Marriage Responsiblilities: పెళ్లితో ప్రయోజనాలపై యువతి పోస్టు.. నెట్టింట పెద్ద చర్చ
ABN, Publish Date - Jun 01 , 2025 | 10:05 AM
పెళ్లితో మహిళలకు ఒరిగేదేముందంటూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్త్రీపురుష సంబంధాల్లో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో ఓ యువతి పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. పెళ్లితో తనకు కలిగే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తూ ఆమె ఈ పోస్టు పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
యువతులు పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండటమే మేలని ఆమె చెప్పుకొచ్చింది. ‘నేను ఉద్యోగం చేస్తున్నా. నాకు పెళ్లికూడా కాలేదని అనుకుందాం. అప్పుడు ఉదయం లేవగానే మా అమ్మ టీ ఇస్తుంది. ఆ తరువాత తీరిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్లొచ్చు. తిరిగొచ్చాక కూడా హ్యాపీగా గడపొచ్చు. ఏ బాదరబందీ ఉండదు. అదే నాకు పెళ్లి అయ్యి ఉంటే వంటలు, దుస్తులు ఉతుక్కోవడం వంటి పనులన్నీ నా మీద పడేవి. కేవలం నా పనులే కాకుండా ఇంట్లో వారి పనులన్నీ నేనే చేయాల్సి వచ్చేది’ అని ఆమె చెప్పుకొచ్చొంది.
‘ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంటి పని కోసం సహాయకురాలిని పెట్టుకోవచ్చు కదా అని కొందరు సూచిస్తుంటారు. కానీ ఆ ఖర్చు కూడా నా శాలరీ నుంచే పెట్టుకోవాలి కదా. భర్త కానీ, అతడి కుటుంబం కానీ ఈ ఖర్చును భరించదు కదా. మరి పెళ్లి వల్ల నాకు ప్రత్యేకంగా వచ్చే ఉపయోగం ఏమిటీ? అపరిచితులతో కలిసి ఒక ఇంట్లో ఉండటం, శాలరీ, సౌకర్యం తగ్గడం తప్ప.. నేనేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా’ అని ఆమె ప్రశ్నించింది.
ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. పెళ్లితో మహిళలకు బాధ్యతలు పెరగడం మినహా ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఏకాంతంలో దొరికే ప్రశాంతత కోల్పోకూడదని అన్నారు. మరికొందరు మాత్రం సంతోషం అనేది జీవిత భాగస్వామిపై ఆధార పడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన భార్య లేదా భర్తను అర్థం చేసుకుని, బాధ్యతలు పంచుకునే వ్యక్తి దొరికితే పెళ్లే బెటరని కొందరు చెప్పారు. అత్తారితో కలిసి ఉండేందుకు ఇష్టం లేకపోతే వేరు కాపురం పెట్టుకోవాలని కూడా కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో
భారతీయ బీచ్‌ల్లో ఊహించని దృశ్యాలు.. షాక్‌లో ఫారినర్
ప్రస్తుతం భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్‌లు తిరుగుతున్నాయో తెలుసా?
Updated Date - Jun 01 , 2025 | 10:55 AM