Comet 3I/ATLAS: స్వాగతం 3ఐ / అట్లస్
ABN, Publish Date - Oct 26 , 2025 | 10:42 AM
విశ్వం అంతుచిక్కని రహస్యం.. అంచనాలకు అందని అనంతం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో..? మానవమాత్రుల ఊహకు సైతం అందదు. అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనలను సైతం కనిపెట్టగలుగుతోంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం. విశ్వంలో గంటకు రెండు లక్షల కి.మీ.వేగంతో ప్రయాణిస్తున్న ఒక పేద్ద తోకచుక్క ‘3ఐ అట్లస్’ తొలిసారి మన సూర్యునికి సమీపంలోకి రానుంది.
విశ్వం అంతుచిక్కని రహస్యం.. అంచనాలకు అందని అనంతం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో..? మానవమాత్రుల ఊహకు సైతం అందదు. అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనలను సైతం కనిపెట్టగలుగుతోంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం. విశ్వంలో గంటకు రెండు లక్షల కి.మీ.వేగంతో ప్రయాణిస్తున్న ఒక పేద్ద తోకచుక్క ‘3ఐ అట్లస్’ తొలిసారి మన సూర్యునికి సమీపంలోకి రానుంది. ఈ అపూర్వ అంతరిక్ష ఘటన కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది..
విశ్వంలో లక్షల కి.మీ. వేగమైనా చిన్నదే! అందుకే అది రెండు లక్షల కి.మీ. వేగంతో అక్కడ ప్రయాణిస్తోంది.. అదే ‘3 ఐ అట్లస్’.
అలా ఊహకు అందని వేగంతో మన సౌర కుటుంబం వైపు వస్తోంది. ఇప్పటి వరకు ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారి.
మరో మూడు - నాలుగు రోజులలో ఇది సూర్యునికి అతి సమీపంగా వస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. సమీపం అంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్ల దూరం! విశ్వాంతరాళంలో ఇదేమంత పెద్ద దూరం కాదు. సూర్యునికి అంత దగ్గరగా వచ్చి, మళ్లీ కాస్త పక్కకి ఒరిగి .. సౌర కుటుంబాన్ని దాటుకుంటూ తన దారిన తాను పోతుందట. పోతూ పోతూ డిసెంబర్ 19వ తేదీన భూమికి కాస్త చేరువగా వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ దూరం సుమారు 27 కోట్ల కి.మీ. ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. ఈ నెల మూడవ తేదీన ఇది కుజ గ్రహాన్ని మూడు కోట్ల కి.మీ. దూరం నుంచి పలకరించి ముందుకు సాగింది. వచ్చే మార్చి 16వ తేదీన బృహస్పతిని చూస్తూ పోతుందట. అప్పుడు వాటి మధ్య దూరం సుమారు ఐదు కోట్ల కి.మీ.
మరో పాలపుంత నుంచి మన ముంగిట్లోకి ఇంత సన్నిహితంగా విచ్చేసిన తోకచుక్క మరొకటి లేదు. అందుకే ‘3ఐ/అట్లస్’ను అరుదైన అతిథిగా అభివర్ణిస్తున్నారు. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్టు దీని రాక భూ గ్రహానికి గాని, సౌర కుటుంబానికి గాని ఏమాత్రం అరిష్టం కాదు, ప్రమాదకరం అసలే కాదు! ఇది కేవలం ఒక అపూర్వమైన అంతరిక్ష ఘటన మాత్రమే! 3ఐ/అట్లస్ సౌర కుటుంబానికి ఆవల నుంచి, ఎక్కడో మన ఊహలకు సైతం అందనంత సుదూర తారా తీరాల నుంచి వస్తూ.. మనం అంచనా వేయలేనంత మరెంతో సుదూర తీరాలకు తరలిపోతూ.. మార్గమధ్యంలో ఇలా మన సౌర కుటుంబాన్ని పలుకరించిపోతోంది.
