విప్లవాగ్నికి ‘వంద’నం
ABN, Publish Date - May 04 , 2025 | 11:08 AM
‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా... మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా’ ఇది మన్యం వీరుడికి మహాకవి శ్రీశ్రీ పట్టిన అక్షర నీరాజనం. పాతికేళ్ల కుర్రాడు... పెద్దగా చదువుకోలేదు. కీర్తికాంక్ష పొందాలన్న ఆశ లేదు. డబ్బు సంపాదించాలన్న కోరిక లేదు.
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌వారికి ఎదురొడ్డి పోరాడిన వీరులు ఎంతోమంది. అందరూ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వారే. దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్ర సాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా. వారిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుది సాహసోపేతమైన పోరాటం. నమ్మిన లక్ష్యం కోసం ఆంగ్లేయులపై నిప్పుల వర్షం కురిపించిన ఈ యోధుడు దేశం కోసం అశువులు బాసి (మే 7కు) నూరేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆ విప్లవాగ్నికి ‘వంద’నాలతో... ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలే ఈ వారం కవర్‌స్టోరీ.
‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా... మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా’ ఇది మన్యం వీరుడికి మహాకవి శ్రీశ్రీ పట్టిన అక్షర నీరాజనం. పాతికేళ్ల కుర్రాడు... పెద్దగా చదువుకోలేదు. కీర్తికాంక్ష పొందాలన్న ఆశ లేదు. డబ్బు సంపాదించాలన్న కోరిక లేదు. రామరాజు ఆధ్యాత్మికవాది. వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రాలను అభ్యసించాడు. కవిత్వం రాశాడు. ధ్యాన సాధనలో ఆరితేరాడు. అయినా, ఆయన విశ్వాసాలు, నమ్మకాలు ఎన్నడూ మరొకరి మీద రుద్దలేదు. కాషాయం కట్టలేదు. సమస్యల నుంచి పలాయనం చిత్తగించనూ లేదు. కష్టాలు, సుఖాలు పూర్వ జన్మసుకృతాలని బోధించనూలేదు. బాల్యంలోనే తండ్రి వెంకటరామరాజు తాపిన స్వాతంత్య్రభావాల ఉగ్గు రామరాజులో పరాయి పాలనమీద ఉక్రోషాన్ని రగిలించింది. విదేశీ విద్య వట్టి మిథ్య అని నూనూగుమీసాల వయసులోనే తేల్చేశాడు. చదువుకు స్వస్తి చెప్పి, తాలీంఖానాలకు వెళ్లాడు.
కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చాడు. హిందీ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల మీద పట్టు సాధించాడు. 19 ఏళ్ల వయసులో కాలినడకన ఉత్తర దేశం పర్యటించాడు. పుణ్యక్షేత్రాలు తిరిగాడు. పుణ్యతీర్థాల్లో మునిగాడు. చివరికి ధ్యాన సాధన సంకల్పంతో 1917లో అల్లూరి మన్యం బాట పట్టాడు. అక్కడ అభం శుభం తెలియని అడవి బిడ్డల ఈతి బాధలు చూసి చలించాడు. కళ్ల ముందు కష్టజీవుల కన్నీళ్లు పారుతుంటే తాను మాత్రం కళ్లు మూసుకొని కూర్చోగలడా? మన్యం వాసులను పట్టిపీడిస్తున్న తాగుడు వ్యసనం నుంచి విముక్తి చేసే ప్రయత్నం ప్రారంభించాడు. తగాదాల పరిష్కారానికి స్థానిక పంచాయితీలు ఏర్పాటుచేశాడు. చిన్నారులకు చదువుచెప్పడం మొదలుపెట్టాడు. రోగాలు చుట్టుముట్టినప్పుడు వైద్యుడిగా మారి సేవలందించాడు. గిరివాసుల ఆదరాభిమానాలు పొందాడు.
అన్యాయంపై తొలి తిరుగుబాటు
రామరాజు కథలో మొదటి విలన్ బాస్టియన్. చింతపల్లి తహసీల్దారుగా అతను చేసిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. నీతిలేని నిబంధనలను అడవి బిడ్డలపై రుద్ది, వారి కష్టాన్ని జరిమానాల రూపంలో దోచుకుతినడం, అన్యాయంగా శిస్తు వసూళ్లు చేయడం బాస్టియన్‌కు నిత్యకృత్యం. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణ కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన ఆరు అణాల వేతనంలో నాలుగు అణాలు అతగాడే నొక్కేయడం. అదేమని ప్రశ్నిస్తే, ఇళ్లు తగలబెట్టించడం. కొరడా దెబ్బలతో శిక్షించడం. ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, పిల్లలను హింసించడం... ఇలా బాస్టియన్ ఒడిగట్టిన దారుణాలు కోకొల్లలు. అవన్నీ చూస్తూ ఉండలేకపోయాడు రామరాజు. మన్యం జనానికి గొంతుకగా నిలిచాడు. గాము సోదరులు, ఎండు పడాల్, గోకిరి ఎర్రేసు వంటి వారిని కూడగట్టి సామాన్యుల రక్తమాంసాలు తినమరిగిన అవినీతి బాస్టియన్ మీద ఉన్నతాధికారులకు రామరాజు ఫిర్యాదు చేశాడు. అయినా, లాభంలేక పోయింది. చివరికి విశాఖ కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో రగిలిపోయాడు బాస్టియన్. అది భరించలేక, అల్లూరి మీద లేనిపోనివన్నీ అధికారులకు నూరిపోశాడు. ఇంతజేసిన బాస్టియన్ అచ్చమైన తెలుగువాడే. ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు.
ఆచితూచి అడుగు...
బాస్టియన్ మాటలు నమ్మిన ఉన్నతాధికారులు రామరాజు మీద సెక్యూరిటీ కేసు పెట్టారు. నెలరోజులు నర్సీపట్నంలో నిర్బంధించారు. ఆ కేసు విచారణలో పోలవరం డిప్యూటీ కలెక్టరు ఫజులుల్లాఖాన్ కూడా ఒకరు. ఆయన రామరాజు తండ్రికి చిన్ననాటి స్నేహితుడు. రాజుకు సాయపడాలన్న తలంపుతో ప్రభుత్వ కొలువులో అవకాశం ఇవ్వజూపాడు ఖాన్. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు రాజు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోడానికి వ్యవసాయం చేసుకుంటానన్నాడు రామరాజు. దాంతో పైడిపుట్ట గ్రామంలో యాభై ఎకరాల పొలం, జత ఎడ్లు, పాడి ఆవును ఖాన్ ఇప్పించాడు. అల్లూరి ఆశయం డబ్బు సంపాదనే అయితే కోరివచ్చిన అవకాశాలు బోలెడు. కానీ ఆ యోధుడి ఆలోచన మరోలా ఉంది. ప్రభుత్వ విశ్వాసాన్ని పొందినట్టే నటిస్తూ, విప్లవకారులను తయారుచేసే పని మొదలుపెట్టాడు. గిరిజనుల్లోని శక్తియుక్తులకు పదునుపెట్టాడు. పోలీసులతో స్నేహంగా మెలుగుతూ వారి వద్దే తుపాకీ వాడకం మీద తర్ఫీదు పొందాడు. అల్లూరి సీతారామరాజుది బ్రిటీషు పాలనపై కేవలం ఆవేశం కాదు, అంతకుమించి వారిని ఈ దేశం సరిహద్దుల నుంచి తరిమికొట్టాలన్న సుదీర్ఘ ఆశయం. అందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశాడు. అడవి బిడ్డలను సాయుధ వీరులుగా మలిచాడు. అదునుచూసి ఆయుధం పట్టి, సింహంలా స్వాతంత్య్ర సమరంలోకి దుమికాడు.
అలుపెరగని పోరాటం...
చింతపల్లి పోలీసుస్టేషన్ లూటీతో 1922, ఆగస్టు 22న విప్లవ ఢంకా మోగించాడు. అక్కడి నుంచి రెండేళ్లు అలుపెరగని పోరాటం సాగించాడు. ఆంగ్లేయుల గుండెల్లో బాకులు దింపాడు. అరాచక పాలకులకు అడవి బిడ్డల దెబ్బ రుచి చూపించాడు. దోపిడి, పీడనలతో అల్లాడుతున్న అమాయకులకు ఆయన ఒక మేల్కొలుపు. పోలీసు స్టేషన్ల మీద దండెత్తడం ఆయుధాలను పోగేయడం. తీసుకున్న ప్రతి వస్తువు వివరాలతో సహా బాహాటంగా ప్రకటించడం. ఇది రామరాజు ప్రత్యేకత. ఒక సందర్భంలో జ్వరంతో బాధపడుతున్న అగ్గిరాజుకు రొట్టెలు తీసుకొని బదులుగా పండ్లబుట్ట పంపిన నిజాయితీ అతనిది. ఆ సంగతి సంబంధిత అధికారికి లేఖ ద్వారా తెలిపాడు. సాండర్స్, టాల్బర్టు లాంటి సైనికాధికారులను భయపెట్టారు. కవర్ట్, హైటర్ లాంటి అధికారులను మట్టుబెట్టారు. మన్యంలో మొదలైన విప్లవం మైదానంలోకి పాకుతుందేమో అన్నంతగా మద్రాసు ప్రెసిడెన్సీ గుండెల్లో గుబులు పుట్టించిన ధీశాలి అల్లూరి.
వ్యూహాల్లో ఆరితేరినవాడు...
అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమ సేనానిగా దళాలను నడిపించాడు. నాయకుడిగా శత్రువు వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించాడు. ఆయన దెబ్బకు భయపడి అసోం, మలబారు పోలీసులను రంగంలోకి దింపారు. పలనాటి కలెక్టరుగా ఉన్న రూథర్ ఫర్డ్‌కు మన్యవిప్లవాన్ని అణచివేసే బాధ్యతలు అప్పగించారు. గూఢచారుల ద్వారా బ్రిటీషు సైన్యం ఎత్తులను ముందే పసిగట్టి చిత్తుచేయడంలో అల్లూరి ఆరితేరినవాడంటూ ఆంగ్లేయ సేనాని హోపెల్ నివేదికలోనూ ప్రస్తావించాడు. అదీ మన అగ్గిపిడుగు దార్శనికత. పోలీసు స్టేషన్ ముట్టడులు, ఆయుధాగారాల లూటీ... ఏమి చేసినా, ముందస్తుగా సమాచారం ఇచ్చి చేయడం మన సాహసవీరుడి స్పెషల్. బ్రిటీషు పాలకులపై పోరుసలిపిన రామరాజుకు జనం బ్రహ్మరథం పట్టారు. అన్నవరం వెళ్లిన ఆయన మీద పూలవర్షం కురిపించారు. నూతన వస్త్రాలు, నగదును బహూకరించారు. అయినా, ఆయన వస్త్రధారణ, జీవన విధానంలో మాత్రం మార్పు లేదు.
బలహీనతలు శత్రువుకు బలం...
ఒకటిరెండు అపజయాలు ఎదురైనా బ్రిటీషు సైన్యాన్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తూ, అప్రతిహతంగా ముందుకు సాగుతుంది మన్యం సైన్యం. అలాంటి సమయంలో హఠాత్తుగా ఒక విషాద వార్త. రామరాజు ఎడమభుజం మల్లుదొర పోలీసులకు చిక్కాడని తెలిసింది. తాగుడు, స్త్రీలోలత్వం మల్లు దొర బలహీనతలు. వాటికి దూరంగా ఉండాలని రామరాజు ఎన్నోసార్లు హెచ్చరించాడు. నిగ్రహశక్తిని కోల్పోయిన మల్లు దొర ఒకరోజు తాగిన మైకంలో బ్రిటీషు గూఢాచారి దగ్గర నోరు విప్పాడు. ఆ మరుసటినాడు ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డాడు. విప్లవోద్యమ రహస్యాలు కూపీలాగడం అధికారులకు సులువు అయింది. అదే సమయంలో ప్రభుత్వానికి సాయం చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు కొందరిని అగ్గిరాజు ఆవేశంతో శిక్షించాడు. ఆ దుందుడుకు చర్యలు సామాన్యుల మద్దతును దూరం చేశాయి. మరోవైపు విప్లవకారులకు సాయం అందించిన వారిని బ్రిటీషు సైన్యం వేధించడం మొదలుపెట్టింది. సానుభూతిపరుల ఇళ్లు తగలబెట్టించడం. కుటుంబంలోని మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం. చిన్నారులను చంపడంలాంటి అకృత్యాలు మితిమీరాయి.
