MP Viral Video: కారులో కూర్చుని డబ్బులు పంచిన ఎంపీ.. ఎగబడ్డ జనం..
ABN, Publish Date - Aug 13 , 2025 | 10:17 AM
MP Viral Video: కారులో రన్నింగ్ ఉన్నా.. జనం మాత్రం ఆగలేదు. పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఆయన దాదాపు 30 మందికి డబ్బులు పంచారు. వారిలో చిన్న పిల్లలు, ఆడవాళ్లు కూడా ఉన్నారు.
ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఊర్లకే ఊర్లే నీటిలో మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్‌లోని రూపౌలీ, కుర్సేలా గ్రామాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. లోక్ సభ సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఆగస్టు 9వ తేదీన వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని దగ్గరుండి పంపిణీ చేయించారు. అక్కడినుంచి తిరిగి వెళ్లిపోతున్నపుడు చోటుచేసుకుంటున్న ఓ సంఘటన ఆయనను విమర్శల పాలు చేస్తోంది.
పప్పు యాదవ్ కారులో వెళుతూ తన దగ్గర ఉన్న వంద నోట్ల కట్టలోంచి కొన్ని నోట్లు తీసి ఓ ఇద్దరు జనాలకు పంచారు. అంతే.. అది చూసిన మిగితా వాళ్లు కారును చుట్టుముట్టారు. అద్దం దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఒక్కో నోటు పంచుతూ ఉన్నారు. కారులో రన్నింగ్ ఉన్నా.. జనం మాత్రం ఆగలేదు. పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఆయన దాదాపు 30 మందికి డబ్బులు పంచారు. వారిలో చిన్న పిల్లలు, ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘కారులో కూర్చుని, ఏసీ ఆస్వాదిస్తూ పేద వాళ్లకు డబ్బులు పంచటం ఏ మాత్రం బాగోలేదు. ఇది చాలా దారుణం’..‘అతడేమన్నా వీధికుక్కలకు బిస్కెట్లు పంచుతున్నాడా? సిగ్గుండాలి’..‘పేదవాళ్లకు డబ్బులు పంచి, వీడియో తీసి వారిని ఎగతాళి చేయొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎంపీ పంచిన డబ్బులు ఆయన సొంత డబ్బులా లేక వరద బాధితుల కోసం తెచ్చినవా? అన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ ఆగ్రహం
2 మార్కులు తక్కువ వేసిందని టీచరమ్మపై దారుణం..
Updated Date - Aug 13 , 2025 | 10:20 AM