ఇది గంటకు రెండు లక్షల కిలో మీటర్ల పైబడిన వేగంతో దూసుకుపోతోంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 3ఐ /అట్లస్ వయస్సు వెయ్యి కోట్ల సంవత్సరాల పైమాటే! అంటే మనకి పెద్దన్నే! మన సౌర కుటుంబం వయస్సు సుమారు 500 కోట్ల సంవత్సరాలు కాబట్టి అంతకు రెట్టింపు వయసున్న ఈ 3ఐ/ అట్లస్ పెద్దన్న ఈ విశ్వంలో స్వతంత్రంగా ప్రయాణిస్తోంది. దీనికి ఇప్పటివరకూ దారిలో ఏ అడ్డంకులూ ఎదురుకాలేదు. నా దారి రహదారి అంటూ రివ్వున దూసుకుపోవడమే దీని స్వభావం. ఇది మన సౌర కుటుంబ ఆకర్షణకు ఏమాత్రం గురికాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆకస్మిక సంఘటన..
అసలు దీన్ని కనిపెట్టడమే ఒక వింత. నాలుగు నెలల క్రితం - జూలై ఒకటవ తేదీ రాత్రి చిలీలోని ఎల్ సాస్ వేదశాలలో అట్లస్ (ఏస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ ఎలర్ట్ సిస్టమ్) ప్రాజెక్టుకు అనుబంధంగా పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధకులు రోదసిని పరిశీలిస్తున్నారు. వారికి దూరంగా ఏదో మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ కనిపించింది. అంతకుముందు అలాంటి ఆనవాళ్లేవీ లేవక్కడ. అందుకని మరింత జాగ్రత్తగా పరిశీలించారు శాస్త్రవేత్తలు. ఆ అతిథి మనకు తెలిసిన తోక చుక్కల్లా లేదు, ఉల్కాపాతంలానూ లేదు. ముందు భాగం చాలా ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఇటువంటిదాన్ని చూడడం ఆ పరిశోధకులకు అదే మొదటి అనుభవం. సందేహం లేదు.
మన సౌర కుటుంబానికి గాని, ఈ సమీపంలోని నక్షత్ర సముదాయానికి గాని సంబంధించినది కాదని లెక్కలు వేసుకుని తేల్చేశారు. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు దీని గురించి తెలియజేశారు. అక్కడి పరిశోధకులు విస్మయానికి లోనయ్యారు. ఎందుకంటే ఎక్కడో సుదూర తీరాలనుంచి వస్తున్నది కాబట్టి అది ఎన్నో రహస్యాలను మోసుకువస్తున్నదని వేరే చెప్పనక్కరలేదు. ఈ భూమే కాదు, గ్రహాల ఆవిర్భావమే కాదు, మన సౌర కుటుంబమే కాదు, అసలు ఈ విశ్వాంతరాళంలోని కోట్లాది తారల ఆవిర్భావం గురించి ఇప్పటి వరకూ తెలిసింది సరైనదో కాదో మరోసారి నిగ్గు తేల్చుకునే అవకాశం 3ఐ/ అట్లస్ నుంచి సేకరించే సమాచారం వల్ల లభిస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి రెండు తోక చుక్కలు మనకు సమీపంగా వచ్చాయి కాబట్టి అదే వరుసలో దీనికి ‘3ఐ/అట్లస్’ అని పేరు పెట్టారు.
శాస్త్రవేత్తలు ఏమి ఆశిస్తున్నారు?
ప్రాథమిక పరిశోధనలను బట్టి 3ఐ / అట్లస్ ముఖ కేంద్రకం వ్యాసార్థం సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, తదితర ఎన్నో రకాల వాయువులు ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ద్రవ రూపంలో మంచు చాలా ఉందని తేలింది. ఇంకా సైనైడ్ కూడా చాలా పెద్ద పరిమాణంలో ఉన్నట్టు గుర్తించారు. ఇంత దగ్గరగా వస్తున్న 3ఐ / అట్లస్ తోక చుక్కను అధ్యయనం చేయడం ద్వారా ఇన్ని కోట్ల సంవత్సరాలలో అది భౌతికంగా ఎటువంటి మార్పులకు లోనైంది, దీని మాతృ కుటుంబం ఏమిటి, అందులో ఎటువంటి రసాయనాలు ఉన్నాయి, జీవ ఆవిర్భావానికి అక్కడ సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయా, లేవా మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. 3ఐ/అట్లస్ మనకు చేరువగా వచ్చినా.. మన కంటికి మాత్రం కనిపించదు. అయితే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపుతో దీన్ని చూడవచ్చు.
