Indian Job Crisis: భారత్‌లో నిరుద్యోగం పెరగడానికి అధిక ప్రభుత్వ శాలరీలే కారణం.. ఆర్థికవేత్త స్టేట్‌మెంట్
ABN, Publish Date - Aug 18 , 2025 | 10:07 AM
భారత ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక శాలరీలే దేశంలో నిరుద్యోగితకు కారణమని డెవలప్‌మెంటల్ ఎకానమిస్టు కార్తిక్ మురళీధరన్ అన్నారు. ఈ ప్రభుత్వ శాలరీలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగితపై ప్రముఖ డెవలప్‌మెంటల్ ఎకానమిస్ట్ కార్తిక్ మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగంలో అధిక శాలరీలు జాబ్ మార్కెట్‌లో పెడపోకడలకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్న అనేక సమస్యలకు ఇదే కారణమని అన్నారు.
మురళీధరన్ విశ్లేషణ ప్రకారం, 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో శాలరీలు మార్కెట్ రేటు కంటే ఐదు రెట్లకు పైనే ఉంటున్నాయి. అదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాధికారుల శాలరీలు మాత్రం ప్రైవేటు రంగంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా దిగువస్థాయి ఉద్యోగుల జీతాలు పెరిగి పైస్థాయి వారివి తగ్గి వేతనాల వ్యవస్థ అపసవ్యంగా మారింది.
ఈ అపసవ్య వ్యవస్థ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయని కార్తిక్ మురళీధరన్ తెలిపారు. ప్రభుత్వ కేటాయింపుల్లో అధిక శాతం శాలరీలకు ఖర్చవుతుండటంతో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకుండా పోతోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక శాలరీలు, తక్కు పని అన్న భావన కారణంగా ఈ జాబ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో ఇది పెడధోరణులకు దారి తీస్తోందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్కామ్స్‌కు కూడా ఇదే కారణమని తేల్చారు. మిలిటరీ స్థాయిలో సెక్యూరిటీ పెట్టినా స్కామ్‌లను అరికట్టలేని దుస్థితి నెలకొందని తెలిపారు.
ఈ తీరు నిరుద్యోగితకు కూడా దారి తీస్తోందని చెప్పారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చదువుకున్న యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతూ ఉద్యోగాలకు దూరమవుతున్నారని, రాష్ట్రంలో అక్షరాస్యుల్లో 80 శాతం నిరుద్యోగిత ఇలాంటి వారి వల్లేనని ఓ అధ్యయనంలో తేలినట్టు ఆయన చెప్పారు. అత్యధిక డిమాండ్ ఉన్న జాబ్స్‌కు నైపుణ్యాలే అవసరం లేదన్న భావన నెలకొందని తెలిపారు. బట్టీ పట్టి పరీక్షలు పాస్ కావాలన్న భావన పెరిగిపోయిందని తెలిపారు. ప్రైవేట్ రంగంలో జాబ్స్ లేవన్న వాదనను కూడా ఆయన కొట్టి పారేశారు. ప్రైవేటు ఉద్యోగాల్లో మార్కెట్ రేటును బట్టే శాలరీలు ఉంటాయని అన్నారు. నియామక పద్ధతుల్లో సమూల మార్పులే దీనికి పరిష్కారమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
విమానం కాక్‌పిట్‌లో పైలట్‌ల రొమాన్స్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎయిర్‌హోస్టెస్
పులికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారి.. చిన్న మిస్టేక్‌తో ప్రాణం పొగొట్టుకున్న మేక
Updated Date - Aug 18 , 2025 | 10:15 AM