Auto Driver: ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:27 PM
కాన్సులేట్ కార్యాలయానికి వచ్చే వారి లగేజీకి కాపలా కాస్తూ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడో ఆటో డ్రైవర్. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజల అవసరాలను గుర్తించి, వినూత్న రీతిలో పరిష్కారాలు కనుగొనడమే వ్యాపారానికి ప్రధాన సూత్రం. సంపద సృష్టికి మూలం. మేనేజ్‌మెంట్, కామర్స్ విద్యార్థులందరూ నేర్చుకునే ముఖ్య ఆర్థిక సూత్రం ఇది. అయితే, ఇలాంటి చదవులేవీ లేని ఓ ఆటో డ్రైవర్ ఈ ఆర్థిక సూత్రాల్ని స్వానుభవంతో నేర్చుకున్నాడు. దాన్ని అమల్లో పెట్టి నెలకు ఏకంగా రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు.
ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఉదంతం ఇది. లెన్స్‌కార్ట్ సంస్థ ప్రాడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ ఈ ఆటో డ్రైవర్ గురించి నెట్టింట పంచుకున్నాడు. అతడి తెలివికి, బిజినెస్ మోడల్‌కు ఫిదా అయిపోయి నెట్టింట ప్రశంసలు కురిపించాడు.
ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ చేస్తున్న వ్యాపారం జనాల లగేజీకి కాపలా కాయడమే. ముంబై వీసా కాన్సులేట్‌లో నిత్యం అనేక మంది వీసా ఇంటర్వ్యూల కోసం వస్తుంటారు. లగేజీని కూడా వెంట తెచ్చుకుంటారు. కానీ కాన్సులేట్‌లో లగేజీ దాచుకునేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు. దీంతో సామాన్లను లోపలికి తీసుకెళ్లలేక బయట ఎక్కడ వదిలిపెట్టాలో తెలియక అనేక మంది తికమక పడుతుంటారు. ఈ ఇబ్బందికి వినూత్న పరిష్కారం కనుగొన్నాడో ఆటో డ్రైవర్. కాన్సులేట్‌కు వచ్చే వారి లగేజీ జాగ్రత్త చేసి వారికి తిరిగి అప్పగించినందుకు ఏకంగా రూ.1000 వెయ్యి చార్జ్ చేస్తున్నాడు.
ఇక లీగల్ చిక్కులేవీ రాకుండా ఆ ఆటోవాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. స్థానికంగా లాకర్ ఉన్న ఓ పోలీసుతో పార్టనర్‌షిప్ ఏర్పాటు చేసుకున్నాడు.
కాన్సులేట్‌కు వచ్చాక లగేజీ ఎక్కడ పెట్టాలో తెలీక తాను అవస్థ పడుతుంటే ఆ ఆటో డ్రైవర్ తనకు తారసపడ్డాడని రూపానీ తెలిపారు. మీ బ్యాగ్ నా వద్ద వదిలిపెట్టండి.. మీరు వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకుంటాను. రూ.1000 చార్జీ చేస్తాను’ అని ఆటోవాలా తన ఇబ్బందిని గమనించి చెప్పాడని తెలిపారు.
‘యాప్స్ లేవు. ఫండింగ్ అవసరమూ లేదు. ఎమ్‌బీఏ చదువులు లేవు. స్వానుభవంతో అతడు ఈ అద్భుత ఆదాయమార్గాన్ని కనుగొన్నాడు. ఇలాంటి వ్యాపారదక్షత గురించిన వర్ణనలు మనకు ఏ మేనేజ్‌మెంట్ పుస్తకంలోనూ కనిపించవు. కానీ మనకూ ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్టులో నిజానిజాలపై స్పష్టత లేకపోయినప్పటికీ జనాలు మాత్రం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్
యుఎస్‌లో పదేళ్లు ఉండి వచ్చాక ఇండియాలో జాబ్.. ఎన్నారై విలవిల
Updated Date - Jun 05 , 2025 | 06:46 PM