Share News

IT Worker Frustration: ఏటా రూ.7 లక్షలిచ్చి గూగుల్ ఉద్యోగుల్లా పనిచేయమంటే ఎలా.. నెట్టింట టెకీ ఆవేదన

ABN , Publish Date - May 23 , 2025 | 11:28 PM

తక్కువ శాలరీతో పనిచేస్తున్న భారతీయ టెకీల విషయంలో కాస్త సహృద్భావంతో స్పందించాలంటూ ఓ యువ టెకీ అమెరికన్ బాస్‌లను ఉద్దేశించి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

IT Worker Frustration: ఏటా రూ.7 లక్షలిచ్చి గూగుల్ ఉద్యోగుల్లా పనిచేయమంటే ఎలా.. నెట్టింట టెకీ ఆవేదన
Indian IT worker frustration

ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ రంగంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం సమయం కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువ టెకీ నెట్టింట పోస్టు తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

‘‘భారతీయులకు జాబ్స్ ఔట సోర్స్ చేసే అమెరికన్లను ఉద్దేశించి ఈ లేఖ రాస్తున్నారు. నిత్యం మాపై ఒత్తిడి పెంచే ముందు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోండి. ఇక్కడ ఓ సగటు ఐటీ ఉద్యోగికి ఏటా రూ.7 లక్షల కంటే తక్కువ ఆర్జిస్తాడు. అంటే ఏటా 8 వేల డాలర్ల కంటే తక్కువ. అయినా కానీ మేము గూగుల్ ఉద్యోగులతో సమానంగా పనిచేయాలని అనుకుంటారు. వివిధ టైమ్ జోన్లు, ఎడతెగని మీటింగ్స్, చివరి నిమిషంలో డెడ్‌లైన్స్ పెట్టడం.. ఇలాంటి ఎన్నింటినో మౌనంగా భరిస్తున్నాము’’


‘‘కాబట్టి, ఇలా ఒత్తిడి చేసే బదులు అందరం పనిలో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుందాం. మేమేమీ యంత్రాలము కాదు. మాకు పని పట్ల బాధ్యత ఉంది. కానీ పరస్పర గౌరవంతో వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లక్ష్యాలు, అంచనాలు ఏర్పాటు చేసుకొందాము. సమయ పాలన పాటించడం అందరికీ ముఖ్యమే. కాబట్టి, మేము మా శక్తి కొద్దీ పనిచేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. పరిస్థితి అర్థం చేసుకుని ఇరువురికీ అనువైన మధ్యేమార్గం ఎంచుకోవాలి ’’ అంటూ పోస్టు పెట్టారు.


దీనిపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ‘‘ఈ విషయాలను అమెరికన్ల కంటే అమెరికాలోని ఇండియన్లే ఎక్కువగా అర్థం చేసుకోవాలి’’ అని ఓ వ్యక్తి అన్నారు. ‘‘అమెరికా, ఐరోపా దేశాల్లోని మేనేజర్‌లు కాస్తంత కూల్‌గా ఉంటారు. ఏదైనా ఈమెయిల్ పంపించా వారంలోపల జవాబు కావాలని అంటారు. కానీ భారతీయులు మాత్రం రాత్రి 11కు మెయిల్ పెట్టి తెల్లారి 9 కల్లా రిప్లై కావాలని డిమాండ్ చేస్తారు’’ అని ఓ వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఆ యువ టెకీ పోస్టు తెగ వైరల్ అవుతోంది.

Updated Date - May 24 , 2025 | 08:26 AM