Data Breach: భారీ స్థాయిలో హ్యాకింగ్.. 183 మిలియన్‌లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్!
ABN, Publish Date - Oct 28 , 2025 | 10:39 AM
భారీ స్థాయిలో ఈమెయిల్, పాస్‌వర్డ్ వివరాలు లీకైన ఉదంతం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఏకంగా 183 మిలియన్‌లకు పైగా ఈమెయిల్స్, వాటి పాస్‌వర్డ్స్ లీకైనట్టు తెలిసింది.
ఇంటర్నెట్ డెస్క్: మరో భారీ హ్యాకింగ్ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 183 మిలియన్‌లకు పైగా ఈమెయిల్ అకౌంట్‌లు, వాటి పాస్‌వర్డ్స్ హ్యాకర్ల చేతికి చిక్కినట్టు ఆస్ట్రేలియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ట్రాయ్ హంట్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్‌లో ఈ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. గూగుల్, యాహూ, ఔట్‌లౌక్ ఈమెయిల్స్‌కు చెందిన పాస్‌వర్డ్స్‌ను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. మొత్తం 3.5 టెరాబైట్‌ల డాటాను దొంగిలించారు. వీటిల్లో 875 హెచ్‌డీ మూవీలు కూడా ఉన్నాయి (183 million Email Passwords Leak).
ఈ డాటా లీక్ ఒక్కసారిగా జరిగినది కాదని ట్రాయ్ హంట్ తెలిపాడు. ఓ మాల్‌వేర్ వేల కొద్దీ కంప్యూటర్ల నుంచి కొంతకాలం పాటు ఈ వివరాలను సేకరించి స్టీలర్ లాగ్స్ పేరిట ఓ జాబితాను సిద్ధం చేసిందని హంట్ తెలిపారు. ఇలా బయటకుపొక్కిన డాటా వివిధ మార్గాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుందని హెచ్చరించారు (Stealerlogs).
ఇన్‌ఫోస్టీలర్స్ అనే మాల్‌వేర్ ద్వారా ఈ సైబర్ దాడి జరిగింది. ఈ మాల్‌వేర్ కంప్యూటర్లలోకి చొరబడి సైలెంట్‌గా యూజర్‌ల ఈమెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సేకరించి హ్యాకర్‌ల నెట్వర్క్‌కు చేరవేసింది (Infostealer Malware).
ఇలాంటి డాటా లీక్ గురించి పసిగట్టేందుకు అమెరికా విద్యార్థి ఒకరు సాఫ్ట్‌వేర్ టూల్‌ని కూడా రూపొందించారట. సింథియంట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఈ టూల్‌ను అతడు డిజైన్ చేశాడు. హ్యాకర్ల నెట్‌వర్క్‌లను ఈ టూల్ జల్లెడ పట్టి సమాచారం బయటకు పొక్కిన సందర్భాల్లో అలర్ట్‌లను జారీ చేస్తుంది. తాజా డాటా లీక్‌ను కూడా ఈ సాఫ్ట్‌వేర్ సాధనంతోనే బయటపడింది.
ప్రస్తుతం ఈ ఉదంతం సైబర్ నిపుణులను కలవర పెడుతోంది. సామాన్య యూజర్లు కూడా సైబర్ ముప్పును తప్పించుకోలేరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో నష్టాన్ని వీలైనంతగా పరిమితం చేసేందుకు నెటిజన్లు తమ పాస్‌వర్డ్స్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని చెబుతున్నారు. ఇక తమ డాటా లీకనైట్టు అనుమానం ఉన్న వారు వెంటనే పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్, మ్యాప్స్‌ను అధిగమించడం అసంభవం.. తేల్చి చెప్పిన పర్‌ప్లెక్సిటీ సీఈఓ
సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్
Read Latest and Technology News
Updated Date - Oct 28 , 2025 | 10:54 AM