Bengaluru stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:08 PM
Chinnaswamy Stadium Stampede Case: స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనకు సంబంధించిన కేసును సుమోటాగా తీసుకుంది. గురువారం కేసుకు సంబంధించి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ మాట్లాడుతూ సంఘటన జరిగినపుడు స్టేడియం దగ్గర 5 వేల మంది పోలీసులు ఉన్నారని చెప్పారు.
అయితే, హైకోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం వేరే సంఖ్య చెప్పారు. వెయ్యికి పైగా పోలీసులను స్టేడియం దగ్గర ఉంచినట్లు తెలిపారు. వారిలో సిటీ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ కూడా ఉన్నారని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్లు, అంబులెన్సులు, కమాండ్ కంట్రోల్ వెహికల్స్ కూడా అక్కడ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌కు కూడా ఇంత పెద్ద భద్రత ఇవ్వలేదని తెలిపారు. ఇంత చేసినా.. విపరీతంగా అక్కడికి వచ్చిన జనం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని అన్నారు.
స్టేడియం దగ్గరకు ఏకంగా 2.5 లక్షల మంది వచ్చారని వెల్లడించారు. ఆ స్టేడియం సామర్థ్యం 35 వేలు మాత్రమేనని, 30 వేల టికెట్లు మాత్రమే అమ్ముతూ ఉంటారని తెలిపారు. ఇకపై కోర్టు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపు వాదనలు విన్న కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది. పక్క రాష్ట్రాలనుంచి కూడా జనం అక్కడికి వచ్చారు. తొక్కిసలాట కారణంగా గేట్ నెంబర్ 7లో నలుగురు, గేట్ నెంబర్ 6లో ముగ్గురు, క్వీన్స్ రోడ్డులో నలుగురు చనిపోయారు.
ఇవి కూడా చదవండి
గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లో రాఫెల్ విడిభాగాల తయారీ..
ఒళ్లు జలదరించే వీడియో.. ఒకే ఇంట్లో వంద పాములు
Updated Date - Jun 05 , 2025 | 04:30 PM