అట్లస్ ప్రాజెక్టు లక్ష్యం..
తోక చుక్కలు గాని, ఇతర గ్రహ శకలాలు గాని భూమివైపు దూసుకువస్తుంటే వాటి వేగాన్ని, పరిమాణాన్నీ అధ్యయనం చేయడం ఈ అట్లస్ ప్రాజెక్టు లక్ష్యం. మరీ పెద్ద గ్రహశకలాలు గనక భూమివైపు దూసుకువస్తుంటే వాటి ప్రభావాన్ని అంచనా వేయడం, చిన్న శకలాలు అయితే వాటిని మార్గ మధ్యంలోనే విధ్వంసం చేయడానికి మార్గాలు సూచించడం కూడా ఈ అట్లస్ ప్రాజెక్టు లక్ష్యం. ఈ వినీలాకాశంలో పరిశోధకులు సుదూర తీరాలు వీలైనంత కాలుష్య రహిత వాతావరణం అవసరం. అటువంటి నాలుగు ప్రాంతాలను అట్లస్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.
వాటిలో రెండు హవాయిలోనే ఉన్నాయి. ఒకటి హలీకల అబ్జర్వేటరీ, మరొకటి మౌనాలో అబ్జర్వేటరీ, మూడవది చిలీలోని ఎల్ సాస్ అబ్జర్వేటరీ, నాల్గవది దక్షిణాఫ్రికాలోని సుదర్లెండ్ అబ్జర్వేటరీ. ఈ నాలుగు చోట్ల నుంచి అనుక్షణం రోదసీ పరిశీలన జరుగుతుంటుంది. ఈ నాలుగు కేంద్రాల నుంచి వచ్చే డేటాను ఒక ప్రధాన కేంద్రానికి అనుసంధానించి ఎప్పటికప్పుడు అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేస్తారు. ఈ క్రమంలోనే చిలీలోని అబ్జర్వేటరీ 3ఐ/ అట్లస్ గమనాన్ని కనిపెట్టింది. ఈ విశ్వం ఆవిర్భావంపై ఇప్పటివరకు మనకున్న అంచనాలు సరైనవో, కాదో తేల్చడానికి 3ఐ / అట్లస్ ఏమాత్రం ఉపకరించినా అది మానవాళికి మరో ముందడుగే!.
- జగన్, 99854 11211
ఆ పేరు ఎలా వచ్చిందంటే...?
ఈ తోక చుక్కకి 3ఐ/ అట్లస్ అని పేరు పెట్టడానికి కారణం... మనకు తెలిసి సౌర కుటుంబానికి ఆవల నుంచి వచ్చిన అతిథులలో ఇది మూడవది. సౌర కుటుంబం వైపు మొట్టమొదటగా తరలివచ్చిన తోకచుక్కను 2017 అక్టోబర్‌లో కనిపెట్టారు. దానికి 1ఐ/ఓమువామువా అని పేరు పెట్టారు. హవాయి భాషలో ఓ అంటే ఓయ్ అని పలుకరిస్తున్నట్టు అట. మువా అంటే అతిథి. మువా మువా అంటే సుదూర తీరాన్నుంచి వచ్చిన తొలి అతిథి అని అర్థం. హవాయిలోని పాన్-స్టార్స్ అనే టెలిస్కోప్ సాయంతో రాబర్ట్ వెరైక్ దీన్ని కనిపెట్టారు. ఇది గంటకు మూడు లక్షల కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. తోక బాగా పొడవుగానే ఉందట. దీని పేరులో ఐ అంటే ఇంటర్ స్టెలార్ అని. ఈ తోక చుక్కపై అప్పట్లో ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తి కనబరిచారు.