అదే నాయకత్వం
అల్లూరి సైన్యంలో అగ్గిరాజు, పడాల్ లాంటి వారంతా అరెస్టు కాగా మరికొందరు పోరులో అశువులు బాశారు. విప్లవోద్యమంలో నేలకొరిగేవారే కానీ కొత్తగా చేరేవారెవరు? విప్లవకారుల ఆచూకీ చెప్పకపోతే చంపేస్తామని రూథర్‌ఫర్డ్ సమావేశం పెట్టిమరీ అనధికార ఫత్వా జారీచేశాడు. పరిస్థితిని ఊహించిన అల్లూరి సీతారామరాజు బలిదానానికి సిద్ధమయ్యాడు. తమ ప్రాణాలు అడ్డువేసైనా సరే రామరాజు ప్రాణాలు కాపాడుకోవాలని విప్లవోద్యమ కార్యకర్తలు ప్రతినబూనారు. రాజును అజ్ఞాతంలోకి వెళ్లమని బతిమాలారు. అయినా, వినలేదు! బ్రిటీషు సైన్యం సాగిస్తోన్న మారణహోమం ఆగాలంటే తాను లొంగిపోవడమే శరణ్యమని అనుకున్నాడు. 1924, మే7వ తేదీన నిరాయుధుడిగా సెలయేటి ఒడ్డునున్న రామరాజును పోలీసులు చుట్టుముట్టారు. అదే రోజు ఆ వీరుడిని పొట్టనపెట్టుకున్నారు. మేజర్ గుడాల్ కాల్చాడని కొందరు కాదు రూథర్‌ఫర్డే చంపేశాడని ఇంకొందరు రాశారు. ఏదేమైనా, బ్రిటీషు పాలకులు రామరాజును పొట్టనపెట్టుకున్నది నిజం. దాన్ని కప్పిపుచ్చడానికి పారిపోతుండగా కాల్చి చంపామని అబద్ధపు నివేదికనూ సృష్టించారు.
ఇదీ అల్లూరి ఆహార్యం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనగానే... ‘కాషాయ పంచె కట్టు, మెడలో రుద్రాక్షలు, నుదుట వీర తిలకం ధరించిన రూపం మన కళ్లముందు మెదులుతుంది. భుజానికి అమ్ములపొది తగిలించుకొని, విల్లు చేతబట్టిన విప్లవజ్యోతి నిలువెత్తు ఆకారమే ప్రతిచోటా దర్శనమిస్తుంది. నిజానికి అల్లూరి అత్యంత నిరాడంబరుడు. విప్లవోద్యమానికి ముందు వరకు తెల్లటి ధోవతి, చొక్క, ఉత్తరీయం... ఇదే ఆయన వస్త్రధారణ. అదీ ఒంటిమీదగాక మరొక పంచె మాత్రమే ఉండేదని ప్రత్యక్షంగా చూసినవారి కథనం. పోరులోకి దిగిన తర్వాత మాత్రం ఖాకీ రంగు ఖద్దరు చొక్కా, నిక్కరు రాజు యూనిఫాం. అవసరాన్నిబట్టి మెడలో తూటాల దండ. ఒక్కోసారి రెండు అడుగుల పేము బెత్తం కూడా అల్లూరి చేతిలో కనిపించేదట.
కారడవుల్లోనైనా, కాలినడకన దేశాటన చేసినా రామరాజు ప్రయాణమంతా ఒట్టి కాళ్లతోనే. బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన సీతారామరాజు ఎత్తు 5అడుగుల 4అంగుళాలు. చిన్ననాటి నుంచి యోగాభ్యాసం, వ్యాయామం ఆయన దినచర్యలో భాగం. కనుక బక్కపల్చని శరీరమైనా, పసిమి ఛాయ, వెన్నుమీదకు వేలాడే తలవెంట్రుకలు, గుబురు గడ్డంతో అల్లూరి రూపం బాల చంద్రుడిని తలపిస్తుండేదని కళ్లారా చూసినవారి మాట. అగ్గిపిడుగు స్వరం మాత్రం మృదు మధురం. ఇదీ ప్రత్యక్ష సాక్షుల వర్ణనే.!
