Independence Day 2025: ఆగస్టు 15న జెండా ఎగురవేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్..
ABN, Publish Date - Aug 14 , 2025 | 09:07 PM
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, అన్ని సంస్థలు, పాఠశాలలు, కళాశాలలలో జెండాను కచ్చితంగా ఎగురవేస్తారు. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. జాతికి గౌరవంగా భావించే జెండాను ఎగురవేసేటప్పుడు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల చెర నుంచి భారతదేశానికి శాశ్వత విముక్తి లభించింది. ఈరోజు నుంచి ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం పేరిట దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో జెండా ఎగురవేసే కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. దీనితో పాటు స్వాతంత్ర్య దినోత్సవ అమృత మహోత్సవం తర్వాత ఇళ్లలో కూడా జాతీయ జెండాను ఎగురవేస్తారు. వాస్తవానికి త్రివర్ణ పతాకాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎగురవేయడానికి అనేక నియమాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని ప్లాన్ చేస్తుంటే.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాను ఎగురవేసేటప్పుడు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో.. తెలుసుకోండి.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు పాటించాల్సిన రూల్స్?
2002 భారత జెండా కోడ్ ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయడానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ఇక్కడ చూడండి.
జెండాను ఎల్లప్పుడూ గౌరవంగా ఎగురవేయాలి. తర్వాత నెమ్మదిగా గౌరవభావంతో కిందికి దించాలి. అనంతరం దానిని మడతపెట్టి సురక్షితమైన స్థలంలో ఉంచాలి.
త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ తలక్రిందులుగా వేలాడతీయకూడదు. పైన కాషాయం, మధ్య తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగులు ఉండాలి
త్రివర్ణ పతాకం గౌరవప్రదమైన స్థితిలో ఉండేలా చూసుకోండి.
దెబ్బతిన్న లేదా అపరిశుభ్రమైన జెండాను ఎప్పుడూ ప్రదర్శించకూడదు. ఎగురవేసే జాతీయ జెండా పరిపూర్ణ స్థితిలో ఉండాలి.
జెండా కోడ్ ప్రకారం, చేతితో నేసిన, యంత్రాలతో తయారు చేసిన పత్తి, పాలిస్టర్, ఉన్ని లేదా పట్టు ఖాదీ బంటింగ్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగురవేయవచ్చు.
2002 సవరించిన జెండా కోడ్ ప్రకారం, వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు ఆదివారాలు, సెలవు దినాలతో సహా అన్ని రోజులలో జెండాను ఎగురవేయవచ్చు.
జెండా పరిమాణంతో సంబంధం లేకుండా.. జెండా కోడ్ ప్రకారం, త్రివర్ణ జెండా 3:2 నిష్పత్తిలో ఉండాలి. జెండా మధ్య భాగంలో 24 సమాన అంతరాల రేఖలతో ముదురు నీలం రంగులో అశోక చక్రం ఉండాలి.
ఇంట్లో, ఆఫీసులో ఎక్కడయినా మీరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటే జెండా వంగి ఉండకుండా నేలను లేదా నీటిని తాకకుండా చూసుకోండి.
త్రివర్ణ పతాకం దెబ్బతిన్నట్లయితే దానిని చెత్తబుట్టలో లేదా మరే ఇతర ప్రదేశంలో వేయకూడదు. గౌరవప్రదంగా కాల్చాలి లేదా పూడ్చిపెట్టాలి. దహనం చేసిన తర్వాత బూడిదను నది నీటిలో వేయాలి.
జెండాను ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా చింపివేయకూడదు. కాల్చకూడదు లేదా వికృతీకరించకూడదు. ఎందుకంటే ఇది నేరం.
జెండాను మురికి ప్రదేశంలో లేదా నష్టం కలిగించే విధంగా నిల్వ చేయకూడదు.
Updated Date - Aug 14 , 2025 | 09:07 PM