ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీటిలో తేలియాడే నగరాల గురించి తెలుసుకుందామా..

ABN, Publish Date - Jul 13 , 2025 | 07:56 AM

‘అమెజాన్‌’ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ రెండో పెళ్లి వేడుకలతో మరోసారి వార్తల్లో నిలిచింది వెనిస్‌. చిన్నచిన్న ద్వీపాలపై అప్పుడెప్పుడో నిర్మించిన వెనిస్‌ నీటిలో తేలియాడే నగరం. వెనిస్‌ స్ఫూర్తితో సాగరాల్లో తేలియాడే ఆధునిక నగర నిర్మాణాల ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని దేశాలు అలాంటి ప్రాజెక్టులను మొదలుపెట్టాయి.

‘అమెజాన్‌’ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ రెండో పెళ్లి వేడుకలతో మరోసారి వార్తల్లో నిలిచింది వెనిస్‌. చిన్నచిన్న ద్వీపాలపై అప్పుడెప్పుడో నిర్మించిన వెనిస్‌ నీటిలో తేలియాడే నగరం. వెనిస్‌ స్ఫూర్తితో సాగరాల్లో తేలియాడే ఆధునిక నగర నిర్మాణాల ట్రెండ్‌ ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని దేశాలు అలాంటి ప్రాజెక్టులను మొదలుపెట్టాయి. అనేక అద్భుతాలతో, కళ్లుచెదిరేలా రూపుదిద్దుకుంటున్న సముద్రాల్లో తేలియాడే భవిష్యత్‌ నిర్మాణాల విశేషాలివి...

మనిషి మెదడులా...

- పగడపు నగరం, మాల్దీవులు

వెయ్యికి పైగా ద్వీపాలతో అలరారే అందమైన దేశం మాల్దీవులు. అక్కడ ఎక్కువగా ఉన్నవి పగడపు దీవులే. సముద్ర గాలులు, అలల తాకిడీ మామూలే. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగి మునిగిపోయే ప్రపంచ నగరాల జాబితాలో ఈ దేశం ఉంది. ఈ తీవ్ర పరిణామాలకు చెక్‌ పెట్టేందుకు నీటి అలలపై తేలియాడే నగరాన్ని అక్కడ నిర్మిస్తున్నారు. నీటిమట్టంతో పాటు పైకి లేచేలా ఈ నగరాన్ని డిజైన్‌ చేశారు. పగడాల స్ఫూర్తితో ఈ నగరంలో అన్నీ షట్కోణ ద్వీపాలే. మానవ మెదుడును పోలిన ఆకారంలో ఈ డిజైన్‌ ఉండడం విశేషం. పర్యావరణహితమైన సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. సుమారు 200 హెక్టార్లలో ఈ సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని మాలే నుంచి బోటులో పది నిమిషాలలో అక్కడికి చేరుకోవచ్చు. 20 వేల మంది ప్రజలు నివసించేలా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం అయిదు వేల ఫ్లోటింగ్‌ యూనిట్లలో ఇళ్లు, హోటళ్లు, షాపులు, హాస్పిటళ్లు, స్కూళ్లు, కార్యాలయాలు అన్నీ ఉండేలా ప్లాన్‌ చేశారు. డచ్‌ ఆర్కిటెక్చరల్‌ సంస్థ ‘వాటర్‌ స్టూడియో’ తో కలిసి అక్కడి ప్రభుత్వం 2027 నాటికి ఈ ఫ్యూచర్‌ సిటీని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది.

అలల ప్రపంచం

- ఓషియానిక్స్‌, దక్షిణ కొరియా

కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద అలల నగరాన్ని దక్షిణ కొరియా నిర్మిస్తోంది. ఈ అలల ప్రపంచం పేరు ఓషియానిక్స్‌. సుమారు 200 మిలియన్‌ డాలర్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘హాబిటాట్‌’ సంస్థతో కలిసి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నగరాన్ని మూడు విభాగాలుగా విభజించారు. మొదటిది 12 వేల మంది నివసించగల ‘లివింగ్‌ ప్లాట్‌ఫాం’. జీరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను ఇక్కడ అనుసరిస్తారు. భవిష్యత్తులో రెండు లక్షల మందికి ఆవాసయోగ్యంగా దీన్ని మార్చుకునే వీలుంది.

