PAK vs BAN: ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు.. గాచారం అంటే ఇదే..
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:56 PM
Champions Trophy 2025: పాకిస్థాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతోంది. గ్రహచారం బాగోలేదేమో.. ఆ టీమ్ బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది.
అదృష్టం బాగోకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు పాకిస్థాన్ జట్టు పరిస్థితి అలాగే ఉంది. ఆ టీమ్ ఏం చేసినా అంతా బెడిసి కొడుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. మెగా టోర్నీని హోస్ట్ చేస్తున్నామనే సంతోషం లేకుండా పోయింది. నిర్వహణ లోపాలతో పరువు తీసుకుంటున్న పాక్.. బరిలోకి దిగి రాణిస్తుందా అనుకుంటే అక్కడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆడిన 2 మ్యాచుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న రిజ్వాన్ సేన.. మూడో దాంట్లోనైనా గెలుస్తుందేమోనని భావిస్తే అక్కడా గాచారం అడ్డు పడింది.
అడ్డుపడిన వరుణుడు
చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని పాకిస్థాన్ ఒక్క గెలుపు కూడా లేకుండానే ముగించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన దాయాది జట్టు.. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా న్యూజిలాండ్, టీమిండియాతో జరిగిన మ్యాచుల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా గెలిచి అభిమానులకు ఊరట కలిగించాలని అనుకుంది. కానీ వరుణుడు అడ్డుపడ్డాడు. రిజ్వాన్ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. వాన కారణంగా పాక్-బంగ్లా మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఎడతెరపి లేని వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న రావల్పిండిలో ఉదయం నుంచి వాన కురిసింది. గ్రౌండ్ చిత్తడిగా మారడం, ఔట్‌ఫీల్డ్ జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు అంపైర్లు. పాక్‌తో పాటు బంగ్లా కూడా ఒక్క విజయం లేకుండానే టోర్నమెంట్‌ను ముగించింది.
ఇవీ చదవండి:
రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు
కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 27 , 2025 | 04:58 PM