Trump-India Talks: అప్పటివరకూ భారత్‌తో చర్చలు ఉండవు.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
ABN , Publish Date - Aug 08 , 2025 | 09:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అదనపు సుంకాల విధింపు తరువాత చర్చలు కొనసాగుతాయా అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారీ సుంకాలతో భారత్‌పై అన్యాయంగా కాలుదువ్వుతున్న ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో, భారత్- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు కొనసాగుతాయా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ ఉండవని తెలిపారు. ‘విషయం కొలిక్కి వచ్చేంత వరకూ చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా భారత్‌పై ట్రంప్ రెచ్చి పోయారు. రష్యాతో వాణిజ్యం నెరపే దేశాలపై మరిన్ని సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర దేశాలూ రష్యాతో వాణిజ్యం జరుపుతుండగా భారత్‌పైనే అక్కసు ఎందుకని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
భారతీయ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 25 శాతం సుంకం విధిస్తోంది. అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో, భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది.
అమెరికా చర్యలను భారత్ ఖండించింది. సుంకాల విధింపు అన్యాయం, నిర్హేతుకం, చట్టపరంగా సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘ఈ విషయంలో మా వైఖరిని ముందే స్పష్టం చేశాం. మా దిగుమతులన్నీ మార్కెట్ పరిస్థితులు, 1.4 బిలియన్‌ల భారతీయులకు ఇంధన భద్రత అందించడంపై ఆధారపడి ఉంటాయి’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కూడా ఘాటుగా స్పందించారు. గురువారం ఎమ్ఎస్ స్వామినాథన్ సెంటెనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాని.. దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగం విషయంలో భారత్ రాజీ పడదని స్పష్టం చేశారు.
అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను కూడా భారత్ ఎండగట్టింది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీపై సుంకాలు ఎందుకు విధించట్లేదని ప్రశ్నించింది. ఇక చైనా ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన 145 శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి:
ఇంటెల్ కంపెనీ సీఈఓకు ట్రంప్ హెచ్చరిక.. రిజైన్ చేయాల్సిందేనని వార్నింగ్
భారత్‌పై అమెరికా ఆంక్షలు.. రష్యాతో కీలక భేటీ, టారీఫ్ తగ్గేనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి