ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూగర్భ పట్టణం

ABN, Publish Date - May 04 , 2025 | 08:59 AM

వేసవిలో కాసేపు బయటకు వెళితే ‘ఎండ దెబ్బ తగిలింది’ అని ఆసుపత్రుల్లో చేరుతుంటారు. నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే... ఎడారుల్లో ఎలా ఉంటుంది? అయితే అలాంటి ఎడారిలోనే ఎండ భయం లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్నారు కొందరు. అదెలా సాధ్యమయిందో తెలియాలంటే ఆస్ట్రేలియాలోని కూబర్‌ పెడే పట్టణానికి వెళ్లాల్సిందే..

కనుచూపు మేర ఇసుక దిబ్బలు... యాభై డిగ్రీల సెల్సియస్‌ పైనే ఉష్ణోగ్రత... మనుషులు జీవనం సాగించడం అసాధ్యమైన అలాంటి చోట కొన్ని వందల మంది హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. దక్షిణ ఆస్ట్రేలియా ఎడారిలోని ఒక మారు మూల ప్రాంతంలో ఉన్న ‘కూబర్‌ పెడే’ పట్టణంలో కనిపిస్తుందీ దృశ్యం. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే... ఆ పట్టణం ఉంది సాక్షాత్తూ భూగర్భంలో. ఇది ఒక మైనింగ్‌ టౌన్‌. 1915లో రూపుదిద్దుకున్న ఈ పట్టణం ఇప్పుడు ప్రముఖ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందింది. ఈ పట్టణానికి ‘ప్రపంచ ఓపల్‌ రాజధాని’ అని పేరుంది. భూగర్భంలో నిర్మించిన ఇళ్లను ‘డగౌట్స్‌’ అని పిలుస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: తీరొక్క ‘సౌందర్యం’


ఎలా ఏర్పడిందంటే...

ఎడారిలో, భూగర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవ డానికి కారణం ఓపల్స్‌. ‘ఓపల్స్‌’ అంటే ఖరీదైన రంగు రాళ్లు. రాయిలో సిలికా అనే పదార్థం ఉంటుంది. దానిపై కాంతి పడినప్పుడు ఇంద్రధనుస్సు లాంటి రంగులను వెదజల్లుతుంది. ఇలాంటి రాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎడారిలో ఉన్నాయి. మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన తరువాత సైనికులు అత్యంత విలువైన ఖనిజం ‘ఓపల్స్‌’ కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడం ప్రారంభించారు. కొద్ది రోజుల తరువాత తవ్వకాలు జరిపిన ప్రాంతాలను శాశ్వత ‘డగౌట్స్‌’గా ఏర్పాటు చేసుకున్నారు. అలా కూబర్‌ పెడే టౌన్‌ ఏర్పడింది. ‘డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కూబర్‌ పెడే’ ప్రకారం అక్కడ 2500 మంది నివసిస్తున్నారు.


సకల సదుపాయాలు...

భూగర్భంలో ఇళ్లంటే ఏవో చిన్న చిన్న గుహల్లాంటివి అనుకునేరు. వాటిలో మూడు పడక గదులు ఇళ్లు కూడా ఉన్నాయి. లివింగ్‌ రూమ్‌, కిచెన్‌, బెడ్‌రూమ్స్‌, బాత్‌రూమ్స్‌ ఇలా సకల సదుపాయాలున్నాయి. ప్రార్థన చేసుకోవడానికి చర్చ్‌ కూడా ఉంది. చర్చి భూఉపరితలం నుంచి 55 అడుగుల లోతులో ఉంటుంది. మిగతా ఇళ్లన్నీ 13 అడుగుల లోతులో నిర్మించుకున్నారు. దీనివల్ల ఉపరితలం కూలిపోయే అవకాశం ఉండదు. భూగర్భంలోనే షాపులు, మ్యూజియం, బార్‌ వంటివి ఉన్నాయి. ఇంటర్నెట్‌, విద్యుత్తు, నీళ్లు వంటి సదుపాయాలున్నాయి. సూర్యరశ్మి తప్ప సాధారణ గృహాల్లో ఉండే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తాయి. ఈ ఇళ్లలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ సాధారణ స్థితిలో ఉంటాయి. 24 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగదు. అందుకే వీరికి ఏసీల అవసరమే రాదు.


1915లో కూబర్‌ పెడే రూపుదిద్దుకున్నా 1980లో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి మొదలైంది. పర్యాటకులు అక్కడున్న ‘డెసర్ట్‌ కేవ్‌’ హోటల్‌లో బస చేస్తుంటారు. భూగర్భ గృహాల్లో కాసేపు విశ్రమించడానికి ఆసక్తి చూపుతుంటారు. సూర్యాస్తమయం తరువాత భూగర్భంలోని ఇళ్ల నుంచి అందరూ బయటకు వస్తారు. గ్లోయింగ్‌ బాల్స్‌తో డెసర్ట్‌ గోల్ఫ్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేస్తారు. భూగర్భ గృహాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల దగ్గర స్థానికులు ప్రవేశ రుసుము వసూలు చేస్తుంటారు. భూగర్భంలో ఇళ్లున్నా, ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో... ఆ ప్రాంతాన్ని వదిలిరాకుండా ఇప్పటికీ రెండు వేల మంది దాకా అక్కడే నివసిస్తుండటం వినేవారికి, చూసేవారికి వింతగా ఉంటుంది.

Updated Date - May 04 , 2025 | 08:59 AM