Parking Dispute: పార్కింగ్ విషయంలో గొడవ.. హీరోయిన్ సోదరుడి దారుణ హత్య..
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:13 AM
Parking Dispute: గురువారం రాత్రి పొరిగింటి వ్యక్తి తన స్కూటర్‌ను అసిఫ్ ఇంటి గేటు ముందు పెట్టాడు. ఇది గమనించిన అసిఫ్.. గేటు ముందు నుంచి స్కూటర్ తీయాలని అడిగాడు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.
2023లో తమిళంలో ‘పార్కింగ్’ అనే సినిమా విడుదల అయింది. ఆ సినిమా స్టోరీ ఏంటంటే.. అద్దె ఇంట్లో ఉండే ఓ వృద్ధుడు, యువకుడికి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి రక్తం వచ్చేలా కొట్టుకునే వరకు, చంపుకునే వరకు వెళుతుంది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చూసిన చాలా మంది ‘పార్కింగ్ స్థలం కోసం ఇంత గొడవ పడతారా ఏవరైనా?’ అని అనుకుంటారు. అయితే, నిజ జీవితంలో.. అది కూడా ఓ హీరోయిన్ సోదరుడి విషయంలో పార్కింగ్ గొడవ ప్రాణం తీసింది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హుమా ఖురేషీ సోదరుడు అసిఫ్ జంగ్‌పుర ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి పొరిగింటి వ్యక్తి తన స్కూటర్‌ను అసిఫ్ ఇంటి గేటు ముందు పెట్టాడు. ఇది గమనించిన అసిఫ్.. గేటు ముందు నుంచి స్కూటర్ తీయాలని అడిగాడు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత అది తీవ్రమైన గొడవగా మారింది. పొరిగింటి వ్యక్తి పదునైన వస్తువుతో అసిఫ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి అనంతరం పొరిగింటి వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అసిఫ్ కుటుంబసభ్యులు అసిఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడితోపాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
అప్పటివరకూ భారత్‌తో చర్చలు ఉండవు.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..
Updated Date - Aug 08 , 2025 | 11:44 AM