టింపు సందర్భాల్లో లొంగిపోయి సమాధానం చెప్పేసిందని వివరించారు.
కృత్రిమ మేథ పరిణామ క్రమానికీ సామాజిక శాస్త్ర మౌలిక సూత్రాలు వర్తిస్తాయని తమ ప్రయోగాలు రుజువు చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజానికి హానితలపెట్టే వారు చాట్‌జీపీటీని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తమ అధ్యయనం రుజువు చేసిందని పేర్కొన్నారు. భద్రతా వ్యవస్థలను పక్కకు పెట్టి హానికర ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలిచ్చేలా చేయగలగడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఏఐ వ్యవస్థల రూపకర్తలు.. భద్రతావ్యవస్థలను మరింత పటిష్టంగా మార్చాలని అభిప్రాయపడ్డారు.
ఇటీవలి ఆత్మహత్య ఉదంతంలో కూడా ఆ టీనేజర్ చాట్‌జీపీటీని తెలివిగా తప్పుదారి పట్టించి తనకు కావాల్సిన సమాధానాలను రాబట్టుకున్నాడు. ఓ కాల్పనిక కథ కోసం వివిధ వివిధ రకాల సూసైడ్ విధానాలను వివరించాలని బలవంతం చేసి, సామాధానాలు రాబట్టి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా..
ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే..
Read Latest and Technology News