Share News

Harish Rao: రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:23 AM

మోటార్లు ఆన్‌ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్‌ నిండిపోతుంది. అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. ఈసారి వర్షాలు పడతలేదు. దీంతో పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది.

Harish Rao: రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

  • మోటార్లు ఆన్‌ చేస్తే అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు:హరీశ్‌

సిద్దిపేట, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘మోటార్లు ఆన్‌ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్‌ నిండిపోతుంది. అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. ఈసారి వర్షాలు పడతలేదు. దీంతో పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి ఏమో మోటర్లు ఆన్‌ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రేవంత్‌ రెడ్డీ.. దమ్ము, సత్తా ఉంటే అసెంబ్లీ పెట్టు. నువ్వేం చేసావో, మేమేం చేసామో ఎంతసేపైనా మాట్లాడుకుందాం. కానీ అసెంబ్లీ పెట్టే దమ్ముందా నీకు?’ అని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను హరీశ్‌రావు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే, గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నయి.


అంటే రోజుకు 80 టీఎంసీల నీళ్లు పోతున్నయి. కళ్ల ముందు నీళ్లు పోతున్నా రేవంత్‌ రెడ్డి రైతులకు మాత్రం నీళ్లు ఇస్తలేడు. కేవలం స్విచ్‌ ఒత్తితే నీళ్లు వస్తాయి. నువ్వు ఇస్తావా, లేకపోతే మేము రైతులతో కలిసి స్విచ్‌ వేయాలా’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నదని, మేడిగడ్డ కూలితే బ్రిడ్జి పైన లారీలు, వాహనాలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్‌పైన, మాపైన కోసం ఉంటే కేసులు పెట్టుకో కానీ, రైతులు ఏంచేశారు? కాళేశ్వరం ఏం చేసిందని? అని ప్రశ్నించారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్‌ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టే ఓ సజీవ సాక్ష్యమని హరీశ్‌ రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆన్‌ చేసినట్లే, కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నుంచి కూడా మోటర్లు ఆన్‌ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 13 , 2025 | 05:24 AM