రెండోది ‘లాడ్జింగ్‌ ప్లాట్‌ఫాం’. ఇందులో అతిథి గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ మొదలైనవి ఉంటాయి. ఇక మూడోది ‘రీసెర్చ్‌ ప్లాట్‌ఫాం’. ఇక్కడ ఉష్ణోగ్రతను నియంత్రించగల తోటల్ని పెంచుతారు. ఇంకా హైడ్రోఫోనిక్‌ టవర్లలో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో 20 ప్లాట్‌ఫామ్‌లుగా ఈ ప్రాజెక్టును విస్తరించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా ఉపయోగిస్తున్నది ‘బయోరాక్‌’. సాధారణ కాంక్రీట్‌ కన్నా ఇది అనేక రెట్లు దృఢమైనది. సముద్రనీటిలోని మినరల్స్‌ను గ్రహించి ఇది సున్నపురాయి పూతలా మారుతుంది. ఏవైనా పగుళ్లు ఏర్పడినా సొంతంగా సరిచేసుకుంటుంది. సాంప్రదాయేతర విధానాలలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఈ నగరంలో రవాణా కోసం సైకిళ్లతో పాటు అక్వాటిక్‌ బస్సులను వినియోగిస్తారు. ఈ నగరం పూర్తయితే సముద్ర తీర ప్రాంతాల ప్రజల భవిష్యత్తుకు పెద్ద భరోసా అందించినట్టే.

శంఖు, నత్తలే స్ఫూర్తి

- ట్రిపుల్‌ జీరో, ఫిలిప్పీన్స్‌

ఏడు వేలకు మించిన ద్వీపాల సమూహం ఫిలిప్పీన్స్‌. ఇక్కడ సముద్ర అలలపై అనేక గ్రామాలు వెలిశాయి. ఈ గ్రామాల్లో వెదురుచెక్కలపై నిర్మించిన ఇళ్లే అన్నీ. పడవల్లోనే వీళ్ల రవాణా సాగుతుంటుంది. అయితే ఫిలిప్పీన్స్‌ ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. టూరిస్టులను ఆకర్షించేందుకు ఎన్నో పథకాలను రూపొందించారు. అలాంటి ఓ పథకమే ‘నాటిలస్‌ ఎకో రిసార్టు’. అక్కడి పాలవాన్‌ ద్వీపంలో ఈ రిసార్టును నిర్మించాలని ప్రతిపాదన. ఈ నిర్మాణానికి కీలకం జీరో వేస్ట్‌, జీరో ఎమిషన్‌, జీరో పావర్టీ. అందుకే దీన్ని ‘త్రీ జీరోస్‌’ ప్రాజెక్టు అని పేర్కొంటున్నారు. ఈ రిసార్టు అంతా సాంప్రదాయేతర ఇంధనంతో నడుస్తుంది. సముద్ర జీవనానికి గుర్తుగా ఇక్కడి భవనాలు శంఖు, నత్తల డిజైన్లలో రూపొందించారు. అయితే ఈ రిసార్టు ఇంకా డిజైనింగ్‌ దశలోనే ఉంది. ఒకవేళ పూర్తయితే మాత్రం తీరప్రాంతాల్లో రిసార్టులు, భవనాల నిర్మాణంలో కొత్త ఆవిష్కరణ చేసినట్టే.

సునామీలను తట్టుకునేలా...

