India vs England 4th Test: అన్షుల్‌కు పిలుపు
ABN, Publish Date - Jul 21 , 2025 | 03:39 AM
సిరీస్ లో సజీవంగా ఉండేందుకు నాలుగో టెస్టులో విజయంపై దృష్టి సారించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్ పేసర్...
గాయంతో అర్ష్‌దీప్, ఆకాశ్ అవుట్‌జూ కీపర్‌గా జురెల్!
మాంచెస్టర్: సిరీస్ లో సజీవంగా ఉండేందుకు నాలుగో టెస్టులో విజయంపై దృష్టి సారించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో యువ లెఫ్టామ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ రెండు రోజుల క్రితం గాయం కావడంతో మాంచెస్టర్ టెస్టుకు అర్ష్‌దీప్ అందుబాటులో ఉండడం లేదు. ప్రాక్టీస్ సమయంలో బంతిని ఆపుతుండగా అర్ష్‌దీప్ ఎడమ చేతికి గాయమైంది. అలాగే మరో పేసర్ ఆకాశ్ దీప్‌నకు గజ్జల్లో గాయం కావడంతో అతను కూడా నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. లార్డ్స్ టెస్టు నాలుగో రోజు ఆటలో అతను చికిత్స కోసం మైదానం కూడా వీడాడు. అటు బెకెన్‌హామ్‌లో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆకాశ్ బౌలింగ్ చేయలేదు. ప్రస్తుతం ఇద్దరూ జట్టుతో పాటే మాంచెస్టర్‌కు వెళ్లినా వీరి గాయం తీవ్రతపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అన్షుల్ జట్టులోకి..: ఇద్దరు పేసర్లు గాయపడడంతో ముందు జాగ్రత్తగా హరియాణాకు చెందిన 24 ఏళ్ల పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బ్యాకప్ కోసం ఇంగ్లండ్‌కు రప్పించనున్నారు. తాజా సిరీ్‌సకు ముందు అన్షుల్ భారత్ ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ ‘ఎ’తో రెండు అనధికార టెస్టులు ఆడాడు. అన్షుల్ రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో ఆకట్టుకోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ తనుష్ కోటియన్‌తో కలిసి అజేయంగా 149 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు ఓటమి నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను డ్రా చేయగలిగింది.
అవకాశం దక్కేనా?
నాలుగో టెస్టులో మూడో పేసర్‌గా అన్షుల్‌తో అరంగేట్రం చేయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రసిద్ధ్ క్రిష్ణకు తొలి రెండు టెస్టుల్లో అవకాశం ఇచ్చినా ప్రభావం చూపలేకపోయాడు. ఆల్‌రౌండర్ శార్దూల్ సైతం నిరాశపర్చాడు. దీంతో దేశవాళీల్లో ఫామ్ కనబర్చిన అన్షుల్‌కు చాన్స్ ఇస్తే తప్పేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్షుల్ తన చివరి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీయగా, గత రంజీ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనే 34 వికెట్లు పడగొట్టాడు. పైగా ఇంగ్లండ్ ‘ఎ’తో ఇక్కడ ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. అందుకే బుమ్రా, సిరాజ్‌లకు అన్షుల్ చక్కటి సహకారం అందించగలడన్నది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
పంత్ పరిస్థితేమిటి?
భారత నెట్ సెషన్‌లో ధ్రువ్ జురెల్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో గాయంతో ఉన్న రిషభ్ పంత్ ప్రాతినిధ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడు కీపింగ్‌కు దూరమై కేవలం బ్యాటర్‌గానే ఆడతాడనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే జురెల్ వికెట్ల వెనకాల కనిపించనున్నాడు. మూడో టెస్టు తొలి రోజు బుమ్రా వేసిన బంతిన పంత్ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో తను రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ చేసినా కీపింగ్‌కు మాత్రం దూరమయ్యాడు. సోమవారం తను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో బంతిని చక్కగా త్రో వేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదు. కానీ కీపింగ్ మాత్రం చేయకపోవడంతో, అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించి కీపింగ్ బాధ్యతలు జురెల్‌కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 21 , 2025 | 03:39 AM