వామ్మో... వంతెనపై డ్రాగన్..
ABN, Publish Date - May 18 , 2025 | 01:47 PM
రోడ్డు మార్గాల్లో అక్కడక్కడ ఫ్లై ఓవర్‌లతో పాటు తీగల వంతెనలూ కనిపిస్తాయి. వాటిలో కొన్ని రాత్రిపూట విద్యుద్దీపాల వెలుగుల్లో జిగేల్‌మంటూ వెలిగిపోతాయి. అయితే వియత్నాంలోని ఒక వంతెనను చుట్టుకుని ఉన్న డ్రాగన్... నిప్పులు కక్కుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ‘డ్రాగన్ బ్రిడ్జ్’గా పిలిచే ఆ వంతెన నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం.
శనివారం... సమయం రాత్రి 9 గంటలు... వియత్నాంలోని డ్రాగన్ బ్రిడ్జ్ పర్యాటకులతో కోలాహలంగా ఉంది. అందరిలోనూ ఉత్కంఠ. వాళ్లు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గడియారంలోని ముళ్లు సరిగ్గా 9 గంటలు చూపించగానే ఒక్కసారిగా వంతెనపై ఉన్న డ్రాగన్ నిప్పులు కక్కుతున్న దృశ్యం ఆవిష్కృతమైంది.
పది నిమిషాల పాటు పర్యాటకులందరూ కన్నార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలలో ఉండిపోయారు. వీకెండ్‌లో జరిగే ఈ అద్భుతమైన ఈవెంట్ కోసం సందర్శకులు పోటెత్తుతుంటారు. ఈ డ్రాగన్ వంతెనను వియత్నాంలోని డా నాంగ్ నగరంలో ఉన్న హాన్ నదిపై నిర్మించారు. యుద్ధంలో డా నాంగ్ నగర విముక్తి తరువాత... గౌరవంగా డ్రాగన్ ఆకారపు వంతెన నిర్మించారు. ఇది అగ్ని, నీటిని వెదజల్లే డ్రాగన్ కావడం మరో విశేషం. 2200 అడు గుల పొడవైన ఈ వంతెనపై ఆరు వరుసల దారి ఉంటుంది. వియత్నాం ప్రజలు డ్రాగన్‌ను శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
వారాంతంలో ఫైర్ షో...
ప్రతీ వారాంతం సందర్శకుల కోసం వంతెన పై ఫైర్‌షో నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రతీ శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు వంతెనపై రాకపోకలను నిలిపివేస్తారు. ఆ తరువాత వంతెనపై ఉన్న డ్రాగన్ నిప్పులు వెదజల్లే దృశ్యం మొదలవుతుంది. సుమారు పది నిమిషాల పాటు డ్రాగన్ భయంకరమైన నిప్పులు విరజిమ్ముతుంది. వంతెనను చుట్టేసిన మహాడ్రాగన్ తొమ్మిదిసార్లు మంటలు వెద జల్లితే, ఆ తరువాత మూడుసార్లు నీటిని వెద జల్లుతుంది. వీకెండ్‌తో పాటు సెలవు దినాల్లో సైతం ఈ ఫైర్ షో జరుగుతూ ఉంటుంది. ఫైర్ షోని సందర్శకులు వంతెనపై నిలుచుని కూడా చూడొచ్చు. అయితే బీచ్ పరిసరాల్లో నిలుచుని చూస్తే మొత్తంగా ఆ దృశ్యం మరింత మనోహరంగా ఉంటుంది. కొంత మంది ఔత్సాహికులు ఆ సమయానికి నదిలో పడవల్లో ప్రయాణం చేస్తూ ఆస్వాదిస్తారు. మొత్తంగా ఒక గంట పాటు ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కోలాహలంగా ఉంటుంది.
2500 ఎల్‌ఈడీ లైట్లు...
రోజంతా సాధారణంగా కనిపించే ఈ వంతెన చీకటి అవుతున్న కొద్దీ కొత్త అందాలను సంతరించు కుంటుంది. వంతెనకు చుట్టుకుని ఉన్న డ్రాగన్‌కు 2500 ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. రాత్రివేళ ఎల్‌ఈడీ వెలుగుల్లో డ్రాగన్‌తో పాటు వంతెన కూడా మెరిసిపోతూ ఆకట్టుకుంటుంది. రాత్రుళ్లు లైట్‌షో కారణంగా పొడవైన డ్రాగన్ వంతెన కొన్ని మైళ్ల దూరం నుంచి పెయింటింగ్‌లా కనిపిస్తుంది. సందర్శకులకు ఈ దృశ్యం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. డ్రాగన్ తోక కమలం పువ్వును పోలి ఉంటుంది. ఇది స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెన నిర్మించారు. వంతెన బరువు 8 వేల టన్నులు. వియత్నాంలో యుద్ధం ముగిసిన తరువాత 38వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ వంతెన నిర్మించారు. వియత్నాంలో ఉన్న అనేక ఆధునిక వంతెనలలో ఇదొకటి. ప్రజా రవాణాతో పాటు పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే వీకెండ్‌లో ఫైర్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వియత్నాం ప్రభుత్వం అనుకున్నట్టుగానే డ్రాగన్ వంతెన పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. అక్కడికి వెళ్లినవాళ్లు డ్రాగన్ వంతెనను చూడకుండా... వారి పర్యటన పూర్తి కాదు.
ఈ వార్తలు కూడా చదవండి.
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం
MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
Read Latest Telangana News and National News
Updated Date - May 18 , 2025 | 01:47 PM