- డోగెన్‌ సిటీ, జపాన్‌

2050 నాటికి సముద్ర తీరాల్లోని 30 కోట్ల మంది జీవనానికి ప్రమాదం ఏర్పడుతుందని ఓ అంచనా. ఈ వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచేలా జపాన్‌లో ‘డోగెన్‌’ నగరాన్ని నిర్మిస్తున్నారు. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ ఫ్లోటింగ్‌ సిటీగా ఈ ప్రతిష్టాత్మక నగరాన్ని పేర్కొనవచ్చు. దాదాపు 1.5 కిలోమీటర్ల వ్యాసంతో, 4 కిలోమీటర్ల చుట్టుకొలతతో వృత్తాకారంలో దీన్ని నిర్మిస్తున్నారు. పది వేల మంది ఇక్కడ నివసించవచ్చు. రోజుకి మరో 30 వేల మంది రాకపోకలు సాగించవచ్చు. డోగెన్‌ సిటీని రెండు పొరలుగా తీర్చిదిద్దుతున్నారు.

సముద్రనీటికి పైన ఉండేది మెరిటైమ్‌ సిటీ, దిగువన నగర నిర్వహణకు సంబంధించిన డేటా సెంటర్‌, హెల్త్‌కేర్‌, మందుల పరిశ్రమలు. నీటి స్థాయిలను బట్టి డోగెన్‌ పొజిషన్‌ మారుతుంది. సునామీలను తట్టుకునేట్టుగా దీన్ని డిజైన్‌ చేశారు. రాకెట్‌ లాంచ్‌ సైట్‌ని కూడా ఏర్పరుస్తున్నారు. స్కూళ్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, పార్కులు, ఆహారోత్పత్తి కేంద్రాలు, ఆఫీసులు, హోటళ్లు... ఇలా అన్నీ ఒకేచోట ఉండే స్మార్ట్‌ సిటీ, స్వయం సమృద్ధిగల నగరం డోగెన్‌. 2030 నాటికి దీన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నారు. అనుకున్న విధంగా పూర్తయితే వాతావరణ మార్పులకు నిజంగానే చెక్‌పెట్టగల గేమ్‌ఛేంజర్‌ డోగెన్‌.

అలలపై ఆఫీసు

- ఎఫ్‌ఓఆర్‌, నెదర్లాండ్స్‌

నెదర్లాండ్స్‌కు వెళితే... అక్కడ రోటర్‌డ్యామ్‌లోని అలలపై తేలే విచిత్రమైన ఆఫీసును చూడాల్సిందే. ‘వాతావరణ మార్పుల కోసం అది చేయాలి, ఇది చేయాలి’ అని చెప్పడమే కాదు... చేసి చూపించారు ‘గ్లోబల్‌ సెంటర్‌ ఆన్‌ ఆడాప్టేషన్‌’ సంస్థ (జిసీఏ) వాళ్లు. జీసీఏ ముఖ్య కార్యాలయమే ఈ నీళ్లపై ఆఫీసు. దీన్ని ‘ఫ్లోటింగ్‌ ఆఫీస్‌ రోటర్‌డ్యామ్‌ (ఎఫ్‌ఓఆర్‌)’గా పిలుస్తారు. రిన్హేవెన్‌ హార్బర్‌కే ల్యాండ్‌మార్క్‌గా ఈ భవనం మారింది. ప్రపంచంలోని అతి పెద్ద, సుస్థిరమైన ఆఫీసు భవన నిర్మాణంగా ఇది రికార్డులకెక్కింది. అలాగే అలలపై తేలియాడే అతి పెద్ద ఆఫీసు కూడా ఇదే. దాదాపు 40 వేల చదరపు అడుగుల నిర్మాణం ఇది. భవనాన్నంతా మూడు అంతస్తులుగా నిర్మించారు. పచ్చగడ్డితో కప్పును రూపొందించారు. పూర్తిగా పర్యావరణ అనుకూలమైన నిర్మాణం ఇది. ఇందులో ఆఫీసులన్నీ సౌరశక్తినే వినియోగిస్తాయి. భవన నిర్మాణాన్నంతా రీసైకిల్‌ చేసే విధంగా నిర్మించడం విశేషం. నీటిమట్టంతో పాటు భవనం ఎత్తు మారడం విచిత్రం.

ఈ వార్తలు కూడా చదవండి.

సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 13 , 2025 | 07:56 AM