ఆ తర్వాత రెండేళ్లకి క్రిమియాకి చెందిన ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు బొరిసోవ్ మరో తోక చుక్కను కనిపెట్టారు. అది కూడా సౌర కుటుంబం ఆవల నుంచి ప్రయాణిస్తున్నదే. దీనికి 2ఐ / బొరిసోవ్ అని పేరు పెట్టారు. దీనిపై కూడా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఇప్పుడు మన ముంగిటకు వస్తున్న మూడవ తోకచుక్కకి 3ఐ అని, ఏస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ ఎలర్ట్ సిస్టమ్ (అట్లస్) ద్వారా దీన్ని కనిపెట్టారు కాబట్టి మొత్తం కలిపి ‘3ఐ/అట్లస్’ అని ఈ తోక చుక్కకి పేరు పెట్టారు. దీనికి ఉన్న మరో పేరు సి / 2025 ఎన్ 1 (అట్లస్). సి అంటే కామెట్ (తోకచుక్క) అని. 2025లో కనిపెట్టారు కాబట్టి ఆ సంవత్సరం, అందులో తొలి అర్థభాగంలో కనిపెట్టారు కాబట్టి ఎన్1 అనీ, కనిపెట్టింది అట్లస్ కాబట్టి, ఆ పేరు కూడా వచ్చేలా నామకరణం చేశారు.
భూమిని ఢీ కొడితే...?
3ఐ/అట్లస్ వల్ల మనకు భయం లేదని శాస్త్రవేత్తలు అభయం ఇస్తున్నారు సరే - ఒక వేళ ఇటువంటి తోక చుక్క ఇంతటి వేగంతో, ఇంతటి ద్రవ్యరాశితో, శక్తిమంతంగా భూమిని ఢీ కొడితే... ఏమవుతుంది? భూమి బద్ధలు అవుతుందా? మహా పర్వతాలు నేల కొరుగుతాయా? సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయా? అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.
భవిష్యత్తులో సువిశాల విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్ర సముదాయాల మధ్య నుంచి.. ఇంత పెద్ద తోక చుక్క, లేదా ఇంకా పెద్దది, లేదా ఒక పెద్ద గ్రహ శకలం మాతృ వ్యవస్థ నుంచి విడివడి.. భూ గ్రహం వైపు దూసుకురావచ్చు... విశ్వాంతరాళంలో చోటుచేసుకునే ఏ పరిణామాన్నీ ప్రస్తుత మేథస్సుతో, అందుబాటులో ఉన్న ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతోనూ, ఆధునిక సాధనాలతోనూ అంచనా వేయలేం!.
సృష్టి ముందు మనిషి జ్ఞాన సంపద అంత అత్యల్పం మరి! సరే, ఒకవేళ అటువంటి సంఘటన సంభవిస్తే ఏమి జరుగుతుంది? అది సృష్టించే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అలా ఢీ కొట్టినప్పుడు కొన్ని వేల అణు బాంబులు విడుదల చేసేటంత శక్తి విడుదల అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అడవులు దహించుకుపోతాయి. సముద్రాలలో సునామీలు ఉవ్వెత్తున లేచి విరుచుకుపడతాయి. దాని ప్రతాపంతో భూతాపం మానవ జాతి భరించలేనంతగా వేడెక్కిపోవచ్చు. భూ గ్రహం మొత్తం కాకపోయినా, చాలా భాగం మానవ మనుగడకి వీలులేనంతగా మారిపోవచ్చు- పరిస్థితులు మరీ విషమిస్తే అసలు మానవ జాతే అంతరించిపోవచ్చు!
3ఐ/అట్లస్ మన సౌర కుటుంబం పరిధిలోకి తాత్కాలికంగా ప్రవేశించినా, సూర్యుడిని దూరం నుంచే పలుకరించి పక్కకి తప్పుకుని వెళ్లిపోతుంది కాబట్టి ఇప్పట్లో ఈ రకమైన ‘యుగాంతం’ గురించి భయం లేదు!.
