Share News

Bengaluru Autodriver: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:56 PM

బెంగళూరులో ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్‌ కాళ్లు మొక్కి ఆమె క్షమాపణలు చెబుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Bengaluru Autodriver: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ అరెస్టు
Bengaluru auto driver assault

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఓ ఆటోడ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని పాంఖురీ మిశ్రాగా గుర్తించారు. ఆమె ఆటోడ్రైవర్‌ను దారుణంగా అవమానించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె కటకటాల పాలైంది.

శనివారం నాడు పాంఖురీ తన భర్తతో కలిసి టూ వీలర్‌పై వెళ్తుండగా.. ఆటో డ్రైవర్‌ లోకేశ్‌తో వివాదం తలెత్తింది. లోకేశ్ తన కాలి పైనుంచి ఆటో పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని డ్రైవర్ లోకేశ్ వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే పాంఖురీ వెంటనే అతడిని చెప్పుతో కొట్టింది. ‘వీడియో రికార్డు చేస్తావా నువ్వు.. చెయ్ రికార్డు చెయ్’ అంటూ ఆమె అనడం సైతం వీడియోలో రికార్డయ్యింది.

అతడిపై చేయి చేసుకున్నాక ఆమె ఎవరికో ఫోన్ చేసి ఆటోడ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ‘అతడు తొలుత నా కాలి పైనుంచి ఆటో పోనిచ్చాడు. ఆపై వీడియో కూడా రికార్డు చేస్తున్నాడు’ అని ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు, ఈ వాగ్వాదం మెుత్తాన్ని పాంఖురీ భర్త కూడా వీడియో రికార్డు చేశాడు. అయితే, వాళ్లు స్థానిక భాషలో కాక హిందీలో వాదనకు దిగడంతోనే తాను వీడియో రికార్డు చేయాల్సి వచ్చిందని లోకేశ్ తెలిపాడు. కాగా, దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


అనంతరం, ఆ జంట ఆటోడ్రైవర్‌ కాళ్లు మొక్కి మరీ క్షమాపణలు చెప్పిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నేను క్షమాపణ చెబుతున్నా. నేను ప్రెగ్నెంట్. బిడ్డకు ఏమైనా అవ్వొచ్చన్న ఆందోళనలో అలా ప్రవర్తించా’ అని ఆమె డ్రైవర్‌కు చెప్పింది. తాను బిహార్‌కు చెందిన మహిళనని, తనకు కన్నడ ప్రజలంటే ఎలాంటి ద్వేషం లేదని పాంఖురీ వివరణ ఇచ్చారు. ‘మాకు బెంగళూరు అంటే చాలా ఇష్టం, ఇక్కడి సంస్కృతి, ప్రజలంటే మాకెంతో ఇష్టం’ అని ఆమె పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్

పెళ్లితో ప్రయోజనాలపై యువతి పోస్టు.. నెట్టింట పెద్ద చర్చ

Read Latest and Viral News

Updated Date - Jun 02 , 2025 | 05:07 PM