బొమ్మలు కాదు... కూరగాయలే...
ABN, Publish Date - Aug 17 , 2025 | 10:58 AM
వంద కిలోల క్యాబేజీ, వెయ్యి కిలోల గుమ్మడికాయ, భారీ క్యాలీ ఫ్లవర్... వాటిని అంత పెద్దగా ఎలా పండిస్తారనే సందేహం సందర్శకులకు సహజంగానే కలుగుతుంది. ఆశ్చర్యంగా, ఆసక్తిగా వాటిని చూస్తూండిపోతారెవరైనా. ఎక్కడ? ఎలా? ఎందుకు? అంటే అలస్కాకు వెళ్లాల్సిందే.
వంద కిలోల క్యాబేజీ, వెయ్యి కిలోల గుమ్మడికాయ, భారీ క్యాలీ ఫ్లవర్... వాటిని అంత పెద్దగా ఎలా పండిస్తారనే సందేహం సందర్శకులకు సహజంగానే కలుగుతుంది. ఆశ్చర్యంగా, ఆసక్తిగా వాటిని చూస్తూండిపోతారెవరైనా. ఎక్కడ? ఎలా? ఎందుకు? అంటే అలస్కాకు వెళ్లాల్సిందే.
మార్కెట్లో కూరగాయలను మునుపటి లాగా కిలోల చొప్పున తీసుకునే కుటుంబాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే కదా. ఒక కుటుంబంలో ముగ్గురు లేక నలుగురు మాత్రమే ఉంటున్నారు. సాధారణ కూరగాయల గురించి పెద్దగా చెప్పు కోవాల్సిందే ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు ఎక్కడైనా, ఏదైనా పొలంలో లేదా మార్కెట్లో పేద్ద గుమ్మడి కాయ లేదా పొడవాటి పొట్లకాయ కనిపిస్తే అది వార్తగా మారుతోంది.
అదే ‘అలస్కా స్టేట్ ఫేయిర్’కి వెళితే అక్కడ అన్నీ భారీగానే కనిపిస్తాయి.నిత్యం మనం వాడే కూరగాయల సైజుల కంటే పదింతలు పెద్ద సైజులో కనిపిస్తాయి అన్నీ. అందుకే వాటికి ‘అలస్కా జెయింట్ వెజిటబుల్స్’ అని పేరుంది.
అలస్కాలో ప్రతీ ఏడాది ఆగస్టులో జరిగే ‘స్టేట్ ఫెయిర్’లో భారీ ఆకారంలో ఉన్న కూరగాయలు అతి పెద్ద ఆకర్షణ. ఒక్కో రైతు తను ఎంతో కష్టపడి పండించిన కూరగాయలను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. అత్యంత పెద్దవైన కూరగాయలకు, వాటిని పండించిన రైతులకు బహుమతులు అందజేస్తారు.
అసలక్కడ ప్రపంచంలో మరెక్కడా లేనంత పెద్దగా కూరగాయలు ఎందుకు పండుతున్నాయన్న దానిమీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. దీనికి ముఖ్యకారణం సూర్యుడేనట. మన దగ్గర సాధారణంగా ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. కానీ అలస్కాలో పంటల కాలం సరాసరి 105 రోజులే. అమెరికాలోని ఈ రాష్ట్రం ఉత్తర ధృవానికి అతి సమీపంలో ఉంది. కాబట్టి అక్కడ ఎండాకాలంలో సూర్యరశ్మి రోజుకి 19 గంటలు ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రా సూర్యకిరణాల వల్ల పంటలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉంటాయి. అందుకే కూరగాయల సైజు పెద్దగా మారుతుంది. ముఖ్యంగా క్యాబేజీ, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, గుమ్మడి, ఆలూ, బీట్రూట్, పాలకూర, లెట్టూస్.... ఇలా కూరగాయలు పెద్ద సైజులో పెరుగుతాయి. అక్కడి మతానుస్కా వ్యాలీలో లక్షకు పైగా ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు.
ఈ ఏడాది అలస్కా స్టేట్ ఫెయిర్ సెప్టెంబర్ 1న ముగుస్తుంది. ఈ వేడుక కేవలం కూరగాయల ప్రదర్శనకే పరిమితం కాదు. ఏడాదికి ఒక్కసారి జరుపుకునే అతి పెద్ద పండగగా కూడా అలస్కావాసులు భావిస్తారు. ఈ సమయంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు... విందువినోదాల్లో పాల్గొంటారు. అలాగే ప్రదర్శనలో ఉంచిన అతిపెద్ద కూరగాయలని, అక్కడి వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సెంటర్‌లోని జంతువులకు బహుమతిగా అందించడం ఆచారం. అలా ఈ ‘స్టేట్ ఫెయిర్’ మూగజీవులకూ ఒకరకంగా పండగలాంటిదే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 17 , 2025 | 10:59 AM