China Foreign Brides: పెళ్లిళ్ల కోసం చైనా యువకుల పాట్లు.. రిస్క్ వద్దంటూ ప్రభుత్వం హెచ్చరిక
ABN , Publish Date - May 26 , 2025 | 12:07 PM
పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరక్క అలమటిస్తున్న చైనా యువకులు చివరకు బంగ్లాదేశీ యువతులను అక్రమ మార్గాల్లో పెళ్లాడుతున్నారు. దీంతో, అక్కడి ప్రభుత్వానికి ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒక కుటుంబం ఒకే సంతానం అంటూ జనాభా నియంత్రణకు చైనా ప్రభుత్వం పాటించిన అసహజ విధానాలు పూర్తిగా వికటించాయి. ఇప్పుడు అక్కడి యువకులకు పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు దొరక్క నానా అవస్థలూ పడే పరిస్థితి దాపురించింది. చివరకు కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతూ దేశ భద్రతకే ముప్పు తెచ్చిపెడుతున్నారు. పరిస్థితి ఇప్పటికిప్పుడు సరిదిద్దలేక అవస్థ పడుతున్న చైనా ప్రభుత్వం రిస్క్ వద్దంటూ యువకుల మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడి అధికారులకు ఇదో పెద్ద సమస్యగా మారింది.
పెళ్లిళ్ల కోసం చైనా యువకుల పాట్లు గమనించిన క్రిమినల్ గ్యాంగ్స్ అడ్డదారులు తొక్కుతూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా పెళ్లీడుకొచ్చిన యువతులు తక్కువైపోవడంతో చైనా యువకులు విధిలేని పరిస్థితుల్లో విదేశీ యువతులతో పెళ్లికి రెడీ అంటున్నారు. దీంతో, క్రిమినల్ గ్యాంగ్స్ బంగ్లాదేశీ యువతులను ఎరగా వేస్తున్నాయి. వారి ఫొటోలను షార్ట్ వీడియోల రూపంలో నెట్టింట పెట్టి చైనా యువకులను ఉచ్చులోకి దింపుతున్నాయి. వారి నుంచి అందినమేరకు డబ్బు వసూలు చేసి బంగ్లాదేశీ యువతులను అక్రమ మార్గాల్లో చైనాకు తరలిస్తున్నాయి.
ఇది చైనా ప్రభుత్వానికి భద్రతా కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. బంగ్లాదేశీ యువతులతో భద్రతా పరమైన సవాళ్లు తప్పవని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఫారిన్ యువతుల కోసం చైనా యువకుల వెంపర్లాట దేశ భద్రతకే ముప్పు అంటూ వారి హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని చైనా రాయబారం కార్యాలయం పలు సూచనలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశీ యువతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, అక్కడ వధువులకు తీవ్ర కొరత ఏర్పడింది. పెళ్లికి సిద్ధంగా ఉన్న మూడు కోట్ల మంది యువకులు చివరికి ఒంటరి పక్షులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు, చైనా యువకులతో పెళ్లిళ్ల పేరిట బంగ్లాదేశీ యువతులను క్రిమినల్ గ్యాంగులు అక్కడకు తరలించి వ్యభిచార కూపంలోకి కూడా దింపుతున్నాయి. ఇటీవలే ఢాకా పోలీసులు ఓ క్రిమినల్ గ్యాంగ్‌ను అరెస్టు చేసింది. దీంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏటా రూ.7 లక్షలిచ్చి గూగుల్ ఉద్యోగుల్లా పనిచేయమంటే ఎలా.. నెట్టింట టెకీ ఆవేదన
తప్పుడు అడ్రస్ ఇచ్చినందుకు కస్టమర్‌పై దాడి... డెలివరీ ఏజెంట్ దారుణం