బామ్మగారి సాహసం..
ABN, Publish Date - Jul 13 , 2025 | 09:42 AM
ఈమధ్య ఒక బామ్మగారు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ విస్తుపోయేలా చేశారు. 88 ఏళ్ల వయసులో వందల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంపై ఆమె నిల్చునే సాహసం చేశారు. హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫీట్స్ చేసి, సాహసాలకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు యూకేకు చెందిన గిల్ క్లే.
ఈమధ్య ఒక బామ్మగారు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ విస్తుపోయేలా చేశారు. 88 ఏళ్ల వయసులో వందల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంపై ఆమె నిల్చునే సాహసం చేశారు. హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫీట్స్ చేసి, సాహసాలకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు యూకేకు చెందిన గిల్ క్లే.
యువతలో స్ఫూర్తి నింపేందుకు గిల్ క్లే అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. అందుకోసం రకరకాల ఫీట్స్ చేసి, న్యూస్‌మేకర్‌గా నిలుస్తారు. యూకేలోని కౌబ్రిడ్జ్‌కు చెందిన గిల్ క్లే ‘స్కౌట్స్’ లీడర్‌గా పనిచేస్తున్నారు. 40 ఏళ్లుగా స్కౌట్స్‌లో విశేష సేవలు అందిస్తున్నారు. నిజానికి ‘స్కౌట్స్’ను ప్రారంభించిన రాబర్ట్ బాడెన్ పావెల్ మనవరాలే ఈ గిల్ క్లే. ఇటీవల ఆమె స్కౌట్స్ విరాళాల కోసం విమానం పైభాగం లో నిలుచుని ప్రమాదకరమైన ఫీట్‌ను పూర్తి చేశారు.
గంటకు 240 కి.మీ వేగంతో ప్రయాణించిన విమానంపై నిల్చోవడం అంత సులువు కాదు. పేరొందిన స్టంట్‌మ్యాన్‌లు సైతం అలాంటి ఫీట్ చేయడానికి వెనకంజ వేస్తుంటారు. కానీ గిల్ క్లే మాత్రం సులువుగా ఆ ఫీట్ పూర్తి చేసి తన విల్‌పవర్ ఏంటో ప్రపంచానికి చాటింది. బామ్మగారు చూపిన తెగువకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వేల్స్‌లో స్కౌటింగ్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఈ ఫీట్ చేశారు.
గిల్ క్లే ఇలాంటి సాహసోపేతమైన ఫీట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో ‘వింగ్ వాక్’ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘‘యువత సాహసాలు చేసేలా ప్రోత్సహించాలి. వారికి జీవిత నైపుణ్యాలు నేర్పిం చాలి. ఎవరైనా సరే వయసును మరిచిపోవాలి. ఏది చేయాలనిపిస్తే అదే చేయాలి. స్కౌటింగ్ ద్వారా నేను అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నా. 40 ఏళ్లుగా స్కౌటింగ్ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫీట్స్ చేస్తున్నాను. వీటి ద్వారా వచ్చిన విరాళాలను స్కౌటింగ్‌కు అందిస్తాను’’ అంటున్నారామె.
రైలుకు గిల్ పేరు...
గిల్ క్లే గౌరవార్థం గ్రేట్ వెస్ట్రన్ రైల్వేకు చెందిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ఆమె పేరు పెట్టారు. స్కౌటింగ్‌లో ఆమె చేసిన సేవలకు గానూ ఈ గుర్తింపు లభించింది. స్కౌటింగ్‌తో అత్యుత్తమ అవార్డు అయినటువంటి ‘వోల్ఫ్’ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. ‘మా తాతయ్యే నా హీరో. ఆయనే 1907లో స్కౌట్స్‌ను ప్రారంభించారు. యువతకు అద్భుతమైన భవిష్యత్తును అందించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్ ఎంతగానో కృషి చేసింది. ఒక రైలుకు నా పేరు పెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను’’ అని అంటారు గిల్ క్లే. ఎనిమిది పదుల వయసులో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ బామ్మగారి క్రమశిక్షణ, పట్టుదల, తెగువ ఎంతైనా అభినందనీయం.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 13 , 2025 | 09:42 AM