BCCI: స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా బీసీసీఐ-గంభీర్ ప్లాన్ ప్రకారమే
ABN, Publish Date - Jan 22 , 2025 | 05:41 PM
Gautam Gambhir: భారత క్రికెట్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు క్రికెట్ లవర్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్లతో టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఆడుతూ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఆటగాడతను. 150కి పైగా ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఆడిన ఆ స్టార్ బౌలర్.. 217 వికెట్లు పడగొట్టాడు. వైట్‌బాల్ మ్యాచుల్లో అతడు బంతిని గింగిరాలు తిప్పుతుంటే తోపు బ్యాటర్లు కూడా భయపడేవారు. ఈ స్పిన్నర్‌తో మనకెందుకని వెనకడుగు వేసేవారు. అతడి తెలివి, చాకచక్యం, వ్యూహాలను చూసి భయపడేవారు. ఫామ్, ఫిట్‌నెస్.. ఇలా ఏది చూసుకున్నా టాప్‌లో ఉన్న ఆ క్రేజీ స్పిన్నర్ మరెవరో కాదు.. యుజ్వేంద్ర చాహల్. భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో ఆడుతూ ఎంతో మంది మనసులు చూరగొన్న ఈ బౌలర్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ తీరు వల్లే చాహల్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
ఫైల్ క్లోజ్!
చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో చాహల్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న ఏస్ పేసర్ మహ్మద్ షమి, చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ చాహల్‌ను మాత్రం పక్కన పెట్టేశారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కూ అతడ్ని ఎంపిక చేయలేదు. అటు డొమెస్టిక్ క్రికెట్, ఇటు ఐపీఎల్‌కు తోడుగా కౌంటీ క్రికెట్‌లోనూ దుమ్మురేపుతున్నా చాహల్‌కు మొండిచేయి చూపించింది బీసీసీఐ. దీంతో అతడి కెరీర్ ముగిసిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై సీనియర్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాహల్ ఫైల్‌ను బోర్డు క్లోజ్ చేసిందన్నాడు.
ఎందుకీ పక్షపాతం?
చాహల్ అనే కాదు.. పలువురు సీనియర్లతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు చర్చలకు దారితీస్తోంది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కూ చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కలేదు. దేశవాళీల్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న బ్యాటర్ కరుణ్ నాయర్‌నూ సెలెక్టర్లు పట్టించుకోలేదు. టెస్టుల్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన జడేజా, రోహిత్, కోహ్లీని ఏమీ అనకపోవడం, ఉన్నపళంగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా కొత్త డిస్కషన్స్‌కు దారితీసింది. ఇప్పుడు చాహల్‌ను పట్టించుకోకపోవడం ద్వారా అతడి కెరీర్‌ను క్లోజ్ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బోర్డు-కోచ్ గంభీర్ కొందరు స్టార్ల విషయంలో మెతక వైఖరితో.. మరికొందరి విషయంలో పగబట్టినట్లుగా వ్యవహరించడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇవీ చదవండి:
భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 22 , 2025 | 05:58 PM