Leave: విదేశాల్లో ఉండగా ఆఫీసు నుంచి ఫోన్.. బాస్ రిక్వెస్ట్ విని తిక్కరేగిన మహిళ..
ABN, Publish Date - Jun 23 , 2025 | 07:59 AM
సెలవు పెట్టి విదేశీ టూర్‌కు వెళ్లిన ఓ మహిళను లైవ్ లొకేషన్ షేర్ చేయాలని అడిగారో బాస్. లేకపోతే లీవ్ శాంక్షన్ కాదని హెచ్చరించారు. దీంతో, ఆమె ఈ ఉదంతంపై జనాల అభిప్రాయం కోరుతూ నెట్టింట పోస్టు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏడాదంతా కష్టపడి పని చేసిన ఓ మహిళ సేద తీరేందుకు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లాక ఊహించని షాక్ తగిలింది. బాస్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఆమె ఆనందమంతా ఆవిరైపోయింది. బాస్ ఇలా చేయొచ్చా, చట్టాలు అనుమతిస్తాయా అంటూ ఆమె నెట్టింట తన ఆవేదన పంచుకుంది. మహిళ చెప్పింది విన్న నెటిజన్లు ఆమె బాస్‌కు మెంటలెక్కిందంటూ తిట్టిపోస్తున్నారు.
మలేషియాకు చెందిన ఓ మహిళా ఉద్యోగి సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. తనకు కంపెనీలో వార్షిక సెలవులు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో, ఈసారి సెలవు పెట్టి విదేశాలకు వెళ్లానని అన్నారు. అయితే, టూర్‌లో ఉండగా బాస్ ఫోన్ చేసి తన లైవ్ లొకేషన్ షేర్ చేయమని డిమాండ్ చేశారని ఆమె తెలిపారు. ఇది కొత్తగా తెచ్చిన రూల్ అని, కంపెనీలోని ఉద్యోగులందరికీ వర్తిస్తుందని చెప్పారని తెలిపారు.
లైవ్ లొకేషన్ షేర్ చేయనందున తన లీవ్ దరఖాస్తు ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నట్టు బాస్ చెప్పారని వెల్లడించారు. ముందస్తుగా లీవ్ పొందిన వారికి కూడా ఈ కొత్త రూల్ వర్తిస్తుందని బాస్ చెప్పినట్టు తెలిపారు. ఈ అసంబద్ధ డిమాండ్ తనకు చిరాకు తెప్పించడంతో తన లైవ్ లొకేషన్ షేర్ చేయలేదని అన్నారు.
ఆధునిక ఉద్యోగుల జీవితాలు బానిసత్వంగా మారిపోయాయని అనిపిస్తోందని కామెంట్ చేశారు. ఇలాంటి పనులకు చట్టం కూడా అనుమతిస్తోందని బాస్ చెప్పడాన్ని ప్రస్తావించిన ఆమె ఇలాంటి చట్టాలు ఉన్నాయా అని నెటిజన్లను ప్రశ్నించారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది మహిళ బాస్‌పై విమర్శలు గుప్పించారు. ఏదేదో ఊహించుకుంటూ ఆమె బాస్ అసహజంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలకు చట్టాలు అస్సలు సమ్మతించవని తెలిపారు. లొకేషన్ షేర్ చేయకుండా హక్కుల కోసం ధైర్యంగా పోరాడావంటూ మహిళను కొందరు ప్రశంసించారు. కుదిరితే మరో సంస్థకు మారిపోవాలని కూడా సూచించారు. కొందరు మాత్రం కొన్ని కీలక కామెంట్స్ చేశారు. విదేశీ టూర్‌ను కంపెనీ స్వయంగా స్పాన్సర్ చేసినట్టైతే ఉద్యోగి లొకేషన్ వివరాలను కోరే హక్కు ఉంటుందని తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
45 లక్షల శాలరీనా.. ఇంత తక్కువైతే ఎలా.. టెకీ అభ్యంతరం నెట్టింట వైరల్
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..
Updated Date - Jun 23 , 2025 | 08:49 AM