Share News

తీరొక్క ‘సౌందర్యం’

ABN , Publish Date - May 04 , 2025 | 08:27 AM

సౌందర్య ఉత్పత్తుల్లో వెన్నకు చాలాకాలం నుంచి చోటుంది. అయితే ఇథియోపియాలో వెన్నను పూర్తిగా కేశ సౌందర్యానికి వినియోగిస్తారు. ఈ ఆఫ్రికా నేలపై నేరుగా పడే సూర్యకిరణాల నుంచి రక్షణకు ఓ మార్గంగా దీనిని వాళ్లు పేర్కొంటారు.

తీరొక్క ‘సౌందర్యం’

సౌందర్యపోషణ... ప్రపంచవ్యాప్తంగా మహిళలు అందంగా కనిపించేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. చర్మం సున్నితంగా ఉండాలంటే... ముఖం మీద మచ్చలు పోవాలంటే... కళ్ల కింద నల్లచారలు కనుమరుగు కావాలంటే... కేశాలు ఒత్తుగా పెరగాలంటే... మార్కెట్‌ మాయ ఎలాగూ అన్నిచోట్ల కనిపిస్తుంది. అయితే కొన్ని నమ్మకాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టి, అందరికీ వాటిని పరిచయం చేస్తున్నాయి. ప్రయోగాలకు ఉసిగొల్పుతున్నాయి. అలాంటి కొన్ని విచిత్రమైన, విలక్షణమైన సౌందర్యపోషణ నమ్మకాలివి...

ఈ వార్తను కూడా చదవండి: Trisha: పెళ్లి గురించి బాధ లేదు..


వెన్నతో కేశ సంరక్షణ

సౌందర్య ఉత్పత్తుల్లో వెన్నకు చాలాకాలం నుంచి చోటుంది. అయితే ఇథియోపియాలో వెన్నను పూర్తిగా కేశ సౌందర్యానికి వినియోగిస్తారు. ఈ ఆఫ్రికా నేలపై నేరుగా పడే సూర్యకిరణాల నుంచి రక్షణకు ఓ మార్గంగా దీనిని వాళ్లు పేర్కొంటారు. కేశాలకు వెన్నను దట్టంగా పట్టించి గంట తరవాత తలస్నానం చేస్తారు ఇథియోపియన్లు. దీనివల్ల జుట్టుకు బలం చేకూరి, బాగా పెరుగుతుందట కూడా. అంతేకాకుండా వెన్నలోని ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్లు జుట్టుకు తేమను, చక్కటి పోషణతో పాటు కండిషనర్‌గా కూడా సహాయపడతాయి. ఆఫ్రికన్లకు ఉండే గిరిజాల జుట్టు చిక్కుపడకుండా, మరింతగా రింగులు తిరిగేలా కూడా తోడ్పడుతుందని అక్కడి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

book3.2.jpg


భలే... బియ్యపు నీళ్లు

వయసు తెలియకుండా సౌందర్యాన్ని సంరక్షించుకునే వాళ్లలో జపనీయులు ముందుంటారు. జపాన్‌ ఇళ్లలో మగువలు ఆచరించే సౌందర్య సాధనాలలో ముఖ్యమైనది బియ్యపు నీళ్లు అంటే ఆశ్చర్యమేస్తుంది. బియ్యాన్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని వడగట్టి ముఖానికి, మెడకూ, చేతులకూ, కాళ్లకు పట్టిస్తారు. ఈ నీళ్లలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అమైనో ఆసిడ్లు, కార్బోహైడ్రేట్లు చర్మంలోని తేమని పరిరక్షిస్తాయి. ముడతలను అరికడతాయి. ఈ నీటిని కేశ సంరక్షణకూ ఉపయోగించడం విశేషం. బియ్యం నీళ్లలోని విశేషణాల వల్ల కురులు పొడవుగా పెరుగుతాయని, శిరోజాలు తెల్లబడకుండా నివారించవచ్చని జపాన్‌ మగువలు నమ్ముతారు. సహజ కండిషనర్‌గా కూడా ఈ నీళ్లని పేర్కొంటారు. అక్కడ అన్నం గంజిని కూడా ఇలాగే వినియోగిస్తారు. నేడు మార్కెట్‌లో లభించే సౌందర్య ఉత్పత్తుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు... బియ్యం నీళ్లలో ఉండడం విశేషం. అందుకే బియ్యం కడిగిన నీటిని ఓ సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టి, వారం రోజుల పాటు వాడుతుంటారు.


రాయితో సున్నితంగా మర్దన

చైనాలో మగువలు సౌందర్య సాధనంగా ‘గ్వా షా’ ను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ముఖానికి నూనె రాసి చేతులతో మర్దన చేస్తారు. కానీ చైనాలో చేతులకు బదులుగా ప్రత్యేక రాయిని వాడతారు. అదే గ్వా షా. మాండరిన్‌ భాషలో ‘షా’ అంటే కమిలిన గాయం లేదా మచ్చ. ‘గ్వా’ అంటే పోగొట్టడం అని అర్థం. ఈ గ్వా షా వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల ముఖ కండరాల మధ్య ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా చర్మం కాంతులీనుతుంది. ముడతలూ తగ్గుతాయి. మలినాలు తొలగేందుకూ ఈ సుతిమెత్తని మర్దన ఉపయోగపడుతుంది.

book3.3.jpg

అయితే ముఖమ్మీది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి గ్వా షాను జాగ్రత్తగా వినియోగించాలి. లేకపోతే చర్మం కందిపోతుంది. పచ్చ, క్వార్జ్‌, పాల రాయి తదితరాలను గ్వా షా కోసం ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి చైనాలో నాలుగు వేల ఏళ్ల నుంచే గ్వా షాను సాంప్రదాయేతర వైద్య విధానంగా ఉపయోగిస్తున్నట్టుగా పరిశోధనలు చెబుతున్నాయి. అక్కడ ప్రత్యేకంగా గ్వా షా నిపుణులూ లేకపోలేదు. అయితే సోషల్‌మీడియా వల్ల నేడు గ్వా షా ముఖ మర్దన చైనాను దాటి అంతటా విస్తరిస్తోంది.


