Kotwalaguda Eco Park: కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:09 AM
Kotwalaguda Eco Park: అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ ఎకో పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ పార్కులో పక్షిశాల సిద్ధమైంది.
కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సేవ కంటే రాజకీయాలు, ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నిలిచిపోయిందని అన్నారు. పార్క్ పనుల ఆలస్యంపైన ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల క్రితమే మెజార్టీ భాగం పనులను పూర్తి చేసింది.
అయినా ఈరోజు వరకు పార్క్ ప్రారంభం కాని దుస్థితి. కొత్వాల్‌గూడ ఎకో పార్క్.. హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ స్థాయి పార్క్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అసమర్థత, నిర్లక్ష్యం ప్రధాన లక్షణాలుగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి పనులు పక్కనపెట్టి ప్రచార యాత్రలకే ప్రాధాన్యత ఇస్తుస్తోంది. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచే ఈ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అశక్తతతో నిలిచిపోయింది. ఇది నిస్సహాయ ప్రభుత్వం, నిస్సహాయ పాలన’ అంటూ మండిపడ్డారు.
ఎకో పార్క్ వివరాలు..
అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ ఎకో పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ పార్కులో పక్షిశాల సిద్ధమైంది. ప్రపంచం నలుమూలలనుంచి దాదాపు 15వందల రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు రోజంతా అక్కడే గడిపేవిధంగా వివిధ రకాల అడ్వెంచర్ గేమ్స్‌ను కూడా రూపొందిస్తున్నారు. స్కై బ్రిడ్జి, రోలర్ కోస్టర్‌చ జిప్‌లైన్, క్లైంబింగ్‌వాల్, సస్పెన్షన్ బ్రిడ్జి, జాయింట్ స్వింగ్, ఫ్లయింగ్ కప్, హ్యుమన్ స్లింగ్‌షాట్, జిప్ బైక్, 360 డిగ్రీల ఫ్లైయింగ్ సైకిల్, రోప్ కోర్సు, బంగీ ట్రంప్‌లైన్ గేమ్స్ ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి
2 మార్కులు తక్కువ వేసిందని టీచరమ్మపై దారుణం..
కర్రీ పఫ్‌లో పాము.. షాక్ అయిన మహిళ..