Mumbai: రన్నింగ్‌లో విమానం ఎక్కుదామనుకున్నావా.. అదేమైనా రైలా.. ఎవురయ్యా నువ్వు..
ABN, Publish Date - Jun 23 , 2025 | 10:46 AM
ఫ్లైట్ మిస్సవడంతో ఓ ప్రయాణికుడు ఎలాగైనా విమానం ఎక్కేందుకు రన్‌వేపై పరుగులు తీశాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ప్రజా రవాణా సౌకర్యాలు తక్కువ. ఫలితంగా జనాలు రద్దీకి అలవాటు పడిపోయారు. రన్నింగ్‌లో బస్సులు, రైళ్లను ఎక్కేస్తుంటారు. ఇలాంటి అలవాటున్న ఓ యువకుడు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఎవ్వరూ ఊహించని పని చేశాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పీయూష్ సోనీ (25) ఎయిర్‌పోర్టుకు గురువారం ఉదయం 9.50 గంటలకు వెళ్లాడు. అప్పటికే బోర్డింగ్ గేటును మూసేశారు. కానీ ఎలాగైనా విమానం ఎక్కాలన్న తొందరలో అతడు లోపలి ఎమర్జెన్సీ గేటును తెరుచుకుని రన్‌వేవైపు పరిగెత్తాడు. అక్కడ బోలెడన్ని విమానాలు పార్క్ చేసి ఉన్నా, ఏ విమానం ఎక్కాలో స్పష్టత లేకపోయినా అతడు రన్‌వే వైపు దూసుకెళ్లాడు. అప్పటికి గుజరాత్ నుంచి వచ్చిన ఓ ఎయిర్ ఇండియా విమానం పార్కింగ్ ఏరియాకు చేరుకుంది. పీయూష్ ఆ విమానం వైపు పరిగెత్తడాన్ని చూసిన సిబ్బంది ఒకరు వెంటనే భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో విమానం ఏదైనా ల్యాండయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ పోలీసులు పీయూష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను ఎయిర్‌పోర్టులోని ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకుని రన్‌వే పై పరుగులు తీసినట్టు పీయూష్ అంగీకరించాడని తెలిపారు. ఏ విమానం ఎక్కాలన్నది తెలియకపోయినా ఈ దుస్సాహసానికి దిగినట్టు తెలిపారు. పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల బెంగళూరులో ఓ మహిళా డాక్టర్ విమానాన్ని పేల్చాస్తానంటూ సిబ్బందిని బెదిరించిన విషయం తెలిసిందే. లగేజీ విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు బెదిరింపుల వరకూ వెళ్లింది. మహిళ తీరుతో తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పని భావించిన పైలట్, క్రూ సీఐఎస్‌ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను అదుపులోకి తీసుకున్న వారు స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితురాలిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి:
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..
విదేశాల్లో ఉండగా ఆఫీసు నుంచి ఫోన్.. బాస్ రిక్వెస్ట్ విని తిక్కరేగిన మహిళ..
Updated Date - Jun 23 , 2025 | 11:40 AM