అటవీ ఫలాలే ఆహారం...
‘మితంగా తినాలి. హితంగా ఆలోచించాలి’ నానుడికి రామరాజు పెట్టింది పేరు. పావుశేరు పాలు, అరటిపళ్లు, అటవీ ఫలాలు...అవే అల్లూరి ఆహారం. అదీ రోజులో రెండుసార్లు మాత్రమే. విప్లవోద్యమం కన్నా ముందు 1921లో చిక్కాలగడ్డలో నివసిస్తున్న కాలంలో... ‘అన్నం తినమని’ రామరాజును తల్లి సూర్యనారాయణమ్మ ఎంత బతిమాలినా, మెతుకు ముట్టేవాడు కాదట. ‘ఈనాడు మీరు కమ్మగా వండి వడ్డిస్తారు. మరి మీరంతా లేనినాడు పరిస్థితి ఏంటి.?’ అనేవారట. ఈ సంగతి సూర్యనారాయణమ్మ మనుమడు (కూతురు సీత కొడుకు)తో చెప్పారు. చిటికెల భాస్కరనాయుడు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన సమయంలోనూ రాజు పాలు, ఉడికించిన చిలగడ దుంపలు మాత్రమే తీసుకొనేవారని 1997, మే 25నాటి ఆదివారం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో... అల్లూరికి స్వహస్తాలతో ఆహారపదార్థాలు అందించిన భాస్కరుడి పెద్ద కూతురు చింతల సత్యనారాయణమ్మ ప్రస్తావించారు. చిన్నా పెద్ద మహిళలందరినీ ‘అమ్మా’ అని చాలా గౌరవంగా సంబోధించేవారట. కోపమెరుగని శాంతమూర్తిగా అల్లూరిని ఆమె కొనియాడారు.
బెంగాల్ వీరులతో పరిచయం
అల్లూరి మొదటి ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా ఒకసారి కోల్‌కతాలోని ప్రఖ్యాత జాతీయోద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలసినట్టు కొందరు చరిత్రకారులు ప్రముఖంగా రాశారు. భోజనానికి కూర్చొనే ముందు గుమ్మం ఎదురుగా పోతున్నవారిని ఇంట్లోకి పిలిచి సహపంక్తి భోజనం చేయడం సురేంద్రనాథ్‌కు అలవాటు. అలా ఒకరోజు అటుగా వెళుతున్న రామరాజును ఆహ్వానించారు. పదిహేను రోజుల పాటు బెనర్జీ ఇంట్లో బసచేసిన అల్లూరి ఆ సమయంలో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్, మాలవ్యలతో సంభాషించినట్లు డీకే ప్రభాకర్ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. అప్పుడే బేలూరులోని వివేకానంద మఠం, తక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరాన్ని రామరాజు సందర్శించారు.
పృధ్వీసింగ్‌తో మైత్రి
రాజవొమ్మంగి పోలీసు ఠాణామీద దాడి సందర్భంగా అక్కడ కారాగారం అనుభవిస్తున్న లాగరాయి పితూరి వీరయ్య దొరను రామరాజు దళం విడుదల చేసింది. ఆయన చేతికి ఆయుధం ఇచ్చి విప్లవసేనలోకి ఆహ్వానించింది. అది తెలిసి... రాజమండ్రి సెంట్రల్‌జైల్లో ఖైదుగా ఉన్న గదర్‌పార్టీ వీరుడు పృధ్వీసింగ్‌ను అల్లూరి విడిపించ డానికి వస్తున్నాడని జనంలో వదంతులు బయలుదేరాయి. దాంతో 500మంది సిపాయిలను జైలు చుట్టూ పహారాకు పెట్టారు. జనరేటర్ సాయంతో ఆ పరిసరాలలో విద్యుత్‌దీపాలు అమర్చి మరీ రాత్రింబవళ్లు కాపలా కాశారు. అదే సమయంలో రాజమండ్రి జైల్లో దువ్వూరి సుబ్బమ్మ రాజకీయ ఖైదుగా శిక్ష అనుభవి స్తున్నారు. పృధ్వీసింగ్‌తో అల్లూరికి పరిచయం ఉందన్నది ఒట్టి అపోహే అని దంతులూరి వెంకటరామరాజు కూడా తేల్చాడు.
