Janahitha Padayatra: రాష్ట్రానికి శనిలా దాపురించిన కేంద్ర మంత్రి: పీసీసీ చీఫ్
ABN, Publish Date - Aug 03 , 2025 | 10:07 PM
జనహిత పాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితలు దోచుకున్న పైసలను పంచుకునేందుకే ఈ లొల్లి చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఆదివారం ఖానాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన హిత పాదయాత్రలో పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శనిలా దాపురించాడని విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తేంటే.. దానిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీసీలను ఎదిరించి బీజేపీ నాయకులు గెలుస్తారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
అసలు శ్రీరామునికి బీజేపీకి సంబంధం ఏమిటంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. దేవుని పేరు చెప్పి రాజకీయలేమిటంటూ బీజేపీ నేతలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.
గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులు తెలుసుకోవడానికే పార్టీ ఈ యాత్ర చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఇచ్చిన మాట తప్పకుండా హామీలను కాంగ్రెస్ పార్టీ నేరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు పూర్తిగా అమలు చేస్తామని ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
జనహిత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలాంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌లకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఆదివారం నిర్మల్ జగిత్యాల జిల్లాల సరిహద్దు గ్రామమైన బాదనకుర్తి వద్ద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావుల ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, వేద పండితులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం బాదనకుర్తి నది తీరంలోని శివాలయంలో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - Aug 03 , 2025 | 10:07 PM