Reverse Driving: ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:09 PM
ఇటీవల పెళ్లైన ఓ యువకుడు భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుని కారును రివర్స్‌లో డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలు ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేయాలనుకోవడం, మెప్పించేందుకు ప్రయత్నించడం సాధారణమే. ముఖ్యంగా యువజంటల్లో ఇలాంటి ఉత్సాహం కనిపిస్తుంటుంది. ఇందులో తప్పు లేదు. అయితే, ముందూవెనకా ఆలోచించకుండా రెచ్చిపోతే మాత్రం చిక్కుల్లో పడకతప్పదు. ఈ విషయాన్ని ఓ యువకుడు (Chennai Man Drives in Reverse) స్వానుభవంతో తెలుసుకున్నాడు. చెన్నైలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా ఆసక్తి రేపుతోంది.
మెరీనా బీచ్‌కు సమీపంలో కామరాజార్ సాలై ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైలాపూర్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయ్యింది. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో అతడు కారులో భార్యతో పాటు షికారుకు బయలుదేరాడు. తన డ్రైవింగ్ స్కిల్స్‌తో ఆమెను ఇంప్రెస్ (Impress Wife) చేద్దామనుకున్నాడు.
ఈ క్రమంలో కారును వెనక్కు తోలుతూ తన టాలెంట్‌ను ప్రదర్శించాడు. అలా కొంత దూరం వెళ్లాక అతడు ఓ కానిస్టేబుల్ కంట పడ్డాడు. పోలీసు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కంగారు పడ్డ అతడు మరో సందులోంచి కారు పోనిచ్చి తప్పించుకున్నాడు. కానీ అతడిది విఫలయత్నమే అయ్యింది.
సీసీటీవీ కెమెరా ద్వారా కారు, ఓనర్ వివరాలను పోలీసులు గుర్తించారు. అభిషేక్‌కు ఫోన్ చేసి స్టేషన్ రావాలని ఆదేేశించారు. భార్య, లాయర్‌తో పాటు వచ్చిన అభిషేక్ జరిగింది చెప్పాడు. భార్యను ఇంప్రెస్ చేసేందుకు అలా చేశానే తప్ప మరో ఉద్దేశం లేదని అన్నాడు. కానీ పోలీసులు మాత్రం అతడికి భారీ ఝలక్ ఇచ్చారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని అభిషేక్‌పై ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసిన నేరం కింద కేసు నమోదు చేశారు. కారుతో పాటు దాని డాక్యుమెంట్స్, లైసెన్స్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇలా యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కైనందుకు నెట్టింట ఈ ఉదంతం చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు సరైన పని చేశారని కొందరు అంటే యువకుడి పరిస్థితి తలుచుకుని కొందరు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
ఇవి కూడా చదవండి:
45 లక్షల శాలరీనా.. ఇంత తక్కువైతే ఎలా.. టెకీ అభ్యంతరం నెట్టింట వైరల్
ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..
Updated Date - Jun 22 , 2025 | 01:15 PM