India Work Culture: యుఎస్‌లో పదేళ్లు ఉండి వచ్చాక ఇండియాలో జాబ్.. ఎన్నారై విలవిల
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:40 AM
పదేళ్ల పాటు అమెరికాలో జాబ్ చేసి ఇండియాకు వచ్చిన ఓ ఎన్నారై ఇక్కడి కార్యాలయాల్లో పని సంస్కృతి చూసి షాకైపోయారు. భారత్‌కు వచ్చి తప్పు చేశానా అంటూ నెట్టింట తన ఆవేదన వెళ్ల బోసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కార్యాలయాల్లో పని సంస్కృతిలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. అయితే, ఈ తేడాలు భరింపరానివిగా ఉంటాయంటూ ఓ ఎన్నారై తాజాగా నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దాదాపు పదేళ్ల పాటు అమెరికాలో ఉండి ఇటీవల ఇండియాలో జాబ్ చేసేందుకు వచ్చిన ఓ ఎన్నారై ఇక్కడి పరిస్థితులను చూసి దడుసుకున్నారు. స్థాయీభేదాల కారణంగా ఉద్యోగుల మధ్య అంతరాలు, కఠినమైన పని వాతావరణాన్ని చూసి నోరెళ్లబెట్టారు.
ప్రాడక్ట్ బేస్డ్ టెక్ సంస్థలో తనకు జాబ్ దొరికిందని ఆ వ్యక్తి చెప్పారు. భారత్‌కు వచ్చిన రెండు వారాలకే ఈ జాబ్ దొరికిందని అన్నారు. కానీ, అమెరికాకు ఇక్కడికి పని సంస్కృతిలో ఉన్న తేడాను చూసి తనకు షాక్ కొట్టినంత పనైందని చెప్పారు. రోజువారి సమావేశాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
‘ఓ మీటింగ్‌లో నా టీమ్ మేట్ తను రూపొందిస్తున్న ఓ ఫీచర్ గురించి వివరించారు. కానీ మేనేజర్ మాత్రం కటువుగా స్పందించారు. చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపారు. ఆ విమర్శల తీరు ప్రొఫెషనల్‌గా లేకుండా హోమ్ వర్క్ లేటుగా చేసిన స్టూడెంట్‌ను స్కూల్ టీచర్ తిట్టిపోసినట్టుగా ఉంది. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మాటే లేదు. ఆఫీసులో ప్రమాణిక పనిగంటలు అంటూ ఉండవని తొలి రోజున ఎవరో చెప్పారు. పని పూర్తి చేసే దాకా ఆఫీసులో ఉండకతప్పదని అన్నారు. కొందరు కొలీగ్స్ పొద్దుపోయే వరకూ ఆఫీసులో ఉండిపోవడం నేను చూశా’ అని చెప్పారు. సాటి ఉద్యోగుల పట్ల సహృద్భావం, క్రమపద్ధతి కలిగిన పని వాతావరణంలో జాబ్ చేసిన తాను ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నానని ఆ వ్యక్తి తెలిపారు. ఏదో స్కూల్లో చేరినట్టు ఉందని, మేనేజర్లు ఉద్యోగులకు మద్దతుగా నిలవకుండా ప్రిన్సిపాల్స్‌లా దాష్టీకం చేస్తున్నారని అన్నారు.
ఆ వ్యక్తి అభిప్రాయాలతో అనేకమంది ఏకీభవించారు. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం అంత ఈజీ కాదని అన్నారు. అయితే, ముందస్తుగా ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా కాస్త సహనంతో ముందుకు సాగితో ఓ 7 లేదా 8 నెలల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. అప్పటికీ అడ్జస్ట్ కాలేకపోతే వెంటనే అమెరికాకు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్
ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు