ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేస్తా...
ABN, Publish Date - Jun 22 , 2025 | 07:43 AM
‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ సినిమా వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఎందుకంటే కచ్చితంగా అందులో ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ఇన్నేళ్లలో నిలబెట్టుకున్నారు.
‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ సినిమా వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఎందుకంటే కచ్చితంగా అందులో ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ఇన్నేళ్లలో నిలబెట్టుకున్నారు. 18 ఏళ్ల క్రితం ‘తారే జమీన్‌పర్’ అని, తాజాగా ‘సితారే జమీన్ పర్’ అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలివి...
కృష్ణుడిగా నటిస్తా...
‘మహాభారతం’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ఏడాది దీని పనులు మొదలెట్టాలని అనుకుంటున్నా. దీని రచనకే కొన్ని ఏళ్లు పడుతోంది. ఒకే సినిమాలో భారతాన్ని చూపించలేం. అందుకే సిరీస్‌గా అందించాలని నిర్ణయించుకున్నా. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇండస్ట్రీలోని ఎంతోమంది దర్శకులు దీని కోసం వర్క్ చేయనున్నారు. ఇందులో కృష్ణుడి పాత్ర నన్నెంతో ప్రభావితం చేసింది. అందుకే కృష్ణుడిగా నటించాలనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌తో మనదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించి, ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయాలనేదే నా ఆశ.
కెరీర్ ముగిసిందనుకున్నా...
కెరీర్ తొలినాళ్లలో నేను నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసబెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక ఒకేసారి పది సినిమాలకు సంతకం చేశా. తీరా చూస్తే అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. దాంతో కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నా. క్రమక్రమంగా ఆఫర్లు తగ్గాయి. ఇక నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా. డబ్బు, కీర్తి లేదా పెద్ద బ్యానర్ కోసం సినిమాలకు సంతకం చేయకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. అప్పటినుంచి మనసుకు నచ్చిందే చేస్తున్నా.
ఖాన్‌త్రయం
మా ముగ్గురిని (ఆమిర్, షారుక్, సల్మాన్) వెండితెర మీద కలిపి చూడాలని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి వాళ్లతో కలిసి సినిమా చేయడానికి నేనూ సిద్ధంగానే ఉన్నా. ‘ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాం. మన ముగ్గురం కలసి సినిమా చేయకపోతే అభిమానులు బాధపడతారు. కనీసం ఒక్క చిత్రమైనా కలసి చేద్దామ’ని వాళ్లతో ఓసారి చెప్పాను. దానికి వాళ్లు కూడా ఓకే అన్నారు. ఆసక్తికర స్ర్కిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాం.
మణిరత్నంతో పనిచేయాలనుంది
దర్శకుడు మణిరత్నంకు నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పని చేయాలని ఎంతోకాలం నుంచి అనుకుంటున్నా. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన్ని కలిశాను. ఆయన ఇంటికి కూడా వెళ్లాను. మా కాంబినేషన్‌లో ‘లాజో’ అనే సినిమా కూడా ఫిక్స్ చేశాం. అన్ని అనుకున్నట్టే జరిగితే అది ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పటికీ ఆయనంటే అభిమానం అలాగే ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్ నాకెంతో నచ్చుతుంది. తప్పకుండా ఏదో ఒకరోజు ఆయనతో కలిసి పని చేస్తా.
తన కోసం పాటలు పాడుతా...
నేను, గౌరీ స్ర్పాట్ అనుకోకుండా కలిశాం. ఆ తర్వాత స్నేహితులమయ్యాం. కొన్నేళ్ల తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నాం. నిజానికి తను హిందీ సినిమాలు చాలా తక్కువ చూస్తుంది. నేను నటించిన ‘లగాన్’, ‘దంగల్’, ‘దిల్ చాహ్‌తాహై’ మాత్రమే చూసింది. నేను పాడే పాటలంటే తనకు చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు సరదాగా తన కోసం పాటలు పాడుతుంటా. గౌరీ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటుంది. ఆమెను కలవడం కోసం నేనే అక్కడికి వెళ్తుంటా.
పర్సనల్ ఛాయిస్...
- యవ్వనంగా కనిపించడం కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. నేను అలాంటి పనులు చేయను. ఏ క్రీములు రాయకపోవడమే నా యవ్వన రహస్యం.
- నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అన్ని రకాల పుస్తకాలు తిరగేస్తుంటా. ముఖ్యంగా ఆటో బయోగ్రఫీ, మిస్టరీ బుక్స్ చాలా శ్రద్ధగా చదువుతా.
- రణబీర్ కపూర్ అంటే ఇష్టం. ‘బర్ఫీ’ చూసి అతడి నటనకు ఫిదా అయిపోయా.
- దిలీప్‌కుమార్, రాజ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, వహీదా రెహ్మన్.. వీళ్లే నాకు ప్రేరణ.
- ఎక్కువసార్లు చూసిన సినిమా- త్రీ ఇడియట్స్
- నేను సినిమా రివ్యూలు చదవను. నా దృష్టిలో సినిమా రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం. అంతేకానీ క్వాలిటీని గుర్తించే కొలమానం కాదు.
- కథకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తా. అయితే అవి నా వయసుకు తగ్గట్టుగా ఉండాలి. 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించే పాత్రలు చేయాలనుకోవడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2025 | 07:43 AM