బురద మంచిదే...

ప్రాచీన రోమన్లు బురద స్నానాలు చేసేవారని చారిత్రక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో ‘మడ్‌ బాత్‌’లకు ప్రసిద్ధి చెందిన నేల టర్కీ. అక్కడి ‘దాల్యాన్‌’ బురద నేలలో మునిగి తేలేందుకు ప్రపంచ వ్యాప్త టూరిస్టులూ క్యూ కడుతుంటారు. చక్కటి ఫలితాల కోసం బురద నేలల్లో కనీసం 15 నిమిషాల పాటు కూర్చోవాలంటారు సౌందర్య నిపుణులు. ఇలా బురదలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతారు. బురదలోని ఖనిజ లవణాల వల్ల చర్మం కొత్త కాంతిని పొందుతుంది. ఇంకా కీళ్ల నొప్పులు, కండరాల మధ్య ఒత్తిడి కూడా తగ్గుతాయి. శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్‌ అవుతుందని టర్కీయుల నమ్మకం. ముల్తానా మట్టిని శరీరానికి పూసుకోవడం మనదగ్గర కూడా ట్రెండ్‌గా ఉంది.


చింతపండుతో ప్రయోగాలు

థాయి సుందరీమణుల అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాళ్ల సౌందర్య సాధనాల్లో చింతపండుది అగ్రస్థానం అంటే ఆశ్చర్యమేస్తుంది. థాయ్‌ రుచుల్లో చింతపండుని విరివిగా వాడతారు. ఇంకా చింతపండును చక్కని చిక్కని ష్రబ్‌గా కూడా వాళ్లు వినియోగించడం విశేషం. థాయి మగువలు వారంలో ఓసారి నానబెట్టిన చింతపండు, రాక్‌సాల్ట్‌ను కలిపి శరీరానికి పట్టిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శుభ్రంగా కడిగేస్తారు. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం కాంతిలీనుతుందని వాళ్లు భావిస్తారు. చింతపండులోని కొల్లాజెన్‌ వల్ల ముడతలు తొలగిపోయి, చర్మానికి దృఢత్వం చేకూరుతుంది. తేనె, అలోవేరా తదితరాలను కూడా చింతపండుకు కలిపి ప్రయోగాలు చేస్తుంటారు థాయి మగువలు. సౌందర్య సాధన కోసం ప్రత్యేక చింతపండు పేస్టుకు థాయిలాండ్‌లో గిరాకీ ఎక్కువే.


సముద్ర తీరంలోని ఇసుకతో...

ఎప్పుడైనా బీచ్‌కి వెళ్లినప్పుడు సముద్రాన్ని, నీలాకాశాన్ని, చల్లని గాలిని ఆస్వాదించడమే కాకుండా... అక్కడి మెత్తటి ఇసుకతో కాళ్లూచేతుల్ని మర్దన చేసుకోవడం మర్చిపోకండి. ఈ ‘బీచ్‌ సాండ్‌ ష్రబ్‌’ను ఎక్కువగా వినియోగిస్తారు బ్రెజీలియన్లు. వాళ్లు బీచ్‌కు ఓ చిన్నపాటి బ్యాగ్‌తో వెళతారు. ఓ కప్పులో రెండు స్పూన్ల ఇసుక, మరో రెండు స్పూన్ల మసాజ్‌ ఆయిల్‌ ను కలిపి కాళ్లూచేతులకు పట్టిస్తారు. అరగంట తరవాత సముద్ర అలలలో కడిగేస్తారు. ఇలా చేయడం వల్ల చర్మం మెత్తగా, కాంతిమంతంగా అవుతుందని బ్రెజిల్‌ మహిళలు ఆచరణలో చేసి చూపెడుతున్నారు.


టీ పొడి పేస్ట్‌...

అర్జెంటీనాలో ‘యేర్బా మాటే’ టీ ఓ సాంస్కృతిక చిహ్నం. ఆ దేశంలో యేర్బా పాపులర్‌ పానీయం. యేర్బా మాటేని ప్రస్తుతం సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటున్నారు. సౌందర్యసాధనలో విరివిగా వినియోగి స్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఎక్కువ. కెఫీన్‌ స్థాయులు అధికం. కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ని నివారిస్తుందని, చర్మాన్ని తాజాగా ఉంచుతుందని, ముడతలు లేని చర్మాన్ని అందిస్తుందని అర్జెంటీనా మహిళలు చెబుతారు. ఇంటి దగ్గర తాజాగా చేసుకోలేని వారి కోసం రెడీమేడ్‌ యేర్బా మాటే పేస్టులూ అందుబాటులోకి వచ్చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

Read Latest Telangana News and National News

Updated Date - May 04 , 2025 | 08:27 AM