Employee Resigns: సెలవు కోసం మేనేజర్ కండీషన్ విని షాక్.. ఉద్యోగి రాజీనామా
ABN , Publish Date - May 27 , 2025 | 07:47 AM
ఉద్యోగి రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు ఓ మేనేజర్ సెల్ఫీ ప్రూఫ్ కోరడంతో తిక్కరేగిన ఆ ఉద్యోగి జాబ్‌కు రాజీనామా చేశాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: విషపూరిత పని వాతావరణానికి అసలైన నిదర్శనంగా నిలుస్తున్న ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మేనేజర్ అసంబద్ధ డిమాండ్స్ చూసి విసుగు చెందిన ఓ ఉద్యోగి రాజీనామా చేసిన ఉదంతం ఇది. ప్రస్తుతం దీనిపై జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
బాధిత ఉద్యోగి స్వయంగా ఈ ఘటన గురించి రెడిట్‌లో వివరించారు. బంధువుల ఇంట్లో ఓ వేడుకకు హాజరు కావాల్సి ఉండటంతో తాను కొన్ని రోజుల క్రితం సెలవు కోరినట్టు అతడు చెప్పుకొచ్చాడు. లీవ్ ఇచ్చేందుకు మేనేజర్ తొలుత తటపటాయించినా ఆ తరువాత అంగీకరించినట్టు తెలిపాడు. ఇక అతడి కంపెనీ నిబంధనల ప్రకారం, సెలవుపై వెళ్లే ఉద్యోగులు చివరి రోజున కాస్త ముందుగా ఆఫీసు నుంచి బయలుదేరాల్సి వస్తే ఆ విషయాన్ని మేనేజర్లకు సమాచారం ఇవ్వాలి.
రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు తాను మూడు గంటల ముందుగానే ఆఫీసు నుంచి బయటకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఇదే విషయాన్ని మేనేజర్‌కు చెబితే తాను స్టేషన్‌కు వెళ్లాక సెల్ఫీ దిగి ప్రూఫ్ కింద పంపించాలని డిమాండ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇది చాలా అవమానకరంగా, వ్యక్తిగత గోప్యతకు భంగంగా అనిపించడంతో చివరకు రాజీనామా చేసేందుకు డిసైడైనట్టు తెలిపారు. సెలవులో ఉండగానే రాజీనామా చేస్తున్నట్టు ఈమెయిల్ పంపించినట్టు వెల్లడించారు.
ఆ తరువాత మేనేజర్ తనతో స్వయంగా మాట్లాడి రాజీనామాను వెనక్కు తీసుకోమని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే, ఆత్మాభిమానం విషయంలో రాజీపడని తాను సంస్థను వీడేందుకే నిశ్చయించుకున్నట్టు తెలిపారు. ఆ తరువాత మేనేజర్ ఎన్ని సార్లు ఫోన్ చేసి తన మనసు మళ్లించే ప్రయత్నం చేసినా తాను వినలేదని అన్నారు. సంస్థను వీడే సమయంలో మేనేజర్‌తో గొడవపడటం ఇష్టం లేక తన రాజీనామాకు కారణం కూడా చెప్పలేదని తెలిపారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడి చర్యలను సమర్థించారు. రాజీనామాకు కారణం చెప్పకపోవడం కూడా మంచిదేనని అన్నారు. కొన్ని సందర్భాల్లో మేనేజర్లు నోటీస్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను కూడా వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
క్యాబ్ బుక్ చేసిన యువతి.. కారు డ్రైవర్‌గా తన బాస్ రావడంతో..
పెళ్లిళ్ల కోసం చైనా యువకుల పాట్లు.. రిస్క్ వద్దంటూ ప్రభుత్వం హెచ్చరిక