Russia Tiger-Goat Bond: పులికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారి.. చిన్న మిస్టేక్‌తో ప్రాణం పొగొట్టుకున్న మేక
ABN, Publish Date - Aug 16 , 2025 | 06:21 PM
పులికి బెస్ట్ ఫ్రెండ్ గారి ఒక్క పొరపాటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఓ మేక ఉదంతం ప్రస్తుతం మరోసారి ట్రెండవుతోంది. ఘటన చాలా ఏళ్ల క్రితమే అయినా అప్పటి వీడియోలు చూసి జనాలు పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పులి, సింహం లాంటి క్రూర జంతువులకు మేకలు, గొర్రెలు ఆహారం. వాటి మధ్య స్నేహం అసంభవం. కానీ రష్యాలో కొన్నేళ్ళ క్రితం ఇదే అరుదైన స్నేహం చిగురించింది. ఓ పులి, మేక ఆప్తమిత్రులుగా మారిపోయాయి. వాటి స్నేహం చూసి జనాలు కూడా షాకయిపోయారు. కానీ మేక చేసిన ఒకే ఒక పొరపాటు చివరకు దాని కొంప ముంచింది. పులి దెబ్బ తట్టుకోలేక మృత్యువాత పడింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలోని ఓ సఫారీ పార్క్‌లో అమూర్ అనే సైబీరియన్ పులి ఉంది. 2015లో జూ అధికారులు ఓసారి దానికి ఆహారంగా టైముర్ అనే బతికున్న మేకను ఇచ్చారు. పులి తనంతట తానుగా వేటాడి తినే అవకాశం ఇచ్చేందుకు ఇలా చేశారు. పులి మానసిక ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పులి బోనులోకి వెళ్లాక కథ ఊహించని మలుపు తిరిగింది.
పులిని అంతకుముందెన్నడూ చూడలేదేమో తెలీదు కానీ.. మేక అస్సలు బెదరలేదు. పైపెచ్చు పులికి దగ్గరా వెళ్లి ఆసక్తిగా పరిశీలించింది. దీంతో, పులి కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. అసలు ఆ జీవం తనకు నిజంగా ఆహారమేనా అని సందేహించే స్థితికి చేరుకుంది. ఆ తరువాత రెండిటి మధ్య స్నేహం మొదలైంది. రెండూ కలిసి జూ అంతా కలియతిరిగేవి, కలిసి ఆహారం తినేవి. ఆటలు ఆడుకునేవి. ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేనంత స్థితికి వాటి స్నేహం ముదిరింది.
కొన్ని నెలల తరువాత పరిస్థితి మరోమారు ఊహించని మలుపు తిరిగింది. పులితో ఉన్న అతి చనువు వల్ల మేక ముందూ వెనకా ఆలోచించుకుండా దాని మీదకు ఎగిరి దూకింది. పులికి కాస్త పెద్ద దెబ్బతగలడంతో చిర్రెత్తుకొచ్చి అది మేకను చిన్న గుట్టపై నుంచి కిందకు తోసేసింది. ఈ క్రమంలో మేకకు కాలు విరగడంతో పాటు పులి దెబ్బ చవి చూశాక ఊహించని షాక్ తిన్నది. ఈ క్రమంలో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మేకను పులి బోను లోంచి మరో చోటకు తరలించారు.
ఆ తరువాత శస్త్రచికిత్స చేసి దాని ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పులి దెబ్బ నుంచి అది కోలుకోలేకపోయింది. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఆ తరువాత నాలుగేళ్లకు కన్నుమూసింది. చివరకు జూ సిబ్బంది పూర్తి లాంఛనాలతో దాన్ని ఖననం చేశారు. అమూర్ పులి మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది.
ఈ రెండు జీవాల స్నేహానికి సంబంధించి వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూ జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రకృతిలో సాధ్యం కానిది ఏదీ లేదని గుర్తు చేస్తుంటాయి.
ఇవీ చదవండి:
వామ్మో.. పవర్‌ఫుల్ మెరుపు.. ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు
నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..
Updated Date - Aug 16 , 2025 | 06:34 PM