Team India Under Pressure: గెలవాల్సిందే
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:27 AM
ఎనిమిది రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-ఇంగ్లండ్ జట్లు మరోసారి ఐదు టెస్టుల సిరీ్‌సలో తలపడబోతున్నాయి. అయితే లార్డ్స్‌లో విజయం అంచుల వరకూ వచ్చి ఓడిన నిరాశతో పాటు...
మ.3.30 గం. నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
తీవ్ర ఒత్తిడిలో టీమిండియా
వెంటాడుతున్న గాయాలు
పేసర్ ఆకాశ్ అవుట్
జోష్‌లో ఇంగ్లండ్
మాంచెస్టర్: ఎనిమిది రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-ఇంగ్లండ్ జట్లు మరోసారి ఐదు టెస్టుల సిరీ్‌సలో తలపడబోతున్నాయి. అయితే లార్డ్స్‌లో విజయం అంచుల వరకూ వచ్చి ఓడిన నిరాశతో పాటు తాజాగా ఆటగాళ్ల గాయాలు భారత జట్టును వేధిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టు బరిలోకి దిగనుంది. ఇక ఈ మ్యాచ్ ఆతిథ్య జట్టుకన్నా గిల్ సేనకే అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పటికే 1-2తో వెనుకబడిన టీమిండియాకు ఈ సిరీస్‌పై ఆశలు నిలవాలంటే మాంచెస్టర్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించాల్సిందే. లేకుంటే చివరి టెస్టు నామమాత్రంగా మారుతుంది. మరోవైపు ఓల్డ్ ట్రాఫోర్ట్‌లో భారత జట్టుకు ఒక్క విజయం కూడా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడితే నాలుగింట్లో ఓడి, ఐదింటిని డ్రా చేసుకుంది. 2014లో ఆడిన చివరి మ్యాచ్‌లోనైతే ఇన్నింగ్స్ 54 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. అంతేకాదు.. 1990లో సచిన్ శతకం తర్వాత మరే భారత బ్యాటర్ కూడా ఇక్కడ మూడంకెల స్కోరు సాధించలేకపోయాడు. కానీ రెండో టెస్టు జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారిగా అద్భుత విజయం సాధించింది. అదే స్ఫూర్తితో నాలుగో టెస్టును చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటోంది. అటు సిరీ్‌సలో పైచేయి సాధించిన ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడంతో పాటు ఓల్డ్ ట్రాఫోర్ట్‌లో ఆడిన చివరి పది టెస్టుల్లో ఇంగ్లండ్ ఒక్కసారే ఓడడం గమనార్హం.
జట్టు కూర్పే సమస్య..: టెస్టు బరిలోకి దిగడానికి ముందు తుది జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతోంది. లార్డ్స్ టెస్టులో ఆడిన నితీశ్ కుమార్ గాయాల కారణంగా సిరీ్‌సకు దూరం కాగా, పేసర్ ఆకాశ్ దీప్ ఈ టెస్టుకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్‌దీ్‌పది కూడా అదే పరిస్థితి. దీంతో సిరీ్‌సలో కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ మార్పులు తప్పవు. అయితే స్టార్ పేసర్ బుమ్రా బరిలోకి దిగుతుండడం.. అలాగే రిషభ్ పంత్ కీపింగ్ కూడా చేస్తాడని కెప్టెన్ గిల్ చెప్పడం అతి పెద్ద రిలీ్‌ఫగా భావించవచ్చు. ఇక ఆకాశ్ స్థానంలో ప్రసిద్ధ్ క్రిష్ణ, అన్షుల్ కాంబోజ్ మధ్య పోటీ ఉంది. ప్రసిద్ధ్‌కు ఇప్పటికే రెండుసార్లు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి అన్షుల్ వైపే మొగ్గుచూపవచ్చు. ఇక నితీశ్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్‌పై వేటు తప్పదని అంతా భావించినా.. కెప్టెన్ గిల్ మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. దీంతో కరుణ్‌కు మరో చాన్స్ దక్కినట్టే. ఒకవేళ పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించినట్టయితే స్పిన్నర్ సుందర్‌ను తప్పించి శార్దూల్‌ను ఆడించాలనుకుంటున్నారు.