లెక్కలేనన్ని సందేహాలు ...
3ఐ/అట్లస్ ఫలానా చోట నుంచి వస్తున్నదని ఇంకా తేలలేదు కాబట్టి ఇదేమైనా పాలపుంతాంతర వాసుల అత్యాధునిక రోదసీ వాహనమా? లేక మన సౌర కుటుంబం దరిదాపులలోని గ్రహాంతర వాసులకు సంబంధించిన ఒక రకమైన ఎగిరే పళ్లెమా? లేక భూ గ్రహంపై దాడి చేయడానికి మనల్ని మించిన బుద్ధి జీవులు వదిలిన విధ్వంస అస్త్రమా? - ఇలా గత కొన్నాళ్లుగా ఇంటర్ నెట్‌లో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. వారిలో చాలా మంది తమ ఊహలకు రెక్కలు తొడిగి మరీ ఇది కచ్చితంగా గ్రహాంతర వాసుల అత్యంత శక్తిమంతమైన, ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీకగా చెబుతూ వచ్చారు. మరి కొందరైతే భూమి మీద మానవుని శాస్త్ర-సాంకేతిక సామర్థ్యాన్ని సవాలు చేసే పాలపుంతాంతర వాహనంగా కూడా 3ఐ/అట్లస్‌ను అభివర్ణించారు.
ఇలా రకరకాల ఊహలకు ఊతం ఇవ్వడానికి కారణం.. ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన తోకచుక్కల స్వరూప స్వభావాల నిర్వచనాలకు లొంగకపోవడమే! సాధారణంగా తోకచుక్కల ముఖ భాగం చాలా పెద్దగా ఉండి, వెనుక పొడవైన తోకవంటి భాగం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తుంది. కాని 3ఐ / అట్లస్ అట్లా కనిపించడం లేదు. దాని ముఖ భాగమే అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీని ముందు భాగం దట్టమైన ధూళి, రకరకాల వాయువుల మిశ్రమంగా కనిపిస్తూ, వాటి మధ్య జరిగే రసాయనిక క్రియల వల్ల అసాధారణమైన వెలుగును విరజిమ్ముతోంది. మామూలు తోకచుక్కల లాగా మరీ పెద్ద తోక వంటి నిర్మాణం కూడా ఏమీ కనిపించడం లేదు.
అదీ గాక 3ఐ/అట్లస్ పయనించే మార్గం కూడా గమ్మత్తుగా ఉందట! ఒక రకంగా ఇది బుద్ధి పూర్వకంగానే మన సౌర కుటుంబంతో దోబూచులాడుతున్నట్టు కనిపిస్తున్నదని మరి కొందరు శాస్త్రవేత్తలు చమత్కరించారు. ఇది ఒక దశలో భూమికి దగ్గరగా వస్తున్నట్టు అనిపించి.. మళ్లీ తన ప్రయాణ దిశను సూర్యునికి అభిముఖంగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నదని కొందరు శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు. భూలోక వాసుల దృష్టి పడకుండా ఉండడానికే ఈ రహస్య రోదసీ నౌక గమనాన్ని దాన్ని ప్రయోగించిన తెలివైన పాలపుంతాంతర జీవులు మార్చేసి ఉంటాయన్నది మరి కొందరి వాదన!.
సందట్లో సడేమియా అన్నట్టు ఇదే అదనుగా భావించిన కొందరు సోషల్ మీడియా ఔత్సాహికులు అందుబాటులో ఉన్న 3ఐ/అట్లస్ ఫొటోలకు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూసినటువంటి ఫోకస్ లైట్లు జత పరచి వదులుతున్నారు. దీంతో ఇంటర్‌నెట్‌లో ఇదొక ఖగోళ వేడుకలా ప్రచారంలోకి వచ్చింది.
Updated Date - Oct 26 , 2025 | 10:56 AM