రామరాజు దేశభక్తి అజరామరం
బ్రిటీషు సేనలకు లొంగిన తర్వాత కూడా అల్లూరికి ఒక అద్భుత అవకాశం తలుపుతట్టింది. రామరాజు అసమాన ప్రతిభా పాఠవాలు, పోరాట వ్యూహాలకు ముగ్థుడైన మేజర్ గుడాల్ ప్రభుత్వంతో చేతులు కలిపితే కల్నల్ స్థాయికి ఎదగచ్చని రామరాజుకు నచ్చజెప్పాడు. బతిమాలాడు. హోదాలకు, పదవులకు లొంగే మనిషా రామరాజు. ప్రజల కష్టానికి తప్ప మరిదేనికి కరగని నిష్ఠాగరిష్ఠుడు అల్లూరి. కాదని, ముఖంమీదే చెప్పాడు. ఆంగ్లేయుల దౌర్జన్యాలను దనుమాడాడు. అంతే.! అప్పటివరకు స్నేహ హస్తం చాచిన సైనికాధికారులు రామరాజు ఛాతీపైన తుపాకీలు ఎక్కుపెట్టారు. ‘విచారణ లేకుండా శిక్ష అమలు అన్యాయమని’ నిలదీశాడు రాజు. కుఠిలత్వమే ఆరో ప్రాణంగా మెలిగే ఆంగ్లేయ సైన్యానికి అవన్నీ ఒక లెక్కా.
రెండేళ్ల పాటు బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజును కొయ్యూరులో చెట్టుకు కట్టేసి మరీ కాల్చారు. మూడో కంటికి తెలియకుండా కృష్ణదేవి పేటలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. చితాభస్మాన్ని సైతం చూసి భయపడ్డ పోలీసులు వరహా నదిలో కలిపారు. అంతకు ముందుగా రాజు పార్థీవదేహాన్ని ఫొటో తీశారు. అదే అల్లూరి ఇకలేరనడానికి ఆనాటి ప్రధాన సాక్ష్యం. ‘ఒక అమాయకుడిని పట్టుకొని కాల్చి, రామరాజును చంపేశామని బ్రిటీషు ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని’ కొందరు భావించారు. ‘సాధువు వేషంలో రామరాజు స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడుపుతున్నాడని’ మరికొందరు అనుకున్నారు. అల్లూరిని చంపామని ఆంగ్లేయులు సంబురపడ్డారు. కానీ ఈనాటికి ప్రశ్నించే గళాలలో, అన్యాయంపై సంధించే పిడికిళ్లలో శ్రీ రామరాజు బతికే ఉన్నారు.
