ICICI Minimum Balance: కనీస బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెంపు.. ఐసీఐసీఐ బ్యాంకుపై విమర్శలు
ABN, Publish Date - Aug 09 , 2025 | 05:16 PM
బ్యాంక్ అకౌంట్‌లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని పెంచుతూ ఐసీఐసీఐ బ్యాంకు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ జనాలు ఆర్బీఐని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్ అకౌంట్స్‌లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్‌ను పెంచుతూ ఐసీఐసీ బ్యాంక్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణం జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
ఐసీఐసీ బ్యాంకు అధికారిక ప్రకటన ప్రకారం, మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని సేవింగ్స్ అకౌంట్ కస్టమర్‌లు తమ అకౌంట్ బ్యాలెన్స్ నెలకు సగటున రూ.50 వేలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గతంలో ఇది కేవలం రూ.10 వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ఐసీఐసీఐ కస్టమర్లకు కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ను రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల నెలవారీ మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఆగస్టు 1 తరువాత వచ్చే కొత్త కస్టమర్లు అందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. ఇంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే కస్టమర్లు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
తాజా మార్పుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధనికులకు అనుకూలంగా ఈ మార్పు ఉందంటూ జనాలు మండిపడుతున్నారు. ఇది కస్టమర్లను లూటీ చేయడమేనని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యతో వెనకబడిన తరగతుల వారు బ్యాకింగ్ సేవలకు దూరమవుతారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఓవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉల్లంఘనలపై పెనాల్టీలు తొలగిస్తుంటే ప్రైవేటు బ్యాంకులు మాత్రం జరిమానాలు మరింత పెంచుతున్నాయి. ప్రైవేటీకరణతో సమస్య ఇదేనేమో’ అని కొందరు అన్నారు. ఈ విమర్శలపై ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా స్పందించాల్సి ఉంది.
రోజువారి కార్యకలాపాల ఖర్చులు, పెట్టుబడుల నిర్వహణ కోసం బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను విధిస్తాయి. బ్యాంకు పేర్కొన్న కనీస మొత్తం కంటే అకౌంట్‌లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు కస్టమర్లు జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. కనీస బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తుంటాయి.
ఇవీ చదవండి:
కొలీగ్‌కు లవర్‌ను వెతికిపెడితే బోనస్.. అమెరికా టెక్ కంపెనీ ఆఫర్
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
Updated Date - Aug 09 , 2025 | 05:25 PM