Share News

Bumrah Comeback: బుమ్రా ఆడాల్సిందే

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:43 AM

లార్డ్స్‌ టెస్టు పరాజయం ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా తీవ్ర వేదనకు గురిచేసింది. ఎన్నడూ గెలవని బర్మింగ్‌హామ్‌లో విజయకేతనం ఎగురవేసిన తర్వాతి మ్యాచ్‌లోనే ఈ పరాజయం ఎదురైంది. దీంతో ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్‌...

Bumrah Comeback: బుమ్రా ఆడాల్సిందే

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

లార్డ్స్‌ టెస్టు పరాజయం ఆటగాళ్లతో పాటు అభిమానులను కూడా తీవ్ర వేదనకు గురిచేసింది. ఎన్నడూ గెలవని బర్మింగ్‌హామ్‌లో విజయకేతనం ఎగురవేసిన తర్వాతి మ్యాచ్‌లోనే ఈ పరాజయం ఎదురైంది. దీంతో ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్‌ అత్యంత ఆసక్తిరంగా మారింది. ఈనెల 23 నుంచి ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరిగే నాలుగో టెస్టు గెలిస్తేనే భారత్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. గురువారం నుంచి గిల్‌ సేన తమ సన్నాహకాలను కూడా ఆరంభించింది. అయితే తమ ప్రధాన ఆయుధం పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఈ మ్యాచ్‌లో బరిలోకి దించుతారా? లేదా? అనే సందేహం అందరిలో నెలకొంది. బుమ్రా ఈ సిరీ్‌సలో మొదటి, మూడో టెస్టులో మాత్రమే ఆడాడు. ఈ రెండింట్లో కలిపి12 వికెట్లు తీశాడు. అయితే పనిఒత్తిడిలో భాగంగా కేవలం మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ పర్యటనకు ముందే చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు. దీంతో చివరిదైన ఐదో టెస్టులో మాత్రమే బుమ్రాను ఆడిస్తారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కానీ తాజాగా జట్టు పరిస్థితిని గమనిస్తే ఇబ్బందికరంగా ఉంది. లార్డ్స్‌ ఓటమి గిల్‌ సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం 1-2తో వెనుకబడిన దశలో మాంచెస్టర్‌ టెస్టును కోల్పోతే సిరీస్‌ పోయినట్టే. పైగా లెఫ్టామ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ నెట్‌ ప్రాక్టీ్‌సలో గాయపడ్డాడు. అతడు బౌలింగ్‌ వేసే చేతికి ప్లాస్టర్‌తో కనిపించాడు. ఇప్పటికే కీపర్‌ పంత్‌ చేతి వేలికి గాయం కాగా, నొప్పిని భరిస్తూనే తను మూడో టెస్టులో బ్యాటింగ్‌ చేశాడు. దీంతో నాలుగో టెస్టుకు పంత్‌ అందుబాటులో ఉండడం కష్టమే. ఇలాంటి సమస్యలు చుట్టుముట్టిన వేళ.. బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా మూడు, నాలుగో టెస్టుకు మధ్య ఎనిమిది రోజుల విశ్రాంతి బుమ్రాకు సరిపోతుందని మాజీ ఆటగాడు దీప్‌దాస్‌ గుప్తా సూచించాడు.


ఫిట్‌ అయితే ఆడాలి!

ఓ ఆటగాడు ఫిట్‌గా ఉన్నప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందేనని మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ తేల్చాడు. తొలి టెస్టు తర్వాత ఎనిమిది రోజులపాటు సమయం లభించినా అతడిని రెండో టెస్టు ఆడించలేదని, ఇది ఏమాత్రం సరికాదని విమర్శించాడు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలను బట్టి మ్యాచ్‌లను ఎంపిక చేసుకోవడమేమిటని సూటిగా ప్రశ్నించాడు. అటు మాజీల మాటయినా.. ఇటు అభిమానుల ఆరాటమైనా మాంచెస్టర్‌ మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగడమే.

00-sports.jpg

కరుణ్‌కు కష్టమే..

ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన కరుణ్‌ నాయర్‌ తనకు లభించిన సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో కలిపి 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జట్టు టాప్‌-4 బ్యాటర్లలో కనీసం అర్ధసెంచరీ కూడా చేయనిది కరుణ్‌ మాత్రమే. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా నిలిచిన హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్‌లోనూ పేలవ ఆటతీరును కనబర్చాడు. దీంతో కరుణ్‌ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఆడించే చాన్సుంది. ఇంగ్లండ్‌ గడ్డపై అతడికి అవకాశం ఇస్తే జట్టుకు ప్రయోజకరంగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

బుమ్రా అందుబాటులోనే..

నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని భారత అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డష్కాటే తెలిపాడు. ‘చివరి రెండు టెస్టుల్లో బుమ్రా ఏదో మ్యాచ్‌లో మాత్రమే ఆడతాడు. ఎందులో ఆడించాలనే విషయమై మాంచెస్టర్‌ టెస్టుకు ముందు ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని డష్కాటే వివరించాడు. లార్డ్స్‌ టెస్టు ముగిశాక బుమ్రా నాలుగో మ్యాచ్‌లో ఆడే అంశంపై కెప్టెన్‌ గిల్‌ స్పష్టత నివ్వలేదు.

ఇవి కూడా చదవండి

ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Updated Date - Jul 18 , 2025 | 05:43 AM