- సాంత్వన్
అల్లూరిపై అధ్యయనాలు
విప్లవ వీరుడి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో ముప్ఫైకుపైగా పుస్తకాలు వచ్చాయి. మరికొందరు గేయ, పద్య, నాటక, బుర్రకథ, నవల తదితర ప్రక్రియల్లో రచనలు చేశారు. ఒకరిద్దరు సినిమాలు కూడా తీసిన సంగతి తెలిసిందే.! అయితే, అల్లూరి జీవిత చరిత్ర రచనల్లో కొన్ని మాత్రమే ప్రామాణికం అనడంలో అతిశయోక్తి లేదు. భమిడిపాటి సత్యనారాయణ 1925లో ‘అల్లూరి సీతారామరాజు ప్రశంస’ పుస్తకం రాశారు. ఆ త్యాగధనుడి జీవితం మీద వచ్చిన తొలి పుస్తకం ఇదే.! తర్వాత పొన్నలూరి రాధాకృష్ణమూర్తి 1938లో రాసిన అల్లూరి జీవిత చరిత్రను బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది. యర్రమిల్లి నరసింహారావు, మల్లుదొర కలసి రాసిన ‘శ్రీ అల్లూరి సీతారామరాజు చరిత్ర’, అల్లూరి మేనల్లుడు దంతులూరి వెంకటరామరాజు ‘విప్లవవీరుడు అల్లూరి’, గోపరాజు నారాయణరావు ‘విప్లవాగ్ని అల్లూరి’, మాదల వీరభద్రరావు ‘అల్లూరి సీతారామరాజు’, డీకే ప్రభాకర్ ‘విప్లవజ్యోతి’ ప్రజాదరణ పొందాయి. చిటికెల దాలినాయుడు, కలియుగార్జున ఎమ్ కృష్ణారావు, కొడాలి లక్ష్మీనారాయణ, శేఖరమంత్రి శ్రీరామచంద్రరావు మరికొందరు కూడా అల్లూరి జీవిత చరిత్ర రాశారు. పడాల రామారావు ‘రాజు జీవిత చరిత్ర’లో మాత్రం కొంత కాల్పనికత కనిపిస్తుందని చరిత్ర అధ్యయనకారుల అభిప్రాయం. జోళపాళెం మంగమ్మ, పాలా కృష్ణమూర్తి లాంటి కొందరు చరిత్రకారులు అల్లూరి జీవితం మీద అధ్యయనాలు కొనసాగించి విలువైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అయ్యదేవర కాళేశ్వరరావు, ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్రల్లోనూ అల్లూరి ప్రస్తావన కనిపిస్తుంది.
పేరులో ‘సీత’ ఎవరు?
అల్లూరికి అమ్మానాన్న పెట్టిన పేరు ‘శ్రీరామరాజు’ మాత్రమే. మరి ఈ సీత ఎవరు.? విశాఖపట్నానికి చెందిన అల్లూరి స్నేహితుడి చెల్లెలు సీత. వీరిది సంపన్నకుటుంబం. సీత, రాజులది గాఢప్రేమ. ఇరువురు పెళ్లిచేసుకోవాలనుకున్నారు కూడా. అందుకు అమ్మాయి సోదరుడు కూడా అంగీకరించాడు. రాజు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లిన సమయంలో కలరా సోకి సీత కన్నుమూసింది. ప్రాణప్రదంగా ప్రేమించిన సీతను మరిచిపోలేక, సీతారామరాజుగా పేరు మార్చుకున్నాడు. తన మనసులో మరొకరికి స్థానం లేదని నిశ్చయించు కున్నాడు. ఇంకొకరిని పెళ్లాడడానికి నిరాకరించాడు. ఈ విషయాన్ని పొన్నలూరి రాధాకృష్ణమూర్తి రాశారు.
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన సినిమాలోనూ అదే చూపించారు. దీన్నే నిజమని చాలామంది నమ్మారు, ఈనాటికీ నమ్ముతున్నారు. అయితే, అల్లూరి లేఖల్లో సంతకం ‘శ్రీరామరాజు’ మాత్రమే కనిపిస్తుంది. ఒకటి, రెండు ఆనాటి పత్రికా ప్రకటనల్లో మినహా ఇదే పేరు అన్ని నివేదికల్లోనూ ప్రస్తావించారు. మన్యవాసుల హృదయాల్లోనూ ‘శ్రీరామరాజు’గా పదిలం. తర్వాత కాలంలోనూ తెన్నేటి విశ్వనాథంగారు విశాఖ అంతటా వెతికించినా, సీత కుటుంబం జాడ తెలియలేదట. ‘పత్రికలో సీతారామరాజు అని పొరపాటున రాయడంతో అదే పేరు స్థిరపడిందని’ అల్లూరి మేనల్లుడు దంతులూరి వెంకట రామరాజు రాశారు. సీత పాత్ర పూర్తిగా కల్పితమని నిర్ధారించారు. గోపరాజు నారాయణరావు, హోమియో వైద్యుడు రామచంద్రరాజు అధ్యయనంలోనూ అదే వెల్లడైంది.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు
ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్ అండ
Read Latest Telangana News and National News
Updated Date - May 04 , 2025 | 11:12 AM