Techie's Side Business: క్యాబ్ బుక్ చేసిన యువతి.. కారు డ్రైవర్‌గా తన బాస్ రావడంతో..
ABN, Publish Date - May 26 , 2025 | 01:27 PM
తన మేనేజర్ సైడ్ బిజినెస్ కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారాడని తెలిసి ఓ యువతి షాకైపోయింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారడంతో పాటు జనాలకు నవ్వు కూడా తెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఆఫీసులో తన బాస్. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. అంతటి స్థాయి కలిగిన వ్యక్తి సైడ్ బిజినెస్ కింద చేసే పని ఏంటో తెలిసి ఓ యువతి షాకైపోయింది. ఈ విషయాన్ని తనకు తెలిసిన వారితో పంచుకుంది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాస్ సైడ్ బిజినెస్‌కు అసలు కారణం మరొకటి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఓ టెక్ కంపెనీలో పని చేసే యువతికి ఈ అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె ఊబెర్‌లో క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్‌ను చూశాక మాత్రం భారీ షాక్‌కు గురయ్యింది. కారణం.. అతడు ఆమె బాసే. తనకంటే ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా క్యాబ్ నడపడం ఏంటో ఆమెకు అర్థం కాలేదు.
తాను క్యాబ్ నడుపుతోంది డబ్బుల కోసం కాదని తన బాస్ చెప్పినట్టు ఆమె తెలిపింది. రోజువారీ ఆఫీసు పనులతో తాను విసిగిపోతున్నానని, కాస్త డిఫరెంట్‌గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇలా క్యాబ్ నడుపుతున్నానని బాస్ చెప్పినట్టు యువతి పేర్కొంది. బోర్ కొడుతున్నట్టు ఉండటంతో ఇలా వెరైటీ వ్యాపకాన్ని ఎంచుకున్నానని బాస్ చెప్పినట్టు వెల్లడించింది.
ఇక ఈ పోస్టుపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బెంగళూరులో లైఫ్ ఇలాగే ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. అనేక మంది టెకీలు రోజూ చేసే పని బోర్ కొట్టడంతో ఇలాంటి సరదా పనులు అనేకం చేస్తుంటారని అన్నారు. ఇలా రెండు పనులను సులువుగా నేర్పుగా చక్కబెట్టేస్తుంటారని, బెంగళూరు స్టార్టప్ కల్చర్‌కు ఇది నిదర్శనమని కామెంట్ చేశారు.
కొందరు మాత్రం ఈ వివరణలపై సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల కోసమే ఆమె బాస్ డ్రైవర్‌గా మారి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వాహనాల రద్దీ బీభత్సంగా ఉండే బెంగళూరు లాంటి నగరాల్లో టైమ్ పాస్ కోసం డ్రైవింగ్ చేయాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించారు. కేవలం సరదా కోసం బాస్ డ్రైవర్‌గా మారాడంటే నమ్మశక్యం కాదని స్పష్టం చేశారు. ఆర్థిక ఒడిదుడుకులే అతడిని ఇలాంటి పనికి పురిగొల్పి ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి దృశ్యాలు బెంగళూరుకే పరిమితం కాదని కొందరు అన్నారు. ఇతర మెట్రో నగరాల్లో ఈ తరహా ఉదంతాలు వెలుగు చూశాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లిళ్ల కోసం చైనా యువకుల పాట్లు.. రిస్క్ వద్దంటూ ప్రభుత్వం హెచ్చరిక
భారతీయ ఆస్ట్రోనాట్ శుభాన్షూ శుక్లాకు క్వారంటైన్.. కారణం ఇదే
Updated Date - May 26 , 2025 | 01:31 PM