Auto on Railway Track: రైల్వే ట్రాక్‌పై రెచ్చిపోయిన ఆటో డ్రైవర్.. ఫుల్లుగా తాగి.. షాకింగ్ వీడియో
ABN, Publish Date - Jul 06 , 2025 | 06:44 PM
బీహార్‌లో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో రెచ్చిపోయాడు. ఏకంగా రైల్వే ట్రాక్‌పై ఆటో తోలాడు. అదే సమయంలో అటువైపు రైలు రావడం చూసి స్థానికులు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో ఊగిపోతూ నానా రభసా చేశాడు. రైల్వే ట్రాక్‌పై ఆటో తోలుతూ అరాచకం సృష్టించాడు. వెంటనే స్థానికులు అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ యువతి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ ఉదంతం సీతామఢీ జిల్లాలో వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మేహసూల్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ తాగిన మైకంలో ఆటోను ఏకంగా రైల్వే ట్రాక్‌పైకి తీసుకొచ్చాడు. తనకు తిరుగు లేదన్నట్టు ట్రాక్‌పై ఆటో తోలుతూ హల్‌చల్ చేశాడు. పక్క ఉన్న మరో ట్రాక్‌పై అదే సమయంలో ఓ రైలు రావడం చూసి స్థానికులు హడలిపోయారు.
వెంటనే రంగంలోకి దిగి పెను ప్రమాదాన్ని తప్పించారు. రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఆటో డ్రైవర్‌ను అడ్డగించి కిందకు దింపారు. ఆటోను పట్టాలపై నుంచి కిందకు తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా ఆటో డ్రైవర్ నానా హంగామా సృష్టించాడు. ఒంటిపై షర్టు లేకుండా రైల్వే ట్రాక్స్‌పై నడుస్తూ కలకలం రేపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
బీహార్‌లో ప్రస్తుతం మద్య నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మహిళల డిమాండ్ మేరకు సీఎం నితీశ్ కుమార్ మద్యాన్ని నిషేధించారు. అయితే, అక్రమ మార్గాల్లో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనిపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్
ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు
Updated Date - Jul 06 , 2025 | 06:58 PM