H-1B Visa: ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ
ABN, Publish Date - Jul 11 , 2025 | 07:38 PM
అమెరికాలో ఉంటున్న హెచ్-1బీ వీసాదారులు అక్కడ ఇళ్లు కొనద్దంటూ ఓ వ్యక్తి నెట్టింట చేసిన సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మాత్రం ఈ సూచనతో తీవ్రంగా విభేదించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఇక అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటున్న భారతీయులకు ట్రంప్ సర్కారు విధానాలు మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నారైలకు ఓ నెటిజన్ రెడిట్ వేదికగా చేసిన సూచనపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటున్న వారు అక్కడ ఇళ్లు కొనవద్దంటూ ఓ వ్యక్తి రెడిట్ వేదికగా సలహా ఇచ్చారు. ప్రస్తుతం టెక్ రంగంలో పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయని తెలిపారు. ‘మీరూ కన్నుమూసి తెరిచే లోపే జాబ్ పోవచ్చు, హెచ్-1బీ వీసాలున్న వారికి వాతావరణం ప్రతికూలంగా మారొచ్చు. ఇంటిపై అప్పుతో వచ్చే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మీరు పనిచేస్తున్న కంపెనీ ఒక్క రోజులో తన విధానాలు మార్చుకోవచ్చు. సంస్థ దృష్టిలో మీరు కేవలం ఒక వనరు మాత్రమే అన్న విషయం మరిచిపోవద్దు’ అని సదరు వ్యక్తి తన పోస్టులో హెచ్చరించారు.
అమెరికాలో అనేక టెక్ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ లేఆఫ్స్‌కు హెచ్-1బీ వీసాదారులే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, హెచ్-1బీ ఉన్న వారిని కూడా సంస్థలు తొలగిస్తున్నాయి. జాబ్ ట్రాకర్ సంస్థ ప్రకారం, వివిధ రంగాలకు చెందిన 95 శాతం సంస్థలు జులైలో లేఆఫ్స్‌కు ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మోర్గన్ స్టాన్లీ వంటి సంస్థలన్నీ ఉద్యోగులను తొలగించాయి. ఏఐ సాయంతో రోజువారీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు కొన్ని సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. మరి కొన్ని సంస్థలు మాత్రం వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా లేఆఫ్స్ చేపడుతున్నట్టు పేర్కొన్నాయి.
ఇక తాజాగా పోస్టు జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ నెటిజన్ సూచనతో ఏకీభవించారు. మరికొందరు మాత్రం తీవ్రంగా విభేదించారు. ‘హెచ్-1బీ వీసాదారుడిని కాబట్టి ఇక తిండి కూడా తగ్గించాలని అంటావా’ అని ఓ వ్యక్తి సెటైర్ పేల్చారు.
ఇవీ చదవండి:
మద్యం కోసం ఆరాటం.. ఇనుప చువ్వల మధ్య తల ఇరుక్కుపోవడంతో..
ఇలాంటి మోసం మీరెక్కడా చూసుండరు.. దుస్తుల షాపులోకి దూరిన దొంగ..
Updated Date - Jul 11 , 2025 | 07:45 PM