విమానాశ్రయాల సొగసు చూడతరమా..
ABN, Publish Date - Jun 22 , 2025 | 08:30 AM
మన విమానాశ్రయాలు... అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీ పడే స్థాయిలో తయారవుతున్నాయి. గ్రాండ్ ఎంట్రన్స్, లాంజ్‌లు, టెర్మినల్స్, షాపింగ్ అండ్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్... ఏవిధంగా చూసినా అబ్బురపడాల్సిందే.
మన విమానాశ్రయాలు... అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీ పడే స్థాయిలో తయారవుతున్నాయి. గ్రాండ్ ఎంట్రన్స్, లాంజ్‌లు, టెర్మినల్స్, షాపింగ్ అండ్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్... ఏవిధంగా చూసినా అబ్బురపడాల్సిందే. ఏవియేషన్, ఎయిర్‌పోర్టు సర్కిల్స్‌లో ఒక సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్ బాగా పాపులర్... అదే ‘ప్యాక్సెక్స్’ (paxex)... అంటే... ‘ప్యాసింజర్ ఎక్స్‌పీరియన్స్’. పదేళ్ల క్రితంతో పోల్చితే ఈ విషయంలో చాలా మార్పులనే గమనించొచ్చు...
ఎయిర్‌పోర్టుకు వెళితే అంతా ఖరీదైన వ్యవహారమే అనే సాధారణ అభిప్రాయం ఎప్పుడూ ఉంటుంది. అయితే అవి ఇటీవల కాలంలో అత్యంత ఆహ్లాదభరితంగా కూడా రూపాంతరం చెందుతున్నాయి. ప్రస్తుతం సామాన్యులు సైతం విమానంలో వెళ్లే ధైర్యం చేస్తున్నారు. పైగా ప్రతీరోజూ లక్షలాది ప్రయాణికులతో విమానాశ్రయాలు బస్టాండ్లను తలపిస్తూ కిటకిటలాడుతున్నాయి.
ఇంతకుముందులా కాకుండా విమాన ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందిస్తూనే చక్కని అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యాయి. మనదేశంలోని చాలా నగరాల్లో విమానాశ్రయాలు సౌందర్యపరంగా, సాంకేతికపరంగా, సౌలభ్యపరంగా చక్కగా ముస్తాబయ్యాయి. ఒకవైపు ఆధునిక సౌకర్యాలు అందిస్తూనే, మరోవైపు ఆర్టిస్టిక్‌గా మారాయి. బెంగళూరులోని ‘కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం’ టెర్మినల్ 2లోకి వెళితే... అక్కడ చూపు తిప్పుకోనివ్వని ఆర్కిటెక్చర్ ‘కళా’? నిజమా? అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరూ ఫొటోలు తీసుకోకుండా బయటకు అడుగుపెట్టరు. వెదురుతో చేసిన డిజైన్లు, వేలాడే గార్డెన్లతో మనదేశంలోనే అత్యుత్తమ ‘గ్రీన్’ విమానాశ్రయంగా పేరు తెచ్చుకుంది. అదేవిధంగా సాంకేతికంగా ‘డిజీయాత్ర’ సౌకర్యాన్ని అందించిన తొలి విమానాశ్రయం కూడా ఇదే. ‘టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్’ కాన్సెప్ట్‌తో దీనిని తీర్చిదిద్దారు.
సాంకేతిక ప్రయాణం...
‘ప్యాక్సెక్స్’లో ‘డిజీయాత్ర’ అనేది ప్రయాణికుల విమానాశ్రయ అనుభూతిని మరింత సౌకర్యవంతంగా, సులువుగా మార్చేసింది. న్యూఢిల్లీలోని టెర్మినల్ 3లో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కూడా ప్రవేశపెట్టారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి విమానాశ్రయాల్లో ఇండియన్ పాస్‌పోర్టు ఉన్నవారు, ఓసీఐ (ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా) కార్డు ఉన్నవారు కూడా పొడవైన ఇమ్మిగ్రేషన్ క్యూలకు వెళ్లకుండా, పాస్‌పోర్టు స్కాన్ చేయడం ద్వారా స్లయిడింగ్ గేట్లను దాటుకుని వెళ్లొచ్చు. ఈ క్రమంలో అన్నీ కూడా సాంకేతిక ఏర్పాట్లే ఉంటాయి.
అదేవిధంగా ‘వర్చువల్ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే’ (వీఐడీ) కూడా ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని మరింత తేజోవంతంగా మార్చింది. విమాన ప్రయాణం తొలిసారిగా చేసేవారికి కూడా ఈ తరహా సాంకేతికత ఎంతో ఉపయోగపడుతోంది. రియల్ టైమ్ ఫ్లయిట్ అప్‌డేట్లతో పాటు, త్రీడీ మ్యాప్స్, లైవ్ లొకేషన్ ట్రాక్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ గత ఏడాది 7 కోట్ల 70 లక్షల ప్రయాణీకులకు సేవలందించి... ‘ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ’ (ఏఎస్‌క్యూ) విభాగంలో వరుసగా ఏడవసారి గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ముంబయి విమానాశ్రయం 5 కోట్ల 48 లక్షల మందికి సేవలందించింది. టెర్మినల్ 2లో ‘స్కబ్బర్ డ్రయ్యర్ రోబో’లను కూడా ప్రవేశపెట్టి ఆశ్చర్యపరిచింది.
కళాత్మకంగా...
విమానాశ్రయం అంటే లగ్జరీతో పాటు కళాత్మకంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే దేశంలోని చాలా విమానాశ్రయాలు కళాత్మకంగా తయారయ్యాయి. స్థానిక చిత్రకారులకు చెందిన పెయింటింగ్స్‌ను కూడా ప్రదర్శిస్తున్నాయి. ఉదాహరణకు నార్త్ గోవాలో కొత్తగా నిర్మించిన ‘మోపా’ విమానాశ్రయంలో గోవాకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు మేరియో మిరండా వ్యంగ్యచిత్రాలు కనిపిస్తాయి. అదేవిధంగా అన్ని చోట్లా డైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అద్భుతంగా మార్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఏరోప్లాజా’ను 42 వేల చదరపు అడుగులతో తీర్చిదిద్దారు. ప్రయాణికులతోపాటు సాధారణ ప్రజలకు కూడా ఈ డైనింగ్ అందుబాటులో ఉంటుంది.
ఇటీవల కాలంలో విమానాశ్రయాల్లో ఫ్యాషన్ షోలు, లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేయడం ట్రెండ్‌గా మారింది. అయితే ‘ఇది ప్రారంభం మాత్రమే’ అంటున్నారు. అంటే... ట్రైలరే ఇలా అదిరిపోతే, అసలు సినిమా ముందున్నట్లే కదా!
ఈ వార్తలు కూడా చదవండి.
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2025 | 08:30 AM