US Culture Shock: అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్
ABN, Publish Date - Jul 03 , 2025 | 07:24 PM
పొరుగింట్లో అగ్నిప్రమాదం జరిగినా అమెరికన్లు ఎవరూ బయటకు వచ్చి కనీసం తొంగి అయినా చూడకపోవడంపై ఓ ఎన్నారై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెట్టింట అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజల ఆలోచనారీతులు, జీవన విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని దేశాల్లో జనాలు కలుపుగోలుగా ఉంటారు. చొరవ తీసుకుని అవతలి వారికి సాయపడేందుకో, సలహా ఇచ్చేందుకో ముందుకొస్తారు. సాటి మనిషిగా స్పందిస్తున్నామని అనుకుంటారు. ఇది అవతలి వారికి ఒక్కోసారి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఇక మరి కొన్ని దేశాల్లో జనాలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమర్యాదకరంగా భావిస్తారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అస్సలు హద్దుమీరరు. అయితే, ఈ తేడాను అమెరికాలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ ఎన్నారై తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు (US neighbors' No Reaction To Fire Accident).
నితీష్ అనే ఎన్నారై తనకెదురైన ఆశ్చర్యకర అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. తన ఇంటికి సమీపంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవిస్తే ఇరుగుపొరుగు వారెవరూ కనీసం అటువైపు తొంగి కూడా చూడకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా ఒక్కరు కూడా బయటకు వచ్చి చూడలేదని అన్నారు. అసలేం జరిగిందో కనుక్కునేందుకు వారు ప్రయత్నించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఇంటి ఓనర్ తనను ఏం జరిగిందని మాటవరుసకు అడిగి మళ్లీ లోపలకు వెళ్లిపోయారని తెలిపారు. అదే ఇండియాలో అయితే చుట్టుపక్కల వారందరూ బయటకు వచ్చి బాధితులకు ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించే వారని, బహుశా భారత్‌లో మాత్రమే ఇలాంటి స్పందన కనిపిస్తుందేమోనని అన్నారు. ‘ఇలా అంటున్నందుకు నన్ను జనాలు తిట్టిపోయచ్చు గానీ ఇరుగుపొరుగు ఉన్నది సాటి వారికి సాయం చేయడానికేగా. లేకపోతే ఇరుగుపొరుగు అన్న పదానికి అర్థం ఏముందీ’ అని ప్రశ్నించారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పౌర స్పృహ, వ్యక్తిగత అంశాల మధ్య విభజన రేఖపై జనాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘అధికారులు జాగ్రత్త తీసుకుంటారని అక్కడి వారికి తెలుసు. బయటకొచ్చి ఆ ఘటనను వీడియోలు తీస్తే ఉపయోగం ఉండదు కదా’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘అవతలి వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఆలోచనతో వారు ఇలా చేస్తున్నారు. ప్రతి విషయంలో భావోద్వేగాల ఆధారంగా స్పందించకూడదు’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
ఇవీ చదవండి:
మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్
ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు
Updated Date - Jul 03 , 2025 | 07:36 PM