Share News

Satellite Overcrowding: ప్రస్తుతం భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్‌లు తిరుగుతున్నాయో తెలుసా?

ABN , Publish Date - May 31 , 2025 | 01:35 PM

ప్రస్తుతం భూసమీప కక్ష్యలో సుమారు 11,700 ఉపగ్రహాలు భూమి చుట్టు తిరుగుతున్నాయి. 2050 నాటి కల్లా ఈ సంఖ్య లక్షకు చేరుకునే అవకాశం ఉందట. ఆ తరువాత ఇదే కక్ష్యలో అదనపు ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Satellite Overcrowding: ప్రస్తుతం భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్‌లు తిరుగుతున్నాయో తెలుసా?
Satellite Overcrowding

ఇంటర్నెట్ డెస్క్: గత ఐదేళ్లల్లో భూమి చుట్టు ఉన్న శాటిలైట్‌ల సంఖ్య రెట్టింపైందని నిపుణులు చెబుతున్నారు. స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు భారీ స్థాయిలో ఉపగ్రహాలను ప్రయోగిస్తుండటంతో అంతరిక్షంలో శాటిలైట్‌ల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో, భవిష్యత్తులో కక్ష్యలు ఉపగ్రహాలతో నిండిపోవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఒకప్పుడు అడపాదడపా శాటిలైట్‌ల ప్రయోగాలు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. వేల కొద్దీ శాటిలైట్‌ల ప్రయోగించి మెగాకాన్‌స్టలేషన్స్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్ సంస్థకు చెందిన 7500 శాటిలైట్స్ ప్రస్తుతం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న మొత్తం స్పేస్‌క్రాఫ్ట్‌ల్లో వీటి వాట ఏకంగా 60 శాతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక స్టార్‌లింక్‌కు పోటీగా అమెజాన్ కూడా రంగంలోకి దిగింది. ప్రాజెక్టు కూపియర్ పేరిట ప్రపంచవ్యాప్తంగా వేగవంతైన బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు వేల కొద్దీ శాటిలైట్స్‌‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.


ఇక చైనా కూడా థౌంజెండ్ సెయిల్స్ పేరిట తనకంటూ అంతరిక్షంలో ఓ భారీ శాటిలైట్‌ల సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 పునర్వినియోగ రాకెట్లు అందుబాటులోకి రావడం కూడా శాటిలైట్‌ ప్రయోగాలు ఇబ్బడిముబ్బడిగా జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వందల కొద్దీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు వీలుగా కొన్ని సంస్థలు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి.

ఈ పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తున్న శాస్త్రవేత్తలు అసలు ఒక కక్ష్యలో ఎన్ని ఉపగ్రహాలు పట్టొచ్చన్న అంశంపై దృష్టి సారించారు. వివిధ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న కమ్యూనికేషన్, మిలిటరీ ఉపగ్రహాల్లో అనేకం భూమి సమీప కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాయి. ఆ కక్ష్యలో గరిష్ఠంగా 100,000 ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చు.


అంతకుమించి, ఉపగ్రహాల సంఖ్య పెరిగితే అవి ఒకదాన్ని మరొకటి ఢీకొని కూలిపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం 11,700 శాటిలైట్లు భూమిని పరిభ్రమిస్తున్నాయి. అయితే, ఉపగ్రహ ప్రయోగాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో 2050 సంవత్సరానికల్లా ఈ పరిమితిని చేరుకోవచ్చని అంటున్నారు. ఆ తరువాత కొత్త వాటిని ప్రవేశపెట్టాలంటే పాత ఉపగ్రహాలను కూల్చేయక తప్పదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో

సెలవు కోసం మేనేజర్ కండీషన్ విని షాక్.. ఉద్యోగి రాజీనామా

Read Latest and Viral News

Updated Date - May 31 , 2025 | 01:44 PM