ఆత్మవిశ్వాసంతో ఆతిథ్య ఇంగ్లండ్: ఇంగ్లండ్ జట్టు మాత్రం నాలుగో టెస్టు కోసం ఇప్పటికే తమ ఆటగాళ్లను ప్రకటించింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయంతో దూరం కాగా అతడి స్థానంలో లియామ్ డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ లెఫ్టామ్ స్పిన్నర్ బ్యాటింగ్‌లోనూ రాణించగలగడం జట్టుకు అదనపు బలం కానుంది. టాపార్డర్‌లో క్రాలే, డకెట్, పోప్‌తో పాటు మిడిలార్డర్‌లో రూట్, బ్రూక్, స్టోక్స్‌తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. పేసర్ ఆర్చర్ లార్డ్స్ టెస్టులో భారత్‌ను ఇబ్బందిపెట్టాడు. 2-1తో ఆధిపత్యంలో ఉన్న ఇంగ్లండ్ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా ఇక్కడే సిరీస్ పట్టేయాలనుకుంటోంది.
తుది జట్లు
భారత్ (అంచనా): జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/శార్దూల్, బుమ్రా, ప్రసిద్ధ్/అన్షుల్, సిరాజ్.
ఇంగ్లండ్: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ (కెప్టెన్), స్మిత్, వోక్స్, డాసన్, కార్స్, ఆర్చర్.
పిచ్, వాతావరణం
మాంచెస్టర్ పిచ్ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుంటుంది. చక్కటి బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడుతుంటారు. వాతావరణ పరిస్థితిని బట్టి కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే టెస్టు జరిగే ఐదు రోజులు చిరు జల్లులకు ఆస్కారం ఉంది. తొలి రెండు రోజులు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు.
90 సెకన్లు ఆలస్యంగానా?
ఇంగ్లండ్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించిన గిల్
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరోపించాడు. ఇంగ్లిష్ ఓపెనర్లు ఉద్దేశపూర్వకంగానే 90 సెకన్లు ఆలస్యంగా క్రీజులోకి వచ్చారని అన్నాడు. ‘10 కాదు.. 20 కాదు.. ఏకంగా 90 సెకన్లు ఆలస్యంగా వచ్చారు. మేం ఆ పరిస్థితుల్లో ఉండి ఉంటే.. అలాగే ఆలోచించే వాళ్లమేమో. కానీ, దేనికైనా ఓ పద్ధతి ఉంటుంద’ని గిల్ అన్నాడు.
చెత్త రికార్డుకు చేరువలో..
మాంచెస్టర్‌లో కచిత్చంగా గెలిచి తీరాల్సిన ఒత్తిడితో పాటు ఇక్కడ మరో ‘రికార్డు’ కూడా భారత జట్టును వణికిస్తోంది. స్థానిక ఓల్డ్ ట్రాఫోర్ట్ మైదానంలో భారత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా గెలువలేదు. నాలుగింట్లో ఓడి, ఐదింటిని డ్రా చేసుకుంది. 2014లో ఆడిన చివరి మ్యాచ్‌లోనైతే ఇన్నింగ్స్ 54 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. ఒకవేళ ఈ టెస్టులోనూ ఓడితే భారత్ ఖాతాలో ఏ జట్టూ కోరుకోని రికార్డు చేరనుంది. టెస్టు చరిత్రలో ఒకే వేదికపై వరుసగా పది మ్యాచ్‌ల్లోనూ గెలుపు రుచి చూడని జట్టుగా నిలువనుంది. ప్రస్తుతం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా (కరాచీ వేదికపై), శ్రీలంక (లార్డ్స్‌లో) కూడా వరుసగా తొమ్మిది టెస్టుల్లో గెలుపు లేకుండా సమంగా ఉన్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 04:27 AM