ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒకే ఊరిలో.. 60 వేలకు పైగా వేపచెట్లు

ABN, Publish Date - Aug 17 , 2025 | 09:11 AM

సమయం, సందర్భం వచ్చినప్పుడు... పర్యావరణం గురించి మాట్లాడడం, మొక్కలు నాటడం... చాలాచోట్ల, చాలామంది చేసేదే. కానీ పర్యావరణహితం కోరుకునే ఒక గ్రామం మాత్రం ఇలాంటి సమయం, సందర్భాల కోసం వేచి చూడలేదు.

ఆ ఊరిలోకి అడుగుపెడితే చాలు... పచ్చని వేపచెట్లు స్వాగతం పలుకుతాయి. ఊరంతా వేపచెట్లే... వేపను దైవంలా భావించే ఆ గ్రామంలో 60 వేలకు పైగా వేపచెట్లు ఉన్నాయంటే ఆశ్చర్యమే. ఇంతకీ వేపచెట్ల సెంటిమెంట్‌ ఆ ఊరిలో ఎందుకుంది?

సమయం, సందర్భం వచ్చినప్పుడు... పర్యావరణం గురించి మాట్లాడడం, మొక్కలు నాటడం... చాలాచోట్ల, చాలామంది చేసేదే. కానీ పర్యావరణహితం కోరుకునే ఒక గ్రామం మాత్రం ఇలాంటి సమయం, సందర్భాల కోసం వేచి చూడలేదు. తమదైన శైలిలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి మిగతావారికి రోల్‌మోడల్‌గా నిలిచారు ‘పదంపుర’ గ్రామస్థులు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ సమీపంలో ఉన్న ఈ పల్లెలో ఎటు చూసినా పచ్చని వేపచెట్లే కనిపిస్తాయి. అలాగని ఏ వందో, వెయ్యో కాదు... దాదాపు 60 వేలకు పైగా వేపచెట్లు కనిపిస్తాయక్కడ. అందులో చాలావరకు వందేళ్లకు పైగా వయసున్నవే. అందుకే ఈ గ్రామాన్ని ‘నీమ్‌ వాలా గ్రామ్‌’, ‘నీమ్‌ నారాయణ్‌ ధామ్‌’ అని పిలుస్తుంటారు.

చరిత్ర ఘనం...

కొన్నేళ్ల్ల కిందట పదంపుర గ్రామంలో మశూచి సోకింది. ఊరిలో సగానికి సగం మంది చనిపోతే, బతికి బట్టకట్టినవాళ్లు పక్కనున్న అడవిలో తలదాచుకున్నారు. ఓ ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు వేప ఆకుల్ని రకరకాలుగా వినియోగించడం మొదలెట్టారు. వ్యాధి ఉధృతి తగ్గాక తమ పల్లెకి తిరిగొచ్చారు. వేప తమ ప్రాణాల్ని కాపాడిందనే బలమైన విశ్వాసంతో ‘ఊరిలో ఇకపై ఎవరూ వేపచెట్లని నరకొద్ద’ని ప్రతినబూనారు. దానినే తరతరాలుగా నిబద్ధతతో పాటిస్తున్నారు. వాళ్ల భక్తి, క్రమశిక్షణ ఫలితమే పదంపురను ఒక పచ్చని అభయారణ్యంగా మార్చింది. ‘మా పూర్వీకులు వేపను పవిత్రంగా పరిగణించాలని మాకు చెప్పారు. మేము దాన్ని అనుసరిస్తూనే మా తర్వాతి తరాలకు చెబుతున్నాం. దేశంలోనే కాకుండా ఆసియాలోనే 60 వేలకు పైగా వేపచెట్లు ఉన్న ఏకైక గ్రామం మాదే అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉంది’ అంటారు గ్రామపెద్ద రమేష్‌సింగ్‌.

నారాయణుడి అవతారంగా...

వేపచెట్లను సాక్షాత్తు నారాయణుడి అవతారంగా విశ్వసిస్తారు పదంపుర ప్రజలు. అందుకే వాటిని తరతరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పరిరక్షించే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అక్కడ ఏ వేపచెట్టుపైనా గొడ్డలి వేటు కనిపించదు. కనీసం కొమ్మల్ని, ఆకుల్ని తెంపడానికీ ఎవరూ ప్రయత్నించరు. ఎవరైనా ఒక్క వేపమండని విరిచినా కఠిన శిక్షతో పాటు, భారీ జరిమానా వేస్తారు. ఒకవేళ ఏదైనా పని కోసం వేరే మార్గం లేక వేప చెట్టు కొట్టేయాల్సి వస్తే, ఆ విషయాన్ని మొదట గ్రామపెద్దలకు తెలియజేయాల్సి ఉంటుంది. సమావేశం ఏర్పాటు చేసి, జరిమానా విధించి ఆపై అనుమతి ఇస్తారు. పైగా వారు ఊర్లోకి వచ్చే పక్షులు, పావురాలకు జీవితాంతం నీరు, ఆహారం పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనను గ్రామస్థులు తూ.చా.తప్పకుండా పాటిస్తారు.

పచ్చదనం... చల్లదనం...

పదంపుర గ్రామస్థులు ఎండాకాలంలో వేపచెట్ల కింద సేదదీరుతారు. పిల్లల ఆటపాటలు, చదువుతో పాటు పెద్దల మాటాముచ్చట్లన్నీ వాటికిందే. ఊర్లో పాడి పశువులు, ఇతరత్రా పెంపుడు జంతువులూ వాటి నీడలోనే విశ్రమిస్తాయి. 60 వేల వేపచెట్లు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల కన్నా గ్రామంలో సుమారు 5-7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే... ఈ గ్రామం వేప చెట్లకే కాదు... వాటి నుంచి వచ్చే ఆకులు, విత్తనాలకీ కూడా ప్రసిద్ధి చెందింది. ఏటా ఊరి నుంచి 2500 టన్నుల వేప విత్తనాల్ని, 30 లక్షలకు పైగా ఎండుటాకుల్నీ ఆయుర్వేద మందుల తయారీదారులకు ఉచితంగా అందిస్తున్నారు. ఏదేమైనా వేపచెట్లను సంరక్షిస్తూ పదంపుర అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఒక్క కరోనా కేసూ లేదు...

‘‘వేప చెట్టును మేమంతా దైవంలా భావిస్తాం. ఆ చెట్లే.. కరోనా మహమ్మారి నుంచి మా గ్రామాన్ని కాపాడాయని నమ్ముతున్నాం. కరోనా ప్రపంచమంతా విలయతాండవం చేసినా, మా గ్రామంలో మాత్రం ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదు.’’

- జస్రాజ్‌ గుర్జార్‌, సామాజిక కార్యకర్త

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2